సాక్షి, కొత్తగూడెం: పగపట్టిన ప్రకృతి రైతుకు కన్నీరు మిగిల్చింది....సాగుచేసిన పంట చేతికివస్తుందని ఆనందపడుతున్న తరుణంలో వర్షం నిండా ముంచింది....కళకళలాడుతున్న చేలు ప్రకృతి దెబ్బకు నేలవాలిపోవడంతో అన్నదాత గుండె చెరువైంది. తీవ్రనష్టం జరిగినా ఆదుకోవాల్సిన సర్కారు మౌనంగా ఉంది. ఓదార్పు లేదు...హామీలు లేవు. పంట నష్టం అంతా 50 శాతంలోపే ఉందని ఓవైపు వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నా జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప.. రైతుకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారు.
జిల్లాలో ఈనెల 21 నుంచి 26 వరకు కురిసిన వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రధానంగా పత్తి సాగు చేసిన రైతు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సుమారు 3.37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా కాగా...ఇందులో పత్తి 2,54,570 ఎకరాలు, వరి 27,600 ఎకరాలు, మిర్చి 15,200 ఎకరాలు, మొక్కజొన్న 21,775 ఎకరాలు, పొగాకు, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలు 18,061 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఈ నష్టం సుమారు రూ. 430 కోట్లు ఉంటుందని అంచనా. వర్షంతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. మొదటి, రెండో దశ తీస్తున్న పత్తి పూర్తిగా తడిసి ముద్దయింది. వర్షం తెరిపి ఇచ్చిన తర్వాత తడిసిన పత్తి పింజల్లోంచి తీయడానికి వీల్లేకుండా పోయింది. ఎలాంటి విపత్తులు లేకుంటే రెండు విడతల్లో తీసిన పత్తి ఎక్కువ ధర పలికేది. ఈ వర్షంతో ఎకరానికి సగటున 3 క్వింటాళ్ల చొప్పున.. జిల్లా వ్యాప్తంగా 7,63,710 కింటాళ్ళను రైతులు కోల్పోయారు.
క్వింటాలుకు రూ. 4,500లు లెక్కిస్తే రూ.343 కోట్లు ఒక్క పత్తి పంటతోనే రైతులకు నష్టం జరిగినట్లు అంచనా. వరి పనలు నేలవాలడంతో పాటు మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగింది. నూర్పిడి చేసిన మొక్కజొన్న అంతా మొలకలు వచ్చింది. పత్తి మినహా ఇస్తే ఈ మూడు పంటల నష్టం రూ. 87 కోట్ల మేర ఉంటుంది. పత్తి, వరి, మిర్చి ఎకరానికి రూ. 20 వేలు, మొక్కజొన్న రూ.25 వేల వరకు పెట్టుడి పెట్టారు. ఇదంతా నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి వైరా నియోజకవర్గంలో 70 వేల ఎకరాల్లో, మధిరలో 59 వేల ఎకరాల్లో, పాలేరులో 30 వేల ఎకరాల్లో దెబ్బతినడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో వరి నేలవాలడంతో పాటు పనలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఇల్లెందు నియోజకవర్గం బయ్యారంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అశ్వారావుపేటలో వేరుశనగ, పొగాకు పంటలకు కూడా నష్టం వాటిల్లింది.
అడ్రస్ లేని సీసీఐ.. ఊసే ఎత్తని ప్రభుత్వం..
పత్తి కొనుగోళ్లలో దళారి వ్యవస్థను నిర్మూలించేందుకు, గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సీసీఐ ద్వారా ఏటా ఈ సీజన్‌లో కొనుగోళ్లు చేపడుతుంది. అయితే వర్షాలకు ముందే పత్తి కొనుగోళ్లు మార్కెట్‌లో ప్రారంభమైనా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో తడిసిన పత్తి మొలకెత్తడంతో ప్రైవేట్ కొనుగోలుదార్లు ఆ పత్తి వైపు కన్నెత్తి చూడడం లేదు. దీనిని సీసీఐ కొనుగోలు చేస్తే కొంతైనా రైతులకు ఊరట కలిగేది. కానీ ఇప్పటి వరకు జిల్లాలో కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అష్టకష్టాలకోర్చి తడిసిన పత్తిని తీస్తున్న రైతులు ఏంచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తడిసిన పత్తిని ఆరబెట్టలేక.. మొలకెత్తుతుండడంతో సీసీఐ ఇప్పట్లో రాదని భావిస్తున్న రైతులు చేలోనే ఆపత్తిని వదిలి పెడుతున్నారు. పత్తి సాగులో తెలంగాణలో వరంగల్ తర్వాత జిల్లా రెండో స్థానంలో ఉన్నా.. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
నష్టం 50 శాతం లోపేనట..!
కళ్ల ముందు తీవ్ర నష్టం కనబడుతున్నా ఆవిషయం మాట్లాడకుండా....తమ లెక్కల ప్రకారం 50 శాతం పైగా ఉంటేనే నష్టమని అధికారులు వింత ప్రకటనలు చేస్తుండడం రైతులకు ఆగ్రహాన్ని, అనుమానాన్ని కలిగిస్తోంది. గతంలో జైల్, నీలం తుపానులతో జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 50 శాతం పైగా కొన్ని వేల ఎకరాల్లోనే నష్టం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
దీంట్లోనూ కోత పెట్టి ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. ప్రతిసారి జిల్లా వ్యవసాయ శాఖ ఇదే పద్ధతిని అనుసరిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. పత్తి పంటకు సంబంధించి ఎకరానికి రూ.13వేల నుంచి రూ. 15 వేల వరకు రైతులకు నష్టం జరింగింది. నిబంధనల పేరుతో అధికారులు ఇష్టా రీతిన అంచనా వేస్తుండడంతో రైతులు నిండా మునుగుతున్నారు. పత్తి పంటను జిల్లాలో ఎక్కువగా సాగు చేసింది కౌలు రైతులే. ఎకరం రూ. 10 వేలకు కౌలుకు తీసుకున్నారు. అధికారుల మాయ లెక్కలతో ఈరైతులకు పరిహారం అందే పరిస్థితి లేదు. జిల్లా అధికారులు పంట నష్టం ఎక్కువగా 50 శాతంలోపే ఉన్నట్లు ప్రకటించినా .. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కిమ్మనడం లేదు. పైగా మేమున్నామంటూ రైతులకు ఉచిత హామీలిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. జిల్లా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తేవడం లేదని విమర్శిస్తున్నారు.
ఉసురు తీసిన రుణపాశం
పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన రైతు బొప్పిశెట్టి చెన్నారావు(55). ఈయన తనకున్న రెండెకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగుచేశారు. ఎకరానికి రూ. 20వేల చొప్పున పెట్టుబడిపెట్టి మొత్తం రూ. 80వేలు అప్పులు చేసి పంటను సాగుచేశారు. గత మూడు సంవత్సరాలుగా వరుసగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టాలతో అప్పుల పాలయ్యారు. అప్పులు పెరిగి పోవడంతో ఆరు ఎకరాల పొలం, ఉన్న ఇల్లును అమ్ముకుని అప్పులు తీర్చారు. అయినా ఇంకా రూ. 1.20లక్షల అప్పు మిగిలింది. ఇందులో రూ. 50 వేలు బ్యాంకు రుణాలు, మరో 70 వేలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంది. గత ఏడాది తుపాను వల్ల వరి, పత్తి నష్ట పోయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం అందలేదు. ఈఏడాది కూడా వర్షాల కారణంగా పత్తి పాడైపోవడంతో మనో వేదనకు గురయ్యారు. ఇల్లు, పొలం అమ్మినా అప్పులు తీరలేదని, చేతికొచ్చిన పత్తి పంటను అమ్మి అప్పుతీర్చుదామంటే అదీ కాస్తా నీటిపాలైందని మనోవేదన చెంది ఈనె 26వతేదీ తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు.
అపార నష్టం
Published Thu, Oct 31 2013 6:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement