మార్కాపురం, న్యూస్‌లైన్: పశ్చిమ ప్రాంత రూపురేఖలు మార్చే వెలిగొండ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు లభించడంతో ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యేందుకు మార్గం సుగమమైంది. నిలిచిపోయిన టన్నెల్, కాలువల పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా ‘వెలిగొండ’కు మోక్షం దోర్నాల సమీపంలోని టన్నెల్ పనులు ఆగిపోయాయి. రాజీవ్ టైగర్ ప్రాజెక్టు కావడంతో అనుమతి లేకుండా పనులు ప్రారంభిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖాధికారులు వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయడంతో పనులు నిలిపేశారు. గత శనివారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ అనుమతులు వచ్చాయి.
దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెల్స్ నిర్మిస్తున్నారు. మొదటి టన్నెల్ వ్యాసార్థం 8 మీటర్లు కాగా..18.82 కి.మీల పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 11.52 కి.మీ మేర కాలువ తవ్వారు.
రెండో టన్నెల్ వ్యాసార్థం 10 మీటర్లు కాగా, 18.82 కి.మీ పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. 8.45 కి.మీ మేర కాలువలు తవ్వారు.
రెండు టన్నెల్స్‌కు సంబంధించి సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నెలకు 400 మీటర్ల పొడవున పనిచేయాల్సి ఉండగా, గట్టిరాయి, సుద్ధ, బురదమట్టి, నీళ్లు వస్తుండటంతో 300 మీటర్లకు మించి పనులు సాగడం లేదు. మొత్తం 7 ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు.
అటవీ శాఖ మొత్తం 3069.91 హెక్టార్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, కాకర్ల, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, తదితర అటవీ ప్రాంతాల్లోని ఈస్ట్రన్ కెనాల్, తీగలేరు, ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
దోర్నాల ప్రాంతంలో ఫీడర్ కాలువ పొడవు 21.6 కి.మీ కాగా, 10.2 కి.మీ మాత్రమే అటవీ శాఖ అనుమతులు లభించడంతో అంత వరకు తవ్వి నిలిపేశారు. తీగలేరు కాలువ మొత్తం పొడవు 48 కి.మీ కాగా, 5 కి.మీ పొడవున కాలువ తవ్వారు. అలాగే, ఈస్ట్రన్ కాలువకు కూడా అటవీ శాఖ అనుమతి లభించకపోవడంతో నిలిచిపోయింది.
అటవీశాఖ అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో మార్కాపురం పరిధిలో 1691 హెక్టార్లు, గిద్దలూరు పరిధిలో 1169 హెక్టార్లు, నెల్లూరు జిల్లా పరిధిలో 108 హెక్టార్లు, కడప జిల్లాలోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతానికి అనుమతులు మంజూరు చేసింది.
2014కు పూర్తి చేయాలన్న లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించకపోవడంతో టన్నెల్ పనులు నత్తనడకతో పోటీ పడుతున్నాయి.
కృష్ణానది మిగులు జలాల ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని 45 రోజుల పాటు కొల్లంవాగు ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయిస్తే 43.50 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుతుంది. టన్నెల్స్ ద్వారా సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపుల్లో నీటిని నింపుతారు.
{పాజెక్టు పూర్తయితే అర్ధవీడులో 3 వేల ఎకరాలు, కంభంలో 17,300, బేస్తవారిపేటలో 11,200, మార్కాపురంలో 27,700 ఎకరాలు, కొనకనమిట్లలో 30 వేలు, తర్లుపాడులో 20 వేలు, హెచ్‌ఎంపాడులో 39,400, కనిగిరిలో 9,900, పొదిలిలో 5,200, కురిచేడులో 6 వేలు, దొనకొండలో 17 వేలు, పుల్లలచెరువులో 11,500, మర్రిపూడిలో 4,400, పెద్దారవీడులో 21,900, యర్రగొండపాలెంలో 19,800, దోర్నాలలో 6,100, త్రిపురాంతకంలో 32,300, గిద్దలూరులో 10,600, రాచర్లలో 11,500, కొమరోలులో 5,500, పామూరులో 2,300, సీఎస్‌పురంలో 24,500, వెలిగండ్లలో 17,600 ఎకరాలకు వెలిగొండ జలాలు అందుతాయి.
‘వెలిగొండ’కు మోక్షం
Published Thu, Jun 5 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement