
ఆంక్షలంటే కాంగ్రెస్ గల్లంతే
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆంక్షలు లేని ప్రత్యేక తెలంగాణ బిల్లును డిసెంబర్ 9వతేదీలోపు పార్లమెంట్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఆంక్షలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు.
సీమాంధ్రుల డిమాండ్‌కు తలొగ్గి తెలంగాణ ఏర్పాటుపై ఆంక్షలు విధించాలని ప్రయత్నిస్తే విద్యార్థుల నాయకత్వంలో ‘చలో ఢిల్లీ’ నిర్వహిస్తామన్నారు. ఓయూలో విద్యార్థుల దీక్షలకు మద్దతుగా మంగళవారం నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో దీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రం స్పందించకుంటే రిలే దీక్షలను ఆమరణ నిరాహార దీక్షలుగా మారుస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేంద్రం చిన్న చిన్న ఆంక్షలు విధించినా ఒప్పుకుంటామని తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్ పేర్కొనటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విద్యార్థి నాయకులు దరువు ఎల్లన్న, బండారు వీరబాబు చెప్పారు. మొదటి రోజు దీక్షలో విద్యార్థి నేతలు దరువు రమేష్, మంజుల, పూర్ణావతి, వాణి, మాధురి, భూమేశ్, అశోక్, సంగమేశ్వర్, లత, కొత్తపల్లి తిరుపతి పాల్గొన్నారు. లా కళాశాల ప్రొఫెసర్ రమాకాంత్ దీక్షలో ఉన్న విద్యార్థులకు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.