మార్కాపురం, న్యూస్‌లైన్:
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని ప్రజల పునరావాసంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షం వచ్చిందంటే స్థానికులు భయంభయంగా కాలం గడుపుతున్నారు. మార్కాపురం, పెద్దారవీడు, అర్ధవీడు మండలాల్లోని గొట్టిపడియ, అక్కచెరువు, సుంకేసుల డ్యామ్ కింద చింతలముడిపి, సుంకేసుల, కాటంరాజు తండా, కలనూతల, గుండంచర్ల, కాకర్ల డ్యామ్ కింద సాయినగర్, లక్ష్మీపురం, కాకర్ల తదితర గ్రామాలన్నీ ముంపు గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద వీరిలో కొందరి గృహాలకు, పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. పునరావాసం కల్పించే విషయంలో ఆరేళ్లుగా అదిగో, ఇదిగో అంటూ అధికారులు కాలం గడుపుతున్నారు. పునరావాస కాలనీలు నిర్మించాల్సిన స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయన్న కారణంతో వాటి గురించి పట్టించుకోవడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లకు నీరు చేరడంతో గ్రామాలు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది. అక్కచెరువు, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల ప్రజలు నాలుగు రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
గొట్టిపడియ, అక్కచెరువులో 900 కుటుంబాలున్నాయి. చింతలముడిపి, కాటంరాజు తండాల్లో 56 గృహాల్లో 72 కుటుంబాలు, సుంకేసులలో 1139 గృహాల్లో 1552 కుటుంబాలు, కలనూతలలో 514 గృహాల్లో 620 కుటుంబాలు, గుండంచర్లలో 237 గృహాల్లో 700 కుటుంబాలు, కాకర్ల డ్యామ్ పరిధిలో 140 గృహాల్లో 210 కుటుంబాలు నివసిస్తున్నాయి. గొట్టిపడియలో రెండు వర్గాల ప్రజలుండగా, ఒక వర్గం వారు అల్లూరిపోలేరమ్మ దేవాలయం వద్ద, మరో వర్గం వారు కోమటికుంట వద్ద పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. సుంకేసుల డ్యామ్ కింద సుంకేసులలో కొంత మంది గ్రామస్తులు గోగులదిన్నె వద్ద, తోకపల్లె వద్ద పునరావాస కాలనీలు కావాలని కోరారు. కలనూతల గ్రామస్తుల్లో కొంత మందికి మార్కాపురం మండలంలోని ఇడుపూరులో పునరావాస కాలనీ ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు నిర్ణయించారు.
గుండంచర్ల గ్రామస్తుల కోసం దేవరాజుగట్టు వద్ద భూములను పరిశీలించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో అధికారులు పునరావాస కాలనీలకు స్థలాలు చూడగా కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ పొలాలను సేకరణ కింద తీసుకోవద్దని కోర్టుకు వెళ్లటంతో పెండింగ్ లో ఉన్నాయి. గత వారం గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లకు కొద్దిపాటి నీరు చేరడంతో మూడు రోజుల పాటు ఈ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏ క్షణంలో వరద ముంచుతుందోనన్న ఆందోళన ఏర్పడింది. గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లకు ఇప్పటికీ వరదనీరు ఉంది. ఈ గ్యాప్‌లను నల్లమల సాగర్‌గా పిలుస్తారు. భవిష్యత్‌లో భారీ వర్షాలు కురిస్తే తమ గతి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అటు స్వగ్రామాలను వదలి బయటకు రాలేక, ఇటు ప్రభుత్వం పునరావాసం కల్పించక దిక్కుతోచని స్థితిలో కొండ కోనల్లో కాలం గడుపుతున్నారు. పునరావాస ప్యాకేజి కింద తమకు త్వరగా కాలనీలు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు.
వానొస్తే వనవాసమే
Published Fri, Nov 1 2013 5:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement