మార్కాపురం, న్యూస్‌లైన్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పత్తి కొనుగోలు చేసేందుకు మార్కాపురంలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వారికి అక్కరకు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ధర క్వింటాకు రూ. 4 వేలు కాగా..బయటి మార్కెట్‌లో దళారులు రూ. 4,300కు కొనుగోలు చేస్తుండటంతో మార్కాపురంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం రైతులు లేక వెలవెల బోతోంది. గత నెల 12న మార్కాపురంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 9 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే రైతులు యార్డుకు తీసుకొచ్చి విక్రయించారు. ప్రభుత్వం క్వింటా పత్తిని రూ.4 వేలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 8 శాతం తేమ కలిగి, 29.5 మి.మీ నుంచి 30.5 మి.మీ పత్తిని పై ధరకు కొనుగోలు చేస్తారు. ఆ తరువాత తేమ శాతం పెరిగితే పాయింట్‌కు రూ. 40 చొప్పున తగ్గిస్తారు. 9 శాతం తేమ ఉంటే రూ. 3,960, పది శాతం ఉంటే రూ. 3,920 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి వర్షాలు లేకపోవడం, తేమ కచ్చితంగా 8 శాతం ఉండటంతో నాణ్యమైన పత్తి వస్తోంది. దీంతో వ్యాపారులు క్వింటా రూ. 4,200 నుంచి రూ. 4,300 వరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
విధానాల్లో లోపం...
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే మార్కెట్లో వ్యాపారులు ప్రభుత్వ ధరకు సమానంగా కొనుగోలు చేస్తారు. ఈ దఫా ఇందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. గిద్దలూరు నుంచి మార్కాపురానికి రైతులు లారీ పత్తి తీసుకురావాలంటే అదనంగా రూ. 6 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒక్కో బోరంలో పత్తిని ఎత్తి, దించడానికి కూలీలు రూ. 30 తీసుకుంటున్నారు. ఇందులో 70 నుంచి 90 కిలోల పత్తి ఉంటుంది. ఒక్కో లారీకి 14 నుంచి 15 బోరెల పత్తి ఎత్తుతారు. దీంతో పాటు బాడుగ సుమారు రూ. 5 వేలు ఉంటుంది. తీరా ఇంత కష్టపడి యార్డుకు తీసుకొస్తే రూ. 4 వేలకు మించి కొనుగోలు చేయబోమని వ్యాపారులు చెబుతున్నారు. ఒక వేళ అమ్మినా కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు చెక్కు మాత్రమే ఇస్తారు. బ్యాంకుకు వెళ్లి నగదుగా మారేసరికి పది రోజుల సమయం పడుతుంది. దళారులు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు అందజేస్తున్నారు. దీంతో యార్డుకు వచ్చి విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. మూడు రోజుల నుంచి యార్డులో విక్రయాలు నిలిచిపోయాయి. గత ఏడాది జనవరిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు లక్ష క్వింటాళ్ల పత్తిని వ్యాపారుల నుంచి కొనుగోలు చేయగా, ఈ ఏడాది 20 రోజులు గడిచినా 9 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వమే క్వింటా మద్దతు ధర రూ. 4,500 ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
కావాలనే ఆలస్యం చేశారు:
పశ్చిమ ప్రకాశంలో పత్తి దిగుబడులు అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సంగతి సీసీఐ అధికారులకు కూడా తెలుసు. అప్పట్లో క్వింటా మద్దతు ధర రూ. 3,100 మాత్రమే ఉంది. రైతులు ఇళ్లలో దిగుబడులు ఉంచుకోలేక దళారులు చెప్పిన ధరకు విక్రయించారు. ఈ విధంగా సుమారు 60 శాతం పత్తిని విక్రయించారు. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. ఇప్పుడు కేవలం తక్కువ మంది రైతుల దగ్గర మాత్రమే పత్తి ఉంది. ఈ కేంద్రాన్ని నవంబర్‌లో ఏర్పాటుచేసి ఉంటే రైతులకు ఉపయోగంగా ఉండేది. ప్రస్తుతం మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్ డివిజన్‌ల పరిధిలోని 12 మండలాల్లో 37 వేల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. మిగిలిన 3 వేల హెక్టార్లను దర్శి, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి తదితర మండలాల్లో సాగు చేశారు. ఎకరా పత్తి సాగుకు రూ. 18 నుంచి రూ. 20 వేల వరకు రైతులు ఖర్చు చేశారు.
ఉన్నా..ఉపయోగమేదీ..
Published Wed, Jan 8 2014 2:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement