Rajiv Tiger Project
-
రాష్ట్రంలో 17 పులులే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అడవుల్లో పెద్ద పులులు, చిరుతల లెక్కలపై అటవీ శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మొత్తం 17 పులులు, 125 చిరుతలు ఉన్నాయని జాతీయ జంతు గణనలో భాగంగా సేకరించిన పాదముద్రల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా నల్లమలలోని రాజీవ్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అడుగు జాడలను సేకరిం చగా.. అవి 13 పులులు, 45 చిరుతల పాదముద్రలని భావిస్తున్నారు. రెండో స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 4 పులులు, 25 చిరుతల అడుగుజాడలను గుర్తించారు. కచ్చితమైన నిరూపణ కోసం పాదముద్రలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు, పెంటిక (మలం) నమూనాలను సీసీఎంబీ హైదరాబాద్‌కు పంపించారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోని జన్నారం దట్టమైన ఫారెస్టు పరిధిలో ఒకటంటే ఒక్క పులి అడుగు జాడ కనిపించలేదు. ఎక్కడ..? ఎన్ని..? నల్లమలలోని రాజీవ్ పులుల అభయారణ్యాన్ని 214 బీట్లుగా విభజన చేసి జంతు గణన చెపట్టారు. అడుగు జాడలు, మలం, వెంట్రుకలను సేకరించారు. అచ్చంపేట రేంజ్ పరిధిలోని బాణాల, చౌటపల్లి బీట్లలో 2 పులులు, 12 చిరుతలు, మన్ననూర్ రేంజ్‌లోని 10 ట్రాన్స్పాత్లలో 8 పులులు, 20 చిరుతలు, దోమలపెంట రేంజ్ పరిధిలో బోరెడ్డిపల్లి, కొమ్మనపెంట, వటవర్లపల్లి బీట్లలో 2 పులులు, అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని కొల్లంపెంట, పర్షాబాద్ నార్త్ బీట్లలో 3 పులులు, 9 చిరుతలు, మద్దిమడుగు రేంజ్లో గీసుగండి, బాపన్‌పాడు బీట్లలో 2 పులులు, 6 చిరుతలు, కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎర్రపెంట, ఎర్రగుండం పెంట బీట్లలో 2 పులులు, 9 చిరుతలు, లింగాల రేంజ్లో మర్లపాయ బీట్‌లో 2 పులుల, 5 చిరుతల పాదముద్రలు లభించాయి. అటవీ ముఖద్వార ప్రాంతాలైన బాణాల (బల్మూరు), చౌటపల్లి (అచ్చంపేట) ప్రాంతంలో పులుల అడుగులు కనిపించడంపై ఫారెస్టు అధికారులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అక్కడ నాలుగేనా! కవ్వాల్ పులుల అభయారణ్యంపై ఫారెస్టు అధికారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజా జంతు గణన వారికి నిరాశే మిగిల్చింది. ఇక్కడ కనీసం ఏడు నుంచి ఎనిమిది పులులైనా ఉంటాయని అధికారులు ఆశించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేవలం 4 పులుల అడుగు జాడలు మాత్రమే లభ్యమయ్యాయి. ఖానాపూర్ డివిజన్లోని కోర్ ఏరియాలో ఒకచోట, చెన్నూరు డివిజన్ నీల్వాయి ప్రాంతంలో మరో పులి అడుగు జాడ మాత్రమే కనిపించింది. ఆసిఫాబాద్ డివిజన్లో మరో రెండు పులుల పాదముద్రలను అధికారులు సేకరించారు. వీటితోపాటు సుమారుగా 20 చిరుతలకు సంబంధించిన 35 పాదముద్రలను సేకరించారు. జన్నారంలో పులి జాడేదీ? కవ్వాల్‌లో ముఖ్యమైన జన్నారం అటవీ ప్రాంతంలో పులి జాడలు అస్సలు కనిపించలేదు. ఇందన్పల్లి, తాళ్లపేట్, జన్నారం అటవీ రేంజ్‌లలో ఆరు చోట్ల చిరుత అడుగు జాడలను అధికారులు గుర్తించారు. కానీ పెద్ద పులి జాడ మాత్రం దొరకలేదు. రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన అభయారణ్యంలో ఒక్క పులి కూడా లేకపోవటం గమనార్హం. ఇక నల్లగొండ జిల్లాలో 22 నుంచి 25 వరకు చిరుతల ముద్రలు దొరికాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 నుంచి 16 వరకు చిరుత పులుల జాడలు దొరికాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పాత కరీంనగర్ జిల్లాలో కేవలం ఒకే ఒక చిరుత పాదముద్రలు లభించాయి. హైదరాబాద్ మహానగరం పరిసరాల్లో రెండు చిరుతల అడుగు జాడలు అభించాయి. ఇంకో 4 నెలలు ఆగాలి పులులు, చిరుతల లెక్క అధికారికంగా తేలటానికి కనీసం మరో 4 నెలల సమయం పడుతుందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జంతు గణనలో సేకరించిన పాదముద్రల నమూనా చిత్రాలను డివిజన్ల వారీగా ప్రత్యేక యాప్ ద్వారా డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. ఈ నమూనాలను వారు విశ్లేషించి పూర్తి వివరాలు ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో ప్రచురించే అవకాశం ఉందని ఫారెస్టు అధికారులు చెప్పారు. జిల్లాల వారీగా ప్రాథమిక అంచనా ఉమ్మడి జిల్లా పులులు చిరుతలు ఆదిలాబాద్ 04 20 మహబూబ్‌నగర్ 13 45 నిజామాబాద్ 00 06 రంగారెడ్డి 00 02 కరీంనగర్ 00 01 మెదక్ 00 15 వరంగల్ 00 05 ఖమ్మం 00 09 నల్లగొండ 00 22 -
‘వెలిగొండ’కు మోక్షం
మార్కాపురం, న్యూస్‌లైన్: పశ్చిమ ప్రాంత రూపురేఖలు మార్చే వెలిగొండ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు లభించడంతో ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యేందుకు మార్గం సుగమమైంది. నిలిచిపోయిన టన్నెల్, కాలువల పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా ‘వెలిగొండ’కు మోక్షం దోర్నాల సమీపంలోని టన్నెల్ పనులు ఆగిపోయాయి. రాజీవ్ టైగర్ ప్రాజెక్టు కావడంతో అనుమతి లేకుండా పనులు ప్రారంభిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖాధికారులు వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయడంతో పనులు నిలిపేశారు. గత శనివారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ అనుమతులు వచ్చాయి. దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెల్స్ నిర్మిస్తున్నారు. మొదటి టన్నెల్ వ్యాసార్థం 8 మీటర్లు కాగా..18.82 కి.మీల పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 11.52 కి.మీ మేర కాలువ తవ్వారు. రెండో టన్నెల్ వ్యాసార్థం 10 మీటర్లు కాగా, 18.82 కి.మీ పొడవున కాలువలు తవ్వాల్సి ఉంది. 8.45 కి.మీ మేర కాలువలు తవ్వారు. రెండు టన్నెల్స్‌కు సంబంధించి సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నెలకు 400 మీటర్ల పొడవున పనిచేయాల్సి ఉండగా, గట్టిరాయి, సుద్ధ, బురదమట్టి, నీళ్లు వస్తుండటంతో 300 మీటర్లకు మించి పనులు సాగడం లేదు. మొత్తం 7 ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. అటవీ శాఖ మొత్తం 3069.91 హెక్టార్లకు అనుమతి ఇచ్చింది. దీంతో దోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, కాకర్ల, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, తదితర అటవీ ప్రాంతాల్లోని ఈస్ట్రన్ కెనాల్, తీగలేరు, ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దోర్నాల ప్రాంతంలో ఫీడర్ కాలువ పొడవు 21.6 కి.మీ కాగా, 10.2 కి.మీ మాత్రమే అటవీ శాఖ అనుమతులు లభించడంతో అంత వరకు తవ్వి నిలిపేశారు. తీగలేరు కాలువ మొత్తం పొడవు 48 కి.మీ కాగా, 5 కి.మీ పొడవున కాలువ తవ్వారు. అలాగే, ఈస్ట్రన్ కాలువకు కూడా అటవీ శాఖ అనుమతి లభించకపోవడంతో నిలిచిపోయింది. అటవీశాఖ అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో మార్కాపురం పరిధిలో 1691 హెక్టార్లు, గిద్దలూరు పరిధిలో 1169 హెక్టార్లు, నెల్లూరు జిల్లా పరిధిలో 108 హెక్టార్లు, కడప జిల్లాలోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతానికి అనుమతులు మంజూరు చేసింది. 2014కు పూర్తి చేయాలన్న లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించకపోవడంతో టన్నెల్ పనులు నత్తనడకతో పోటీ పడుతున్నాయి. కృష్ణానది మిగులు జలాల ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని 45 రోజుల పాటు కొల్లంవాగు ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయిస్తే 43.50 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుతుంది. టన్నెల్స్ ద్వారా సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపుల్లో నీటిని నింపుతారు. {పాజెక్టు పూర్తయితే అర్ధవీడులో 3 వేల ఎకరాలు, కంభంలో 17,300, బేస్తవారిపేటలో 11,200, మార్కాపురంలో 27,700 ఎకరాలు, కొనకనమిట్లలో 30 వేలు, తర్లుపాడులో 20 వేలు, హెచ్‌ఎంపాడులో 39,400, కనిగిరిలో 9,900, పొదిలిలో 5,200, కురిచేడులో 6 వేలు, దొనకొండలో 17 వేలు, పుల్లలచెరువులో 11,500, మర్రిపూడిలో 4,400, పెద్దారవీడులో 21,900, యర్రగొండపాలెంలో 19,800, దోర్నాలలో 6,100, త్రిపురాంతకంలో 32,300, గిద్దలూరులో 10,600, రాచర్లలో 11,500, కొమరోలులో 5,500, పామూరులో 2,300, సీఎస్‌పురంలో 24,500, వెలిగండ్లలో 17,600 ఎకరాలకు వెలిగొండ జలాలు అందుతాయి.