నువ్వా..నేనా! | West Godavari districts members Legislative Council election campaigns | Sakshi
Sakshi News home page

నువ్వా..నేనా!

Published Fri, Mar 20 2015 3:42 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

నువ్వా..నేనా! - Sakshi

నువ్వా..నేనా!

ఏలూరు సిటీ :ఉభయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యుల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి..ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెండురోజులు ఉంటే...అభ్యర్థుల ప్రచారాలు నేటి సాయంత్రం 5గంటలతో ముగియనున్నాయి. ఇప్పటివరకూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇక ఓటర్లకు తాయిలాలు సమర్పించుకునే పనిలో కొందరు అభ్యర్థులు, మద్దతుదారులు బిజీగా ఉన్నారు. బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ అధినేత డాక్టర్ పరుచూరి కృష్ణారావు, సామాజిక, విద్యావేత్త రాము సూర్యారావు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 9,375 మంది ఓటర్లు ఉండగా, వారికోసం 49 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈనెల 22న ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
 
 ఆ ‘ముగ్గురు’
 అధికార పార్టీ అండదండలతో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ అధినేత డాక్టర్ పరుచూరి కృష్ణారావు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, యూటీఎఫ్ మద్దతుతో సామాజిక వేత్త రాము సూర్యారావు మండలి పోటీలో ఉన్నారు. వీరితోపాటు మరో 12మంది అభ్యర్థులు ఉన్నా పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యే ఉంది. టీడీపీ శ్రేణులన్నీ చైతన్యరాజు గెలుపు కోసం పనిచేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లి ఆయనకు ఓటు వేయాల్సిందిగా టీడీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందరి సహకారం ఉంది కాబట్టి విజయం తమదేనంటున్నారు చైతన్యరాజు. పరుచూరి కృష్ణారావు తనదైన శైలిలో ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వ విద్యారంగం పటిష్టతకు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
 
 ఆర్భాటాలకు దూరంగా ఉండే పరుచూరి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో ఉపాధ్యాయులను కలిసి తానేం చేస్తానో చెబుతూ ఓట్లు అభ్యర్థించటం వల్ల ఉపాధ్యాయుల్లో ఆయనపై సానుకూల ధృక్పథం ఏర్పడిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్త, సామాజిక వేత్త రాము సూర్యారావుకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల్లో పెద్దన్నగా ఉన్న యూటీఎఫ్ విసృ్తత ప్రచారం చేసింది.  సూర్యారావు తన విజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ముక్కోణపు పోటీలో గెలుపు గుర్రం ఎక్కేదెవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
 
 గురువులు ఎవరి వైపు
 ఉపాధ్యాయ, అధ్యాపకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి పక్షాన ఉన్నారనే అంశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సమస్యలపై పోరాటాలు చేసే సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత ఓటర్లు చూపించిన విజ్ఞతను విద్యావంతులైన ఇక్కడి ఉపాధ్యాయులు ప్రదర్శిస్తారా లేక సొమ్ములకే దాసోహమంటారా అనేది ఫలితాలు వెలువడితే గాని తేటతెల్లం కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement