CCI center
-
కొను‘గోల’!
సాక్షి, కొడంగల్: నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మోసపోతున్నారు. దళారులకు పత్తి విక్రయించి ధరలోనూ, తూకంలోనూ నష్టాలపాలవుతున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. వికారాబాద్ జిల్లా మారిన తర్వాత కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని ఇక్కడి రైతులు ఆశించారు. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది వికారాబాద్, పరిగి, తాండూరు పట్టణాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొడంగల్‌ను మాత్రం విస్మరించారు. రైతులకు సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆరుగాలం కష్టించి పండిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గంలోని నల్లరేగడి భూముల్లో పత్తి మంచి దిగుబడి వస్తుంది. ఇప్పటికే రైతులు పత్తిని ఏరుతున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో దిగుబడి అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ అధికారులు ఈ ప్రాంతంలో కంది, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో రూ.3 కోట్ల వ్యయంతో గోదాం నిర్మించారు. ఈ గోదాంలో 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రభుత్వం ఈ గోదాములో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. సెంటర్ ఏర్పాటుచేయాలి మార్కెటింగ్ అధికారులు కొడంగల్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చే యాలి. ప్రభుత్వం పత్తిని కొంటే రైతులకు మేలవుతుంది. ధరలోనూ, తూకంలోనూ మోసం జరగదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కొడంగల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం. మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ అధికారులు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. – బస్వరాజ్, పీఏసీఎస్ చైర్మన్, కొడంగల్ -
నేడు సీసీఐ కేంద్రం ప్రారంభం
నేలకొండపల్లి: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం సీసీఐ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి ఆలీం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సీసీఐ కేంద్రాన్ని ప్రారంభిస్తోందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా కేంద్రంలోనే పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరలిలా.. పత్తి పొడువు పింజ రకం,రూ.4050. మధ్యరకం.రూ.3750. రైతులు పాటించాల్సిన నిబంధనలు... పత్తిని బస్తాలు, బోరాలలో కాకండా బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎం, లారీలలో విడిగా అమ్మకానికి తీసుకరావాలి. పత్తి సహజ రంగు మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ 8 శాతానికి తక్కువగా ఉండాలి. మార్కెట్ కమిటి ఇచ్చిన టోకెన్‌లో తెలిపిన ప్రకార ం తీసుకరావాలి. కేంద్రానికి వచ్చేటపుడు మీ సేవా, లేదా పట్టాదారు పాసుపుస్తకం తీసుకుని రావాలి. పత్తిలో అపరిపక్వమైన కాయలను వేరు చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మ రెమ్మలు, చెత్త లేకుండా శుభ్రం చేయాలి. అమ్మకాల అనంతరం రైతుకు ఆన్లైన్ ద్వారా 48 గంటలలో డబ్బు అందుతుంది. అందుకు రైతుల బ్యాంక్ పుస్తకాల జిరాక్స్పత్రాలు తేవాలి. మార్కెట్ యార్డులో బీడీలు, సిగిరెట్లు కాల్చటం, వంట చేసుకోవటం లాంటివి చేయకూడదు. -
ఉన్నా..ఉపయోగమేదీ..
మార్కాపురం, న్యూస్‌లైన్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పత్తి కొనుగోలు చేసేందుకు మార్కాపురంలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వారికి అక్కరకు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ధర క్వింటాకు రూ. 4 వేలు కాగా..బయటి మార్కెట్లో దళారులు రూ. 4,300కు కొనుగోలు చేస్తుండటంతో మార్కాపురంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం రైతులు లేక వెలవెల బోతోంది. గత నెల 12న మార్కాపురంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 9 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే రైతులు యార్డుకు తీసుకొచ్చి విక్రయించారు. ప్రభుత్వం క్వింటా పత్తిని రూ.4 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 8 శాతం తేమ కలిగి, 29.5 మి.మీ నుంచి 30.5 మి.మీ పత్తిని పై ధరకు కొనుగోలు చేస్తారు. ఆ తరువాత తేమ శాతం పెరిగితే పాయింట్‌కు రూ. 40 చొప్పున తగ్గిస్తారు. 9 శాతం తేమ ఉంటే రూ. 3,960, పది శాతం ఉంటే రూ. 3,920 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి వర్షాలు లేకపోవడం, తేమ కచ్చితంగా 8 శాతం ఉండటంతో నాణ్యమైన పత్తి వస్తోంది. దీంతో వ్యాపారులు క్వింటా రూ. 4,200 నుంచి రూ. 4,300 వరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. విధానాల్లో లోపం... రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే మార్కెట్లో వ్యాపారులు ప్రభుత్వ ధరకు సమానంగా కొనుగోలు చేస్తారు. ఈ దఫా ఇందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. గిద్దలూరు నుంచి మార్కాపురానికి రైతులు లారీ పత్తి తీసుకురావాలంటే అదనంగా రూ. 6 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒక్కో బోరంలో పత్తిని ఎత్తి, దించడానికి కూలీలు రూ. 30 తీసుకుంటున్నారు. ఇందులో 70 నుంచి 90 కిలోల పత్తి ఉంటుంది. ఒక్కో లారీకి 14 నుంచి 15 బోరెల పత్తి ఎత్తుతారు. దీంతో పాటు బాడుగ సుమారు రూ. 5 వేలు ఉంటుంది. తీరా ఇంత కష్టపడి యార్డుకు తీసుకొస్తే రూ. 4 వేలకు మించి కొనుగోలు చేయబోమని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వేళ అమ్మినా కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు చెక్కు మాత్రమే ఇస్తారు. బ్యాంకుకు వెళ్లి నగదుగా మారేసరికి పది రోజుల సమయం పడుతుంది. దళారులు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు అందజేస్తున్నారు. దీంతో యార్డుకు వచ్చి విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. మూడు రోజుల నుంచి యార్డులో విక్రయాలు నిలిచిపోయాయి. గత ఏడాది జనవరిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు లక్ష క్వింటాళ్ల పత్తిని వ్యాపారుల నుంచి కొనుగోలు చేయగా, ఈ ఏడాది 20 రోజులు గడిచినా 9 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వమే క్వింటా మద్దతు ధర రూ. 4,500 ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. కావాలనే ఆలస్యం చేశారు: పశ్చిమ ప్రకాశంలో పత్తి దిగుబడులు అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సంగతి సీసీఐ అధికారులకు కూడా తెలుసు. అప్పట్లో క్వింటా మద్దతు ధర రూ. 3,100 మాత్రమే ఉంది. రైతులు ఇళ్లలో దిగుబడులు ఉంచుకోలేక దళారులు చెప్పిన ధరకు విక్రయించారు. ఈ విధంగా సుమారు 60 శాతం పత్తిని విక్రయించారు. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. ఇప్పుడు కేవలం తక్కువ మంది రైతుల దగ్గర మాత్రమే పత్తి ఉంది. ఈ కేంద్రాన్ని నవంబర్‌లో ఏర్పాటుచేసి ఉంటే రైతులకు ఉపయోగంగా ఉండేది. ప్రస్తుతం మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్ డివిజన్ల పరిధిలోని 12 మండలాల్లో 37 వేల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. మిగిలిన 3 వేల హెక్టార్లను దర్శి, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి తదితర మండలాల్లో సాగు చేశారు. ఎకరా పత్తి సాగుకు రూ. 18 నుంచి రూ. 20 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. -
‘తెల్ల’బోయే
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలు, తగ్గిన దిగుబడి, కరువైన గిట్టుబాటు ధరలు రైతులను ‘తెల్ల’బోయేలా చేస్తే.. ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లకు దూరంగా ఉన్నాయి. జిల్లాలోని 17 వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మంగళవారం నాటికి ఒక్క క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదు. మార్కెట్లో దళారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లలో రోజు గరిష్టంగా రూ.4,400 నుంచి రూ.4,300 ప్రకటిస్తున్నా తేమ పేరిట రూ.340 నుంచి రూ.520 వరకు కోత విధిస్తుండటంతో క్వింటాల్‌కు రూ.3,850 కూడా గిట్టుబాటు కావడం లేదు. జిల్లాలో అంచనాకు మించి సాగైనా వర్షాలకు 1.20 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మృగ్యం కాగా, చేతికందిన పంటలకు గిట్టుబాటు దక్కడం లేదు. ‘గిట్టుబాటు’ పేరు.. ‘తేమ’తో కోత.. పత్తి కొనుగోళ్లు పద్ధతి ప్రకారం జరిగే విధంగా కలెక్టర్ అహ్మద్ బాబు గాడిన పెట్టారు. ఒకేసారి జిల్లాలోని మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,000 కాగా అక్టోబర్ 30న కొనుగోళ్ల సందర్భంగా రూ.4,520 ప్రకటించారు. ఆదిలాబాద్, భైంసా, లక్సెట్టిపేట, బోథ్, మంచిర్యాల తదిత ర మార్కెట్లలో రోజు పత్తి ధర మద్దతును ప్రకటిస్తున్నా, ఆ ధరను వ్యాపారులు కేవలం 15 నుం చి 20 క్వింటాళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆ త ర్వాత తేమ పేరిట కిలోకు ఆ రోజు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కోత విధిస్తున్నారు. మం గళవారం ఆదిలాబాద్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4,431 ప్రకటించిన వ్యాపారులు కొందరికి పత్తి రకాల పేరిట చివరకు రూ.3,850 చెల్లించా రు. తేమ 12శాతంకు మించితే కిలోకు రూ. 44.31 చొప్పున కోత విధించారు. ఒకే రోజు రెం డు వేల క్వింటాళ్లకు వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇదే పద్ధతిని కొనసాగించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఇ దే తంతు కొనసాగిస్తుండటంతో పత్తి రైతులు బిక్కు బిక్కుమంటున్నారు. ఓ వైపు కరువు, మరోవైపు ‘మద్దతు’ కరువై ఇప్పటికే జిల్లాలో 36 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ప్రభుత్వం కనీసంగానైనా స్పందించడం లేదు. పెట్టుబడులు, విత్తులు, ఎరువుల కోసం పెద్దమొత్తంలో వెచ్చించిన పత్తిరైతులు ఆశలసౌధం నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం, దళారుల దోపిడీ పత్తి రైతులను చిత్తు చేస్తుంది. కొనుగోళ్లకు సీసీఐ ‘సున్న’ం అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పె రుగుతుండగా వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నార ని రైతులు ఆరోపిస్తున్నారు. ఎగుమతులపై స్ప ష్టత లేదన్న సాకుతో సిండికేట్‌గా మారిన పత్తి వ్యాపారులు జిల్లాలో పత్తి ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతుల నుంచి గతేడాది నవంబర్ 20 వరకు 12,70,215 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తే ఈ సారి 3,36,472 క్వింటాళ్లే తీసుకున్నారు. ఈ ఏడాది వర్షాల కారణంగా పత్తి దిగుబడి ఆల స్యంగా రాగా, కొనుగోళ్లను కూడా ఆలస్యంగానే ప్రారంభించారు. అయితే గతేడాది ప్రైవేట్ వ్యా పారులకు తోడు సీసీఐ, నాఫెడ్‌లు బాసటగా నిలిస్తే, ఈసారి 17 మార్కెట్లలో మొత్తం 3,36,474 క్వింటాళ్లు వ్యాపారులే ఖరీదు చేశా రు. సీసీఐ మాత్రం ఇప్పటికే దూదిపింజను ము ట్టలేదు. తేమ పేరిట పాయింట్‌కు రూ.42 నుం చి 46 వరకు కోత విధిస్తూ ప్రభుత్వ మద్దతు ధ రకు మంగళం పాడుతున్న సందర్భంలో కూడా సీసీఐ రంగంలోకి దిగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. లక్సెట్టిపేట మార్కెట్లో రైతులకు గరిష్టంగా క్వింటాల్‌కు రూ.3,800 దక్కడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన పత్తి వ్యాపారుల ‘సిండికేట్’ దోపిడీకి రైతులు ఎన్ని రూ.లక్షలు నష్టపోయారో అంచనా వేయవచ్చు. అధికార యంత్రాంగం పత్తి మార్కెట్లలో ధరల వ్యత్యాసాలను నిరోధించి సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలని కోరుతున్నారు. -
అపార నష్టం
సాక్షి, కొత్తగూడెం: పగపట్టిన ప్రకృతి రైతుకు కన్నీరు మిగిల్చింది....సాగుచేసిన పంట చేతికివస్తుందని ఆనందపడుతున్న తరుణంలో వర్షం నిండా ముంచింది....కళకళలాడుతున్న చేలు ప్రకృతి దెబ్బకు నేలవాలిపోవడంతో అన్నదాత గుండె చెరువైంది. తీవ్రనష్టం జరిగినా ఆదుకోవాల్సిన సర్కారు మౌనంగా ఉంది. ఓదార్పు లేదు...హామీలు లేవు. పంట నష్టం అంతా 50 శాతంలోపే ఉందని ఓవైపు వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నా జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప.. రైతుకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారు. జిల్లాలో ఈనెల 21 నుంచి 26 వరకు కురిసిన వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రధానంగా పత్తి సాగు చేసిన రైతు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సుమారు 3.37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా కాగా...ఇందులో పత్తి 2,54,570 ఎకరాలు, వరి 27,600 ఎకరాలు, మిర్చి 15,200 ఎకరాలు, మొక్కజొన్న 21,775 ఎకరాలు, పొగాకు, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలు 18,061 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఈ నష్టం సుమారు రూ. 430 కోట్లు ఉంటుందని అంచనా. వర్షంతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. మొదటి, రెండో దశ తీస్తున్న పత్తి పూర్తిగా తడిసి ముద్దయింది. వర్షం తెరిపి ఇచ్చిన తర్వాత తడిసిన పత్తి పింజల్లోంచి తీయడానికి వీల్లేకుండా పోయింది. ఎలాంటి విపత్తులు లేకుంటే రెండు విడతల్లో తీసిన పత్తి ఎక్కువ ధర పలికేది. ఈ వర్షంతో ఎకరానికి సగటున 3 క్వింటాళ్ల చొప్పున.. జిల్లా వ్యాప్తంగా 7,63,710 కింటాళ్ళను రైతులు కోల్పోయారు. క్వింటాలుకు రూ. 4,500లు లెక్కిస్తే రూ.343 కోట్లు ఒక్క పత్తి పంటతోనే రైతులకు నష్టం జరిగినట్లు అంచనా. వరి పనలు నేలవాలడంతో పాటు మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగింది. నూర్పిడి చేసిన మొక్కజొన్న అంతా మొలకలు వచ్చింది. పత్తి మినహా ఇస్తే ఈ మూడు పంటల నష్టం రూ. 87 కోట్ల మేర ఉంటుంది. పత్తి, వరి, మిర్చి ఎకరానికి రూ. 20 వేలు, మొక్కజొన్న రూ.25 వేల వరకు పెట్టుడి పెట్టారు. ఇదంతా నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి వైరా నియోజకవర్గంలో 70 వేల ఎకరాల్లో, మధిరలో 59 వేల ఎకరాల్లో, పాలేరులో 30 వేల ఎకరాల్లో దెబ్బతినడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో వరి నేలవాలడంతో పాటు పనలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఇల్లెందు నియోజకవర్గం బయ్యారంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అశ్వారావుపేటలో వేరుశనగ, పొగాకు పంటలకు కూడా నష్టం వాటిల్లింది. అడ్రస్ లేని సీసీఐ.. ఊసే ఎత్తని ప్రభుత్వం.. పత్తి కొనుగోళ్లలో దళారి వ్యవస్థను నిర్మూలించేందుకు, గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సీసీఐ ద్వారా ఏటా ఈ సీజన్లో కొనుగోళ్లు చేపడుతుంది. అయితే వర్షాలకు ముందే పత్తి కొనుగోళ్లు మార్కెట్లో ప్రారంభమైనా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో తడిసిన పత్తి మొలకెత్తడంతో ప్రైవేట్ కొనుగోలుదార్లు ఆ పత్తి వైపు కన్నెత్తి చూడడం లేదు. దీనిని సీసీఐ కొనుగోలు చేస్తే కొంతైనా రైతులకు ఊరట కలిగేది. కానీ ఇప్పటి వరకు జిల్లాలో కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అష్టకష్టాలకోర్చి తడిసిన పత్తిని తీస్తున్న రైతులు ఏంచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తడిసిన పత్తిని ఆరబెట్టలేక.. మొలకెత్తుతుండడంతో సీసీఐ ఇప్పట్లో రాదని భావిస్తున్న రైతులు చేలోనే ఆపత్తిని వదిలి పెడుతున్నారు. పత్తి సాగులో తెలంగాణలో వరంగల్ తర్వాత జిల్లా రెండో స్థానంలో ఉన్నా.. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. నష్టం 50 శాతం లోపేనట..! కళ్ల ముందు తీవ్ర నష్టం కనబడుతున్నా ఆవిషయం మాట్లాడకుండా....తమ లెక్కల ప్రకారం 50 శాతం పైగా ఉంటేనే నష్టమని అధికారులు వింత ప్రకటనలు చేస్తుండడం రైతులకు ఆగ్రహాన్ని, అనుమానాన్ని కలిగిస్తోంది. గతంలో జైల్, నీలం తుపానులతో జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 50 శాతం పైగా కొన్ని వేల ఎకరాల్లోనే నష్టం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంట్లోనూ కోత పెట్టి ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. ప్రతిసారి జిల్లా వ్యవసాయ శాఖ ఇదే పద్ధతిని అనుసరిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. పత్తి పంటకు సంబంధించి ఎకరానికి రూ.13వేల నుంచి రూ. 15 వేల వరకు రైతులకు నష్టం జరింగింది. నిబంధనల పేరుతో అధికారులు ఇష్టా రీతిన అంచనా వేస్తుండడంతో రైతులు నిండా మునుగుతున్నారు. పత్తి పంటను జిల్లాలో ఎక్కువగా సాగు చేసింది కౌలు రైతులే. ఎకరం రూ. 10 వేలకు కౌలుకు తీసుకున్నారు. అధికారుల మాయ లెక్కలతో ఈరైతులకు పరిహారం అందే పరిస్థితి లేదు. జిల్లా అధికారులు పంట నష్టం ఎక్కువగా 50 శాతంలోపే ఉన్నట్లు ప్రకటించినా .. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కిమ్మనడం లేదు. పైగా మేమున్నామంటూ రైతులకు ఉచిత హామీలిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. జిల్లా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తేవడం లేదని విమర్శిస్తున్నారు. ఉసురు తీసిన రుణపాశం పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన రైతు బొప్పిశెట్టి చెన్నారావు(55). ఈయన తనకున్న రెండెకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగుచేశారు. ఎకరానికి రూ. 20వేల చొప్పున పెట్టుబడిపెట్టి మొత్తం రూ. 80వేలు అప్పులు చేసి పంటను సాగుచేశారు. గత మూడు సంవత్సరాలుగా వరుసగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టాలతో అప్పుల పాలయ్యారు. అప్పులు పెరిగి పోవడంతో ఆరు ఎకరాల పొలం, ఉన్న ఇల్లును అమ్ముకుని అప్పులు తీర్చారు. అయినా ఇంకా రూ. 1.20లక్షల అప్పు మిగిలింది. ఇందులో రూ. 50 వేలు బ్యాంకు రుణాలు, మరో 70 వేలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంది. గత ఏడాది తుపాను వల్ల వరి, పత్తి నష్ట పోయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం అందలేదు. ఈఏడాది కూడా వర్షాల కారణంగా పత్తి పాడైపోవడంతో మనో వేదనకు గురయ్యారు. ఇల్లు, పొలం అమ్మినా అప్పులు తీరలేదని, చేతికొచ్చిన పత్తి పంటను అమ్మి అప్పుతీర్చుదామంటే అదీ కాస్తా నీటిపాలైందని మనోవేదన చెంది ఈనె 26వతేదీ తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. -
సీసీఐ కేంద్రం ఏర్పాటుకు కృషి
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్ : ఎమ్మిగనూరు కాటన్ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్(జేడీ) రామాంజనేయులు తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మిగనూరులో పత్తి కొనుగోలుకు బయ్యర్స్ ముందుకు రాకపోవడంతో రూ.2కోట్లతో కాటన్ మార్కెట్‌ను నిర్మించామని, అయితే కొనుగోళ్లను ప్రారంభించలేకపోతున్నామన్నారు. గత ఏడాదే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించాలని చూసినా తగ్గిన పత్తి ధర ప్రభావం వల్ల వారు ఆసక్తి చూపలేకపోయారన్నారు. ఈ సారి ఏలాగైనా సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయించి కొనుగోళ్లకు స్వీకారం చుడుతామన్నారు. ఇక్కడ పత్తి కొనుగోలు ప్రారంభమైతే ఆదోని మార్కెట్ యార్డ్‌పై ఒత్తిడి తగ్గ్గుతుందన్నారు. హమాలీల సమస్యపై చర్చించిన ఆర్జేడీ : స్థానిక మార్కెట్ యార్డ్ హమాలీల సమస్య పరిష్కారం కోసం జేడీ రామాంజనేయులు కమీషన్ ఏజెంట్లు, బయ్యర్స్‌తో చర్చించారు. లెసైన్సులు రెన్యువల్ చేయడంతోపాటు కమిషన్ ఏజెంట్లు, బయ్యర్స్ సూచించిన వారికి కొత్త లెసైన్సులు ఇచ్చేందుకు తమకు ఏలాంటి అభ్యంతరం లేదన్నారు. రెన్యువల్, కొత్త లెసైన్సుల మంజూరుపై హమాలీలు, రాజకీయ నాయకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో బయ్యర్స్ అంగీకరించారు. జేడీని కలిసిన వారిలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహ్మద్ఉసేని, కమిషన్ ఏజెంట్లు ప్రతాప్ ఉరుకుందయ్యశెట్టి, జగన్నాథ్‌రెడ్డి, కాకర్ల నాగరాజు, బందెనవాజ్, గోపాల్‌రెడ్డి, కందనాతి శ్రీనివాస్‌రెడ్డి, బయ్యర్స్ నటరాజ్, మహాబలేశ్వర తదితరులు పాల్గొన్నారు.