ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్ : ఎమ్మిగనూరు కాటన్ మార్కెట్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్(జేడీ) రామాంజనేయులు తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మిగనూరులో పత్తి కొనుగోలుకు బయ్యర్స్ ముందుకు రాకపోవడంతో రూ.2కోట్లతో కాటన్ మార్కెట్‌ను నిర్మించామని, అయితే కొనుగోళ్లను ప్రారంభించలేకపోతున్నామన్నారు.
గత ఏడాదే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించాలని చూసినా తగ్గిన పత్తి ధర ప్రభావం వల్ల వారు ఆసక్తి చూపలేకపోయారన్నారు. ఈ సారి ఏలాగైనా సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయించి కొనుగోళ్లకు స్వీకారం చుడుతామన్నారు. ఇక్కడ పత్తి కొనుగోలు ప్రారంభమైతే ఆదోని మార్కెట్ యార్డ్‌పై ఒత్తిడి తగ్గ్గుతుందన్నారు.
హమాలీల సమస్యపై చర్చించిన ఆర్‌జేడీ : స్థానిక మార్కెట్ యార్డ్ హమాలీల సమస్య పరిష్కారం కోసం జేడీ రామాంజనేయులు కమీషన్ ఏజెంట్లు, బయ్యర్స్‌తో చర్చించారు. లెసైన్సులు రెన్యువల్ చేయడంతోపాటు కమిషన్ ఏజెంట్లు, బయ్యర్స్ సూచించిన వారికి కొత్త లెసైన్సులు ఇచ్చేందుకు తమకు ఏలాంటి అభ్యంతరం లేదన్నారు.
రెన్యువల్, కొత్త లెసైన్సుల మంజూరుపై హమాలీలు, రాజకీయ నాయకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో బయ్యర్స్ అంగీకరించారు. జేడీని కలిసిన వారిలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహ్మద్‌ఉసేని, కమిషన్ ఏజెంట్‌లు ప్రతాప్ ఉరుకుందయ్యశెట్టి, జగన్నాథ్‌రెడ్డి, కాకర్ల నాగరాజు, బందెనవాజ్, గోపాల్‌రెడ్డి, కందనాతి శ్రీనివాస్‌రెడ్డి, బయ్యర్స్ నటరాజ్, మహాబలేశ్వర తదితరులు పాల్గొన్నారు.