విభజన తప్పదన్నారు.. అయినా పోరాడతాం
రాష్ట్ర విభజనపై వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తమతో అన్నట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన అలా అన్నప్పటికీ.. సమైక్యాంధ్ర కోసం తమ ప్రయత్నాలు మాత్రం మానేది లేదని, కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభిప్రాయాలను తాము దిగ్విజయ్ సింగ్కు వివరించినట్లు తెలిపారు. మంత్రులు రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కలిసి బుధవారం దిగ్విజయ్ సింగ్ను ఆయన నివాసంలో కలిశారు. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న నిరసనలు, సచివాలయంలో జరుగుతున్న వివాదాలు, తిరుపతి దిగ్బంధం తదితర అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
మంత్రులిద్దరూ ఎన్ని చెప్పినా.. దిగ్విజయ్ మాత్రం విభజన విషయంలో సీడబ్ల్యుసీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకుందని, ఆ విషయంలో ఇక వెనక్కి వెళ్లడం గానీ, యూటర్న్ తీసుకోవడం గానీ కుదరని పని అని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అధిష్ఠానానికి విధేయులుగానే ఉంటామని పలువురు నాయకులు చెప్పిన విషయాన్ని కూడా ఆయన మంగళవారం విలేకరుల వద్ద ప్రస్తావించారు. అయితే.. విభజనపై అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు తమ అభిప్రాయం కూడా చెప్పే అవకాశం ఇవ్వాలని, అంతేతప్ప.. ఆ సమయంలో విప్ జారీ చేస్తే మాత్రం ఆ కొద్దిపాటి అవకాశం కూడా తమ చేజారిపోతుందని మరో మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి దిగ్విజయ్ సింగ్తో అన్నారు.
ఇక మరోవైపు, త్వరలో జరగనున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీ వరెడ్డి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతిని ఆహ్వానించినట్లు మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. బుధవారం వారు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈమేరకు ఆయనకు ఆహ్వానం అందజేశారు.