జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో నగలు తయారు చేసిస్తానని బంగారంతో ఉడాయించిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముషారఫ్ ముల్లా అనే వ్యక్తి జంగారెడ్డిగూడెంలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నాడు.
బంగారు నగలు తయారు చేసిస్తూ స్థానికంగా నమ్మకంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నగలు చేసి ఇమ్మంటూ పలువురు ఇచ్చిన సుమారు కేజీ బంగారంతో గత మార్చిలో అకస్మాత్తుగా మాయమయ్యాడు. కొద్ది రోజుల అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ముషారఫ్ ముల్లా పశ్చిమబెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. అతని నుంచి సుమారు 590 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపనున్నట్లు ఎస్పీ తెలిపారు.