Legislative Council election
-
మండలి పోరు రసవత్తరం
వైఎస్ఆర్సీపీ మద్దతుతో జోరందుకున్న పీడీఎఫ్ దూసుకెళుతున్న యండపల్లి, విఠపు టీడీపీ అభ్యర్థుల్లో కలవరపాటు ప్రచారానికి రెండు రోజులే గడువు రాయలసీమ తూర్పు విభాగం చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్)కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో మరో మారు బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీలు కొత్త ఉత్సాహంతో దూసుకెళుతుంటే.. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. చిత్తూరు (కలెక్టరేట్): ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం ఓవైపు, అధికారంలో ఉన్నా పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే భయం మరోవైపు పీడిస్తోంది. సాధారణ ఎన్నికలకు భిన్నంగా విద్యావంతులు మాత్రమే ఓటువేసే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి 7వ తేదీ సాయంత్రానికి తెరపడనుంది. దీంతో ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీలు, అటు అధికార పార్టీ అభ్యర్థులు గెలుపుకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 9వ తేదీ జరుగనున్న శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నా రు. అందులో పట్టభద్రుల స్థానానికి 14 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 9మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అయితే బరిలో అధిక సంఖ్య లో అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా పీడీఎఫ్‌కు చెందిన సిట్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, అధికార పార్టీకి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాసుదేవనాయుడుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వైఎస్సార్సీపీ మద్దతుతో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న పీడీఎఫ్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు పలికింది. ఇప్పటికే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా రెండు దఫాలు వరుసగా కొనసాగుతున్న విఠపు బాలసుబ్రమణ్యం మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యండపల్లి శ్రీనివాసులు రెండో దఫా మరోమారు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ఇటు ఉపాధ్యాయులకు, అటు పట్టభద్రులకు సుపరిచితులే. వారిరువురికీ సమస్యలపట్ల పోరాట యోధులుగా, సౌమ్యులుగా మంచి పేరుంది. నియోజకవర్గ పరిధిలోని మూడు జిల్లాల్లోనూ వీరిద్దరికి క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే అనుచర గణంతోపాటు, మంచి పరిచయాలూ ఉన్నాయి. కాబట్టే వీరు వరుస విజయాలతో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఎన్నికలకు రెండు నెలలకు ముందు నుంచే పీడీఎఫ్ తిరిగి వీరిని అభ్యర్థులుగా ప్రకటించడంతో అప్పటి నుంచే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనికితోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పీడీఎఫ్‌కు మద్దతు పలకడంతో సిట్టింగ్ ఎమ్మెల్సీలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. టీడీపీలో కలవరపాటు గడచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపజయాలను చవిచూసిన అధికార టీడీపీ పార్టీ మరో మారు ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంత్రి నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డిని పట్టభద్రుల స్థానానికి బరిలోకి దింపారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో అనుచరగణం ఉన్నా, పట్టభద్రులకు నిరుద్యోగ భృతి అందించడం, ఉద్యోగాల కల్పన లాంటి హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు. దీంతో అధికార పార్టీ వర్గాల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఉపాధ్యాయుల స్థానానికి చిత్తూరు జిల్లాకు చెందిన వాసుదేవనాయుడును బరిలోకి దింపింది. అయితే ఆది నుంచి ఈ స్థానానికి టికెట్ ఆశించిన తిరుపతికి చెందిన ప్రముఖ విద్యాసంస్థల చైర్మన్ చదలవాడ సుచరితకు ఆఖరుకు ఆశ ఫలించక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతవరకు మహిళకు చోటు కల్పించిన దాఖలాలు లేకపోగా, మొదటగా మహిళా అభ్యర్థి అధికార పార్టీకి అసమ్మతి వర్గంగా బరిలో ఉండడం కలవరపెడుతోంది. అదేగాక ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలమవడం కూడా ఒక కారణంగా నిలిచింది. అయితే పీడీఎఫ్‌కు చెందిన ఉపాధ్యాయుల స్థానం అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు గత ఎన్నికల్లో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమయిన యూటీఎఫ్ మద్దతుతోనే రెండు దఫాలు గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో యూటీఎఫ్‌కు మరో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ కూడా మద్దతు పలికి తోడవడం, దీనికితోడు వైఎస్సార్సీపీ మద్దతు పలకడంతో విఠపు బాలసుబ్రమణ్యం విజయానికి మరింత బలాన్ని ఇచ్చింది. పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్రారెడ్డి కూడా జాతీయ స్థాయి పెద్ద పార్టీ పేరుతో ఒకింత శాయశక్తులా కృషి చేస్తున్నారు. అదేస్థాయిలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానానికి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు. -
ప్రమాణంగా చెబుతున్నా డబ్బు తీసుకోలేదు
జేడీఎస్ నేత హెచ్.డి.రేవణ్ణ స్పష్టీకరణ బెంగళూరు: రాజ్యసభతో పాటు శాసనమండలి ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కోసం అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని జేడీఎస్ నేత హెచ్.డి.రేవణ్ణ స్పష్టం చేశారు. తాను ఏ అభ్యర్థి నుంచి రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. ఈ విషయంపై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేందుకు తాము డబ్బులు తీసుకోలేదని జేడీఎస్ రెబల్ అభ్యర్థులు దేవుడి ఎదుట ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని రేవణ్ణ ప్రశ్నించారు. ‘రెబల్ ఎమ్మెల్యేల్లో ఎవరినైనా రమ్మని చెప్పండి, ధర్మస్థల మంజునాథ స్వామి సన్నిధిలోనైనా లేదంటే మైసూరు చాముండేశ్వరి దేవి సన్నిధిలోనైనా సరే ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. గతంలో జేడీఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయ్‌మాల్యా, రాజుచంద్ర శేఖర్ ఇలా ఎవరినైనా అడగండి, వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రెబల్ అభ్యర్థులపై నేను ఏనాడూ విమర్శలు చేయలేదు. అయినా కూడా నాపై, పార్టీపై ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. పార్టీ తరఫున నిర్ణయాలు తీసుకోవడానికి నేను జాతీయ అధ్యక్షుడు కాదు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కాదు’ అని రేవణ్ణ పేర్కొన్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజంట్‌గా వ్యవహరించినందున పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారి వివరాలను పార్టీ అధినాయకత్వానికి అందజేశానని రేవణ్ణ వెల్లడించారు. -
‘ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్ విడుదల
రెండు స్థానాలకు పోటీ టీడీపీ నుంచి వైవీబీ, వైఎస్సార్సీపీ నుంచి ఆదిశేషగిరిరావు పేర్లు ఖరారు రెండో అభ్యర్థినీ బరిలో నిలిపే యత్నాల్లో ‘దేశం’ జూలై 3న పోలింగ్ మచిలీపట్నం : జిల్లాలోని స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్ బాబు.ఎ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల కాలం వరకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా వైవీబీ రాజేంద్రప్రసాద్, ఐలాపురం వెంకయ్య పనిచేశారు. వైవీబీ రాజేంద్రప్రసాద్ పదవీకాలం 2013 మార్చిలో ముగియగా, ఐలాపురం వెంకయ్య పదవీకాలం 2015 మార్చిలో ముగిసింది. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం జేసీ చాంబర్లో ప్రత్యేక ఎన్నికల కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన 1170 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలో జరిగే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు ఇలా ఉంది. మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 17న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 19 వరకు గడువు ఉంది. పోలింగ్ జూలై మూడో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది. జిల్లాలోని విజయవాడ, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జూలై ఏడో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, వైఎస్సార్ సీపీ తరఫున ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అభ్యర్థిత్వాలను ప్రకటించారు. టీడీపీ మరో అభ్యర్థిని నిలిపేం దుకు ప్రయత్నిస్తోంది. ఈ స్థానానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అర్జునుడు పేరు గాని, మరొకరి పేరు గాని ప్రకటించే అవకాశముందని సమాచారం. జిల్లాలో టీడీపీ తరఫున 672 మంది, వైఎస్సార్ సీపీ తరఫున 450 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
నేడు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహమే ప్రధాన ఎజెండా ! హైదరాబాద్: శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో కదులుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా, ఓట్లు క్రాస్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. జూన్ ఒకటో తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక లు జరగనున్న నేపథ్యంలో పార్టీ శాసనసభా పక్షం (టీఆర్ఎస్ఎల్పీ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్లో సమావేశం కానుంది. మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీఆర్ఎస్ నుంచి అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఈ దృష్ట్యా టీఆర్ఎస్ఎల్పీ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అత్యధికులు కొత్తవారే కావడంతో, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో వారు తప్పులు చేయకుండా అవగాహన కల్పించే బాధ్యతను కేసీఆర్ తీసుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ సూచనలు చేయనున్నారు. భేటీ అనంతరం ఎమ్మెల్యేలకు ‘మాక్ ’ ఓటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఓటింగ్ చేసే విధానంపై శిక్షణ వాస్తవానికి టీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో పార్టీ నాలుగు ఎమ్మెల్సీ సీట్లను తేలిగ్గా గెలుచుకోగలుగుతుంది. కాగా, ఎంఐఎం మద్దతు, తమ మిగులు ఓట్లను కలుపుకొని తమవద్ద మరో 11 ఓట్లు ఉండడంతో అయిదో ఎమ్మెల్సీ సీటుపైనా కన్నేసింది. అయిదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే పక్కా వ్యూహం తప్పని సరి. ఓట్ల విభజన కూడా కీలకం. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి కేటాయించే ఎమ్మెల్యేలు, వారికి అప్పజెప్పే ప్రాధాన్య ఓట్లు, వేసిన ఓటు చెల్లుబాటు అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వంటి అంశాలను ఈ సమావేశంలో వివరించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు కోరిన టీఆర్ఎస్
వైఎస్ జగన్‌కు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్ ఆలోచించి చెబుతామన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి మద్దతు కూడగట్టే బాధ్యతను భుజాలపై వేసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. మండలి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ఈ అంశంపై ఆలోచించి చెబుతామని బదులిచ్చారు. మండలి బరిలోకి దింపిన ఐదుగురు పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేటీఆర్ ఇప్పటికే సీపీఎం, సీపీఐ నేతలతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతోనూ మాట్లాడారు. -
నువ్వా..నేనా!
ఏలూరు సిటీ :ఉభయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యుల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి..ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెండురోజులు ఉంటే...అభ్యర్థుల ప్రచారాలు నేటి సాయంత్రం 5గంటలతో ముగియనున్నాయి. ఇప్పటివరకూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇక ఓటర్లకు తాయిలాలు సమర్పించుకునే పనిలో కొందరు అభ్యర్థులు, మద్దతుదారులు బిజీగా ఉన్నారు. బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ అధినేత డాక్టర్ పరుచూరి కృష్ణారావు, సామాజిక, విద్యావేత్త రాము సూర్యారావు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 9,375 మంది ఓటర్లు ఉండగా, వారికోసం 49 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈనెల 22న ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ ‘ముగ్గురు’ అధికార పార్టీ అండదండలతో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ అధినేత డాక్టర్ పరుచూరి కృష్ణారావు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, యూటీఎఫ్ మద్దతుతో సామాజిక వేత్త రాము సూర్యారావు మండలి పోటీలో ఉన్నారు. వీరితోపాటు మరో 12మంది అభ్యర్థులు ఉన్నా పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యే ఉంది. టీడీపీ శ్రేణులన్నీ చైతన్యరాజు గెలుపు కోసం పనిచేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లి ఆయనకు ఓటు వేయాల్సిందిగా టీడీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందరి సహకారం ఉంది కాబట్టి విజయం తమదేనంటున్నారు చైతన్యరాజు. పరుచూరి కృష్ణారావు తనదైన శైలిలో ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వ విద్యారంగం పటిష్టతకు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండే పరుచూరి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో ఉపాధ్యాయులను కలిసి తానేం చేస్తానో చెబుతూ ఓట్లు అభ్యర్థించటం వల్ల ఉపాధ్యాయుల్లో ఆయనపై సానుకూల ధృక్పథం ఏర్పడిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్త, సామాజిక వేత్త రాము సూర్యారావుకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల్లో పెద్దన్నగా ఉన్న యూటీఎఫ్ విసృ్తత ప్రచారం చేసింది. సూర్యారావు తన విజయంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ముక్కోణపు పోటీలో గెలుపు గుర్రం ఎక్కేదెవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. గురువులు ఎవరి వైపు ఉపాధ్యాయ, అధ్యాపకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి పక్షాన ఉన్నారనే అంశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సమస్యలపై పోరాటాలు చేసే సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత ఓటర్లు చూపించిన విజ్ఞతను విద్యావంతులైన ఇక్కడి ఉపాధ్యాయులు ప్రదర్శిస్తారా లేక సొమ్ములకే దాసోహమంటారా అనేది ఫలితాలు వెలువడితే గాని తేటతెల్లం కాదు.