కర్నూలు జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు - రెవెన్యూ ఉద్యోగులకు మధ్య అగ్గి రాజుకుంది. ఏకంగా జిల్లా సర్వోన్నతాధికారి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌పైనే రెవెన్యూ సిబ్బంది తిరుగుబావుటా ఎగరవేశారు. బానిసలుగా పనిచేయలేమని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తే అభినందనలు లేకపోగా.. అభిశంషలు ఏమిటని నిలదీశారు. కలెక్టర్, జేసీల వ్యవహరశైలిపై మండిపడుతూ జిల్లా రెవెన్యూ సర్వీసు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉస్సేన్, రామన్న, ట్రెజరర్ వేణు ఆధ్వర్యంలో గురువారం రాత్రి 7 గంటలకు రెవెన్యూ ఉద్యోగులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
సంఘం భవనంలో జరిగిన ఈ సమావేశం రాత్రి 10 గంటల వరకూ సాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కలెక్టర్, జేసీలు రెవెన్యూ ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న అంశంపైనా ఉద్యోగులందరూ చర్చించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, జేసీల వైఖరి మార్చుకునే వరకూ ఫిబ్రవరి 2 నుంచి వర్క్ టు రూల్ పాటించడం ద్వారా నిరసన తెలపాలని సమావేశంలో నిర్ణయించారు. అప్పటికీ కలెక్టర్, జేసీలు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించాలని సమావేశం తీర్మానించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపడతామని ప్రకటించారు.
సౌకర్యాలు కల్పించకుండా చిందులా?
ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా పని కాలేదంటూ తమపై చిందులేయడం ఎంత వరకు సమంజసమని రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోయినప్పటికీ తాము పనిచేస్తున్నామని... అయినప్పటికీ తమను వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామని... వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నామని వాపోయారు. ఒక్కరూపాయి బడ్జెట్ ఇవ్వకుండా పనికాలేదని తమపై మండిపడటం సరికాదని స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే పనిచేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
తమ తప్పు ఏమాత్రమూ లేకపోయినా తమనే నిందించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రధానంగా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడిన తీరుతో పాటు సీ బ్యాంకు రైతు బజారు వద్ద ఆక్రమణల కూల్చివేత విషయంలో కల్లూరు ఎమ్మార్వోపై కలెక్టర్ వ్యవహరించిన శైలి, వాడిన పదజాలంపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో కలెక్టరేట్, ఆదోని, నంద్యాల, కర్నూలు డివిజన్ అధ్యక్షుడు, కార్యవర్గ సిబ్బందితో పాటు 54 మండలాలకు గానూ 46 మండలాల తహశీల్దార్లతో పాటు పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బానిసలుగా పనిచేయలేం!
Published Fri, Jan 30 2015 10:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM
Advertisement
Advertisement