నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహమే ప్రధాన ఎజెండా !
హైదరాబాద్: శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో కదులుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా, ఓట్లు క్రాస్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. జూన్ ఒకటో తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక లు జరగనున్న నేపథ్యంలో పార్టీ శాసనసభా పక్షం (టీఆర్‌ఎస్‌ఎల్పీ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో సమావేశం కానుంది. మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీఆర్‌ఎస్ నుంచి అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఈ దృష్ట్యా టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అత్యధికులు కొత్తవారే కావడంతో, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో వారు తప్పులు చేయకుండా అవగాహన కల్పించే బాధ్యతను కేసీఆర్ తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ సూచనలు చేయనున్నారు. భేటీ అనంతరం ఎమ్మెల్యేలకు ‘మాక్ ’ ఓటింగ్ కూడా నిర్వహించనున్నారు.
ఓటింగ్ చేసే విధానంపై శిక్షణ
వాస్తవానికి టీఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో పార్టీ నాలుగు ఎమ్మెల్సీ సీట్లను తేలిగ్గా గెలుచుకోగలుగుతుంది. కాగా, ఎంఐఎం మద్దతు, తమ మిగులు ఓట్లను కలుపుకొని తమవద్ద మరో 11 ఓట్లు ఉండడంతో అయిదో ఎమ్మెల్సీ సీటుపైనా కన్నేసింది. అయిదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే పక్కా వ్యూహం తప్పని సరి. ఓట్ల విభజన కూడా కీలకం. ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి కేటాయించే ఎమ్మెల్యేలు, వారికి అప్పజెప్పే ప్రాధాన్య ఓట్లు, వేసిన ఓటు చెల్లుబాటు అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వంటి అంశాలను ఈ సమావేశంలో వివరించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.