మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్‌ | I Will Be CM For Next 10 Years: KCR | Sakshi
Sakshi News home page

సీఎం మార్పుపై మాట్లాడితే బయటికే: కేసీఆర్‌

Published Mon, Feb 8 2021 1:54 AM | Last Updated on Mon, Feb 8 2021 8:28 AM

I Will Be CM For Next 10 Years: KCR - Sakshi

తెలంగాణలో అస్థిరతను సృష్టించేందుకు కొన్ని శక్తులు చేసిన కుట్రలను అడ్డుకునేందుకు, ఇతరుల ముందు పలుచన కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం పదవి తీసుకున్న. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తితో పోలిస్తే ముఖ్యమంత్రి పదవి నాకు చెప్పుతో సమానం. పదవిని వదులుకోవాల్సి వస్తే అందరికీ చెప్పి చేస్తా.  

►పార్టీని నడపడం పాన్‌ డబ్బా పెట్టినంత ఈజీ కాదు, ఆట పాటలతో పార్టీలు నడవవు. నాయకత్వానికి ఎంతో పట్టుదల, నిబద్ధత ఉంటేనే మనుగడ సాగిస్తది. గతంలో కొందరు నేతలు 12 పార్టీలు పెట్టి నానా అవస్థలు పడినా చివరి వరకు కొనసాగలే. 

►సోషల్‌ మీడియా పరిస్థితి దరిద్రంగా తయారైంది. అందులో వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా దీటైన సమాధానం ఇవ్వాలి. పార్టీ పరంగా సోషల్‌ మీడియా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.

సాక్షి, హైదరాబాద్‌: నాయకత్వ మార్పు అనేది లేదని.. ఈ విషయంలో ప్రకటనలు చేసే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులపై కఠిన చర్యలుంటాయని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కే. చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. శారీరకంగా, ఆలోచనాపరంగా తాను పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నానని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో పదేండ్లు తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల సమావేశంలో సుమారు 2గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు.

రెండు దశాబ్దాలుగా పార్టీ ప్రస్థానాన్ని సోదాహరణంగా ప్రస్తావిస్తూ సంస్థాగతంగా బలోపేతం, సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, ప్లీనరీ నిర్వహణ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్‌ మేయర్‌ పేరును సీల్డ్‌ కవర్‌లో సూచిస్తానని ప్రకటించిన కేసీఆర్‌.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, మండలి గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కాపాడుకుంటానని, అదే సమయంలో పనితీరు సరిగా లేని వారికి వచ్చే ఎన్నికల్లో అవకాశముండదనే సంకేతాలను కూడా ఇచ్చారు. పోడు భూముల సమస్యను జిల్లా పర్యటనల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేలు, సంబంధిత వర్గాలను భాగస్వాములను చేస్తూ పరిష్కరిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

సీఎం మార్పుపై మాట్లాడితే బయటికే.. 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో పదేండ్లు కొనసాగుతానని గతంలోనే అసెంబ్లీ వేదికగా చెప్పా. నేను శారీరకంగా, ఆలోచనాపరంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నా. ముఖ్యమంత్రి మార్పు గురించి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అనవసరంగా మాట్లాడుతున్నరు. రోజుకొకరు లైన్‌లోకి వచ్చి సీఎం మారుతారంటూ లూజ్‌ టాక్‌ చేస్తూ నాన్సెన్స్‌ ప్రకటనలు చేస్తున్నరు. ఈ రోజు తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొడతా.. తోలు తీస్తా.. కర్రుకాల్చి వాత పెడతా. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని ఉపేక్షించకుండా నేరుగా బయటికి పంపిస్తా. మీరందరూ నాకు కుటుంబ సభ్యులతో సమానం. ఏదైనా ఉంటే మీ అందరితో చర్చించి ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణయం తీసుకుంటా. పార్టీని మనం కాపాడుకుంటేనే.. మనలను పార్టీ కాపాడుతుంది.


తెలంగాణ భవన్‌లోకి వెళ్లేముందు సంతకం చేస్తున్న సీఎం కేసీఆర్‌ 

పార్టీ బలంగా ఉంటేనే బయట కూడా మనకు గౌరవం పెరుగుతుంది. రెండు పర్యాయాలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించి కడుపులో పెట్టి కాపాడుకున్నా. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నా. ఎక్కడైనా తిక్కతిక్కగా మాట్లాడితే పక్కన పెడతా. 10 మందిలో పాము చావదనే సామెత ప్రకారం కొన్నిసార్లు అన్ని విషయాలు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఉదాహరణకు 2018, సెప్టెంబర్‌ 6న ఉదయం 11 గంటల వరకు మీరు ఎమ్మెల్యేలు.. మధ్యాహ్నం మాజీలు.. సాయంత్రానికి మీరు పార్టీ అభ్యర్థులు. కొన్ని విధాన నిర్ణయాలు అందరికీ చెప్పి తీసుకోవడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. 

పార్టీ పెట్టడం పాన్‌ డబ్బా పెట్టినంత ఈజీ కాదు
ఇరవై ఏండ్ల కింద ఉద్యమ పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గమ్యాన్ని ముద్దాడి సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఉద్యమ సమయంలో పార్టీని ఖతం చేసేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. అయినా గుండె ధైర్యంతో నిలబడి కొట్లాడి లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినం. పార్టీని నడపడం పాన్‌ డబ్బా పెట్టినంత ఈజీ కాదు, ఆట పాటలతో పార్టీలు నడవవు. నాయకత్వానికి ఎంతో పట్టుదల, నిబద్ధత ఉంటేనే మనుగడ సాగిస్తది. గతంలో జానారెడ్డి మొదలుకుని విజయశాంతి, ఆలె నరేంద్ర, దేవేందర్‌గౌడ్‌తో సహా 12 పార్టీలు పెట్టి నానా అవస్థలు పడినా చివరి వరకు కొనసాగలే. పార్టీలు పెట్టి, పార్టీలు మారి ఎంతో మంది నష్టపోయినరు.


ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు. చిత్రంలో కేకే, కేటీఆర్,  ఇతర మంత్రులు,  ప్రజా ప్రతినిధులు 

గతంలో టీడీపీలో పనిచేసిన కాలంలో డి.రామచంద్రారెడ్డిని పార్టీ మారవద్దని చెప్పినా వినకుండా నష్టపోయారు. 65 లక్షల మంది కార్యకర్తలున్న కుటుంబం మనది. అందరినీ కలుపుకుని సమన్వయంతో ముందుకు పోవాలే. జిల్లా మంత్రులు చొరవ తీసుకుని నెలలో ఒకట్రెండు మార్లు జడ్పీ చైర్మన్‌ ఇంట్లోనో, ఇతరుల వద్దో అందరూ కలసి భోంచేసి మంచీచెడూ మాట్లాడుకుంటే పార్టీ ఐక్యంగా ఉందనే సందేశం బయటకు వెళుతుంది. మార్కెటింగ్, దేవాలయ కమిటీల నామినేటెడ్‌ పదవుల నియామకంతో సహా ఇతర విషయాల్లో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అభిప్రాయానికి పెద్దపీట వేయాలి. అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా అందరిని కలుపుకొని ముందుకెళ్లాలి. 

12 నుంచి సభ్యత్వ నమోదు..  
ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. గతంలో 65 లక్షల మందిని సభ్యులుగా చేర్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి నియోజకవర్గానికి 50 వేల చొప్పున కనీసం 80 లక్షల మందిని పార్టీ సభ్యులుగా నమోదు చేయాలి. గతంలో సభ్యత్వ నమోదు సందర్భంగా పూర్తి వివరాలు నమోదు చేయకపోవడంతో చనిపోయిన కార్యకర్తల కుటుం బాలకు బీమా పరిహారం అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సభ్యత్వ నమోదును పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా ఇంచార్జీలు, ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షిస్తరు. రాష్ట్ర స్థాయిలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాశ్‌రెడ్డి తదితరులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలిస్తరు. సభ్యత్వ నమోదుపై దిశా నిర్దేశం చేసేందుకు అవసరమైతే ఈ నెల 14న మళ్లీ సమావేశం ఉంటుంది.

ఈ నెలాఖరులోగా సభ్యత్వాన్ని నమోదు చేసి మార్చి నెలాఖరులోగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి. పార్టీ పెట్టి 20 ఏండ్లు పూర్తయినందున ఏప్రిల్‌ వరకు కరోనా భయం తొలగితే భారీ బహిరంగ సభ పెట్టుకుందాం. ఎవరు ఉత్సాహం చూపితే ఆ జిల్లాలో ప్లీనరీ, బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందాం. రెండు నెలల్లో పార్టీ అధ్యక్షుడి హోదాలో జిల్లా పర్యటనలు కూడా పూర్తి చేస్తా. సోషల్‌ మీడియా పరిస్థితి దరిద్రంగా తయారైంది. అందులో వచ్చే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా పూర్తి సమాచారంతో ధీటైన సమాధానం ఇవ్వాలి. పార్టీ పరంగా సోషల్‌ మీడియా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నం. మంచి ముహూర్తం చూసుకుని శంకుస్థాపన చేస్తం. 

సీల్డ్‌ కవర్‌లో మేయర్‌.. 
ఈ నెల 11న జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో పార్టీ అభ్యర్థి పేరును సీల్డ్‌ కవర్‌లో పంపిస్తా. పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకునేలా హైదరాబాద్‌కు చెందిన మంత్రులు సమన్వయం చేయాలి. అల్పాహారం తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తరలివెళ్లాలి. ఎన్నిక సమయంలో సీల్డ్‌ కవర్‌ తెరిచి అభ్యర్థి పేరును ప్రకటిస్తే ఇతర కార్పొరేటర్లు మద్దతు పలికి సునాయాసంగా ఎన్నిక జరిగేలా చూడాలి. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి పేరును కూడా అదే రోజు ప్రకటిస్తం. మేయర్‌ అభ్యర్థి విషయంలో ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదు.

రాబోయే వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ మన పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా ఇప్పటి నుంచి ఐక్యంగా, ప్రణాళికబద్ధంగా పనిచేయాలి. త్వరలో జరిగే శాసన మండలి గ్రాడ్యుయేట్స్‌ ‘వరంగల్‌– నల్లగొండ– ఖమ్మం’అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తరు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సన్నాహక సమావేశాలు కూడా జరుగుతున్నయి. ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును త్వరలో ఖరారు చేస్తం. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలోనూ మనమే గెలుస్తం. ఈ నెల 10న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి. 

పోడు భూముల సమస్య... 
చాలా జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉండటంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నరు. ఈ విషయంలో స్టేటస్‌ కో పాటించాల్సిందిగా తక్షణమే ఆదేశాలు జారీ చేస్తున్నం. ఎస్టీ ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశమై పోడు భూముల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక షెడ్యూలు కూడా రూపొందిస్తం. జిల్లాల పర్యటన సందర్భంగా అవసరమైతే ఒకట్రెండు రోజులు అక్కడే బస చేసి మంత్రులు, అధికారులు, ఇతరులను భాగస్వాములను చేసి పరిష్కరిస్తా. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివక్షకు సమాజం బాధ్యత వహించాలి. వారి అభ్యున్నతి కోసం ప్రస్తుతమున్న సబ్‌ప్లాన్‌తో పాటు అదనంగా మరో రూ.10 వేల కోట్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నం. కరోనా మూలంగా పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో కొంత స్తబ్దత వచ్చింది. దీనిని తొలగించేలా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు సమష్టిగా పనిచేయాలి.  

గాంధీలా ప్రతీ ఇంట్లో నా బొమ్మ ఉండేది...
తెలంగాణ తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి తీసుకోకపోయి ఉంటే ప్రతీ ఊర్లో, ప్రతీ ఇంట్లో గాంధీ ఫొటోతోపాటు నా ఫొటో కూడా ఉండేది. 2014 ఎన్నికల తర్వాత కొందరు తెలంగాణను తిరిగి ఏపీలో కలుపుతారనే ప్రకటనలు చేయడంతో నెలకొన్న భయాందోళన తొలగించేందుకు ఆఘమేఘాల మీద లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. తెలంగాణలో అస్థిరతను సృష్టించేందుకు కొన్ని శక్తులు చేసిన కుట్రలను అడ్డుకునేందుకు, ఇతరుల ముందు పలుచన కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం పదవి తీసుకున్న. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తితో పోలిస్తే ముఖ్యమంత్రి పదవి నాకు చెప్పుతో సమానం. పదవిని వదులుకోవాల్సి వస్తే అందరికీ చెప్పి చేస్తా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement