మృత్యు బావి! | Well-death! | Sakshi
Sakshi News home page

మృత్యు బావి!

Published Fri, Jun 3 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

Well-death!

పూడిక తీసేందుకు దిగి కూలీ.. అతన్ని కాపాడేందుకు యత్నించి యజమాని మృతి
శ్రమకోర్చి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ టీమ్  కొండూరులో విషాదం

 

కొండూరు (నందిగామ రూరల్) : బావిలో పూడిక తీసేందుకు దిగి ఇద్దరు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండూరు గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన సీలం శ్రీనివాసరావు ఇంటి ఆవరణలోని బావి ఒట్టిపోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ సత్యానందం అనే కూలీ పూడిక తీత కోసం బావిలోకి దిగాడు. దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న బావిలోకి దిగిన సత్యానందం నుంచి ఎంతకు ఎటువంటి సమాధానం లేకపోవడంతో శ్రీనివాసరావు చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారిలో జక్రయ్య అనే వ్యక్తి తాడు సాయంతో బావిలోకి దిగాడు. 15 అడుగుల లోతులోకి వెళ్లిన వెంటనే ఊపిరి ఆడటం లేదంటూ జక్రయ్య కేకలు వేయడంతో అతన్ని పైకి లాగారు.


అనంతరం యజమాని శ్రీని వాసరావు మోకు సాయంతో స్వయంగా బావిలోకి దిగాడు. 13 అడుగుల లోతుకు వెళ్లిన వెంటనే అతను ఊపిరి అందక బావిలోకి పడిపోయాడు. వారిద్దరినీ కాపాడేందుకు లక్ష్మీనారాయణ అనే మరో వ్యక్తి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అతను సైతం  ఊపిరందక కేకలు వేయడంతో అతన్నీ పైకి లాగారు. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రెవెన్యూ, పోలీసు, ఫైర్ శాఖల అధికారులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నారు. ఫైర్ అధికారులు ముందుగా దీపాన్ని బావిలోకి దింపారు. కొంత లోతుకు వెళ్లే సరికి దీపం ఆరిపోవడంతో బావిలో ఆక్సిజన్ అందడం లేదని నిర్ధారణకు వచ్చారు. వెంటనే జాతీయ విపత్తుల నివారణ శాఖకు సమాచారం అందించారు. రాత్రి ఏడు గంటల సమయంలో వారు గ్రామానికి చేరుకున్నారు. బావి విస్తీర్ణం తక్కువగా ఉండటం, లోతు అధికంగా ఉండటంతో వారు సైతం తొలుత బావిలో దిగేందుకు సాహసించలేదు. చివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంలో ఒకరు బావిలోకి దిగేందుకు ముందుకువచ్చారు. ఎట్టకేలకు రాత్రి  9 గంటల సమయానికి ఇంటి యజమాని శ్రీనివాసరావు (43), కూలీ బెల్లంకొండ సత్యానందం (35) మృతదేహాలను అతి కష్టంమీద వెలికి తీశారు. తహసీల్దార్ వై.వి.ప్రసన్నలక్ష్మి, ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ, ఫైర్ సిబ్బంది గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 
కన్నీటి పర్యంతమైన కుటుంబసభ్యులు

పూడిక తీసేందుకు బావిలోకి దిగి శ్రీనివాసరావు, సత్యానందం మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఊహించని విధంగా వారు మృత్యువాత పడటం కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులను సైతం కలచివేసింది. నీటి కోసం తాము ప్రయత్నిస్తే, మృత్యువు తమ వారిని కబళించిందంటూ భోరున విలపిస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement