సూర్యాపేట, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా భద్రాచలం వెళ్తూ సూర్యాపేటలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం, మునగాలను సీమాంధ్రలో కలుపుకునేందుకు కొందరు సీమాంధ్ర నాయకులు, పెట్టుబడి దారులు కుట్రపన్నుతున్నారని పేర్కొన్నారు. ఆ కుట్రలను బహిర్గతం చేసేందుకు టీఎన్‌జీఓ కృషి చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే భద్రాద్రి రామయ్య ఆలయం పూర్తిగా మునిగి పోతుందని గతంలోనే అనేక ప్రజా సంఘాల వారు వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే పోలవరం నిర్మాణం కోసమే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కేంద్రం సీమాంధ్రుల ఒత్తిడికి లొంగకుండా 119 మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు డిసెంబర్ ఒకటో తేదీన ఢిల్లీకి వెళ్లి జీఎంఓ ప్రతినిధులకు సంఘం తరఫున వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు.
సమైక్యవాదులుగా ఉన్న సీపీఎం వారు కూడా భద్రాచలం, మునగాల తెలంగాణలోనే ఉండాలని డిమాండ్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. విభజన జరిగితే తెలంగాణవారికి ప్రమోషన్లు రావంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనడంలో అర్ధం లేదన్నారు. సీమాంధ్రుల పాలనలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఏర్పాటవుతున్న తరుణంలో రాయల తెలంగాణను తెరపైకి తేవడం సరికాదన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జీతం కోసం పీఆర్సీ..జీవితం కోసం తెలంగాణ అనే నినాదంతో ఉద్యోగులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల చివరి వరకు ప్రభుత్వం పరిష్కరించకుంటే డిసెంబర్‌లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో టీఎన్‌జీవోస్ రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, రేచల్, శ్రీనివాసరావు, శైలజ, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల సంఘం అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, కె.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి ఉన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి : దేవీ ప్రసాద్
Published Tue, Nov 26 2013 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement