రాజధానిలో రైతు ఆత్మహత్య
హైదరాబాద్: పంట నష్టం ఆవేదన.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలన్న ఆందోళన.. కన్న కొడుకు అనారోగ్యం.. వైద్యం చేయించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దైన్యం.. అన్నీ కలసి ఓ రైతన్న ప్రాణాలను బలితీసుకున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ రైతు ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఇంతకాలం గ్రామాల్లోనే జరుగుతు న్న రైతుల ఆత్మహత్యలు దీనితో రాజధానికి చేరాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన లింబయ్య అనే రైతు బుధవారం హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో కరెంట్ స్తంభానికి ఉరి వేసుకొన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రాతాలరామరెడ్డికి చెందిన నేరళ్ల లింబయ్య(50), శ్రీలక్ష్మి దంపతులు. లింబయ్యకు ఐదెకరాల పొలం ఉంది.
దీనిపై వచ్చే ఆదాయంతోనే కుటుం బాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నరేష్ (25) డిగ్రీ పూర్తిచేయగా, నవిత (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. మరో కుమారుడు నవీన్ (19) డిగ్రీ మొదటి సంవత్సరం కామారెడ్డిలో చదువు తున్నాడు. మూడేళ్లుగా పెద్ద కుమారుడు నరేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజుల నుంచి మూర్ఛలు రావడంతో చాదర్‌ఘాట్‌లో న్యూలైఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఒకవైపు రాబడి లేకపోగా మరోవైపు దాదాపు రూ.4 లక్షల అప్పు కావడంతో కుటుంబం పరిస్థితి దీనంగా మారింది.
ఆస్పత్రిలో కుమారుడి వద్ద ఉన్న లింబయ్య బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య లక్ష్మికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఉద యం 8 గంటలకు లోయర్ ట్యాంక్‌బండ్‌లో కట్టమైసమ్మ ఆలయం వద్దకు చేరుకున్నాడు. పూజారిని కలసి రూ.10 వేలు అక్కడ పెట్టి ఆస్పత్రిలో ఉన్న తన కొడుక్కి అందజేయాలని చెప్పి వెళ్లాడు. తొలుత బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లింబయ్యను అక్కడున్న స్థానికులు, పోలీసులు కాపాడి పక్కనే కూర్చోబెట్టారు. తర్వాత ఆలయం సమీపంలోని చెత్త డంపింగ్‌యార్డ్ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంటు స్తంభానికి వైర్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆ సమయంలో పోలీసులు కాస్త పసిగట్టినా లింబయ్య ప్రాణం దక్కేది. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా మారింది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తండ్రి మృతి విషయాన్ని ఆస్పత్రిలో ఉన్న కొడుకుకు చెప్పలేదు. ప్రస్తుతం నరేష్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
పోషణ భారమైంది: లక్ష్మి
మూడేళ్లుగా పంటలు రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయని, కొడుకు ఆరోగ్యం క్షీణిం చిందని లింబయ్య భార్య లక్ష్మి వాపోయింది. వీటికితోడు కుటుంబ పోషణ భారమవడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని విలపిం చింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ లక్ష్మి రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.