జేడీఎస్ నేత హెచ్.డి.రేవణ్ణ స్పష్టీకరణ
బెంగళూరు: రాజ్యసభతో పాటు శాసనమండలి ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కోసం అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని జేడీఎస్ నేత హెచ్.డి.రేవణ్ణ స్పష్టం చేశారు. తాను ఏ అభ్యర్థి నుంచి రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. ఈ విషయంపై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేందుకు తాము డబ్బులు తీసుకోలేదని జేడీఎస్ రెబల్ అభ్యర్థులు దేవుడి ఎదుట ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని రేవణ్ణ ప్రశ్నించారు. ‘రెబల్ ఎమ్మెల్యేల్లో ఎవరినైనా రమ్మని చెప్పండి, ధర్మస్థల మంజునాథ స్వామి సన్నిధిలోనైనా లేదంటే మైసూరు చాముండేశ్వరి దేవి సన్నిధిలోనైనా సరే ప్రమాణం చేయడానికి నేను సిద్ధం.
గతంలో జేడీఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయ్‌మాల్యా, రాజుచంద్ర శేఖర్ ఇలా ఎవరినైనా అడగండి, వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రెబల్ అభ్యర్థులపై నేను ఏనాడూ విమర్శలు చేయలేదు. అయినా కూడా నాపై, పార్టీపై ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. పార్టీ తరఫున నిర్ణయాలు తీసుకోవడానికి నేను జాతీయ అధ్యక్షుడు కాదు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కాదు’ అని రేవణ్ణ పేర్కొన్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజంట్‌గా వ్యవహరించినందున పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారి వివరాలను పార్టీ అధినాయకత్వానికి అందజేశానని రేవణ్ణ వెల్లడించారు.