సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అడవుల్లో పెద్ద పులులు, చిరుతల లెక్కలపై అటవీ శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మొత్తం 17 పులులు, 125 చిరుతలు ఉన్నాయని జాతీయ జంతు గణనలో భాగంగా సేకరించిన పాదముద్రల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా నల్లమలలోని రాజీవ్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అడుగు జాడలను సేకరిం చగా.. అవి 13 పులులు, 45 చిరుతల పాదముద్రలని భావిస్తున్నారు. రెండో స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 4 పులులు, 25 చిరుతల అడుగుజాడలను గుర్తించారు. కచ్చితమైన నిరూపణ కోసం పాదముద్రలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు, పెంటిక (మలం) నమూనాలను సీసీఎంబీ హైదరాబాద్‌కు పంపించారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోని జన్నారం దట్టమైన ఫారెస్టు పరిధిలో ఒకటంటే ఒక్క పులి అడుగు జాడ కనిపించలేదు.
ఎక్కడ..? ఎన్ని..?
నల్లమలలోని రాజీవ్ పులుల అభయారణ్యాన్ని 214 బీట్లుగా విభజన చేసి జంతు గణన చెపట్టారు. అడుగు జాడలు, మలం, వెంట్రుకలను సేకరించారు. అచ్చంపేట రేంజ్ పరిధిలోని బాణాల, చౌటపల్లి బీట్లలో 2 పులులు, 12 చిరుతలు, మన్ననూర్ రేంజ్‌లోని 10 ట్రాన్స్‌పాత్‌లలో 8 పులులు, 20 చిరుతలు, దోమలపెంట రేంజ్ పరిధిలో బోరెడ్డిపల్లి, కొమ్మనపెంట, వటవర్లపల్లి బీట్లలో 2 పులులు, అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని కొల్లంపెంట, పర్షాబాద్ నార్త్ బీట్లలో 3 పులులు, 9 చిరుతలు, మద్దిమడుగు రేంజ్‌లో గీసుగండి, బాపన్‌పాడు బీట్లలో 2 పులులు, 6 చిరుతలు, కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎర్రపెంట, ఎర్రగుండం పెంట బీట్లలో 2 పులులు, 9 చిరుతలు, లింగాల రేంజ్‌లో మర్లపాయ బీట్‌లో 2 పులుల, 5 చిరుతల పాదముద్రలు లభించాయి. అటవీ ముఖద్వార ప్రాంతాలైన బాణాల (బల్మూరు), చౌటపల్లి (అచ్చంపేట) ప్రాంతంలో పులుల అడుగులు కనిపించడంపై ఫారెస్టు అధికారులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు.
అక్కడ నాలుగేనా!
కవ్వాల్ పులుల అభయారణ్యంపై ఫారెస్టు అధికారులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజా జంతు గణన వారికి నిరాశే మిగిల్చింది. ఇక్కడ కనీసం ఏడు నుంచి ఎనిమిది పులులైనా ఉంటాయని అధికారులు ఆశించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేవలం 4 పులుల అడుగు జాడలు మాత్రమే లభ్యమయ్యాయి. ఖానాపూర్ డివిజన్‌లోని కోర్ ఏరియాలో ఒకచోట, చెన్నూరు డివిజన్ నీల్వాయి ప్రాంతంలో మరో పులి అడుగు జాడ మాత్రమే కనిపించింది. ఆసిఫాబాద్ డివిజన్‌లో మరో రెండు పులుల పాదముద్రలను అధికారులు సేకరించారు. వీటితోపాటు సుమారుగా 20 చిరుతలకు సంబంధించిన 35 పాదముద్రలను సేకరించారు.
జన్నారంలో పులి జాడేదీ?
కవ్వాల్‌లో ముఖ్యమైన జన్నారం అటవీ ప్రాంతంలో పులి జాడలు అస్సలు కనిపించలేదు. ఇందన్‌పల్లి, తాళ్లపేట్, జన్నారం అటవీ రేంజ్‌లలో ఆరు చోట్ల చిరుత అడుగు జాడలను అధికారులు గుర్తించారు. కానీ పెద్ద పులి జాడ మాత్రం దొరకలేదు. రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన అభయారణ్యంలో ఒక్క పులి కూడా లేకపోవటం గమనార్హం. ఇక నల్లగొండ జిల్లాలో 22 నుంచి 25 వరకు చిరుతల ముద్రలు దొరికాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 నుంచి 16 వరకు చిరుత పులుల జాడలు దొరికాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పాత కరీంనగర్ జిల్లాలో కేవలం ఒకే ఒక చిరుత పాదముద్రలు లభించాయి. హైదరాబాద్ మహానగరం పరిసరాల్లో రెండు చిరుతల అడుగు జాడలు అభించాయి.
ఇంకో 4 నెలలు ఆగాలి
పులులు, చిరుతల లెక్క అధికారికంగా తేలటానికి కనీసం మరో 4 నెలల సమయం పడుతుందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జంతు గణనలో సేకరించిన పాదముద్రల నమూనా చిత్రాలను డివిజన్ల వారీగా ప్రత్యేక యాప్ ద్వారా డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. ఈ నమూనాలను వారు విశ్లేషించి పూర్తి వివరాలు ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో ప్రచురించే అవకాశం ఉందని ఫారెస్టు అధికారులు చెప్పారు.
జిల్లాల వారీగా ప్రాథమిక అంచనా
ఉమ్మడి జిల్లా పులులు చిరుతలు
ఆదిలాబాద్ 04 20
మహబూబ్‌నగర్ 13 45
నిజామాబాద్ 00 06
రంగారెడ్డి 00 02
కరీంనగర్ 00 01
మెదక్ 00 15
వరంగల్ 00 05
ఖమ్మం 00 09
నల్లగొండ 00 22
Comments
Please login to add a commentAdd a comment