రెండు స్థానాలకు పోటీ
టీడీపీ నుంచి వైవీబీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఆదిశేషగిరిరావు పేర్లు ఖరారు
రెండో అభ్యర్థినీ బరిలో నిలిపే యత్నాల్లో ‘దేశం’ జూలై 3న పోలింగ్
మచిలీపట్నం : జిల్లాలోని స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్ బాబు.ఎ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల కాలం వరకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా వైవీబీ రాజేంద్రప్రసాద్, ఐలాపురం వెంకయ్య పనిచేశారు. వైవీబీ రాజేంద్రప్రసాద్ పదవీకాలం 2013 మార్చిలో ముగియగా, ఐలాపురం వెంకయ్య పదవీకాలం 2015 మార్చిలో ముగిసింది. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం జేసీ చాంబర్‌లో ప్రత్యేక ఎన్నికల కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన 1170 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలో జరిగే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు ఇలా ఉంది. మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 17న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 19 వరకు గడువు ఉంది.
పోలింగ్ జూలై మూడో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది. జిల్లాలోని విజయవాడ, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జూలై ఏడో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, వైఎస్సార్ సీపీ తరఫున ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అభ్యర్థిత్వాలను ప్రకటించారు. టీడీపీ మరో అభ్యర్థిని నిలిపేం దుకు ప్రయత్నిస్తోంది. ఈ స్థానానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అర్జునుడు పేరు గాని, మరొకరి పేరు గాని ప్రకటించే అవకాశముందని సమాచారం. జిల్లాలో టీడీపీ తరఫున 672 మంది, వైఎస్సార్ సీపీ తరఫున 450 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు.
‘ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్ విడుదల
Published Wed, Jun 10 2015 12:57 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement