ఫస్ట్ మార్కు ఎవరికో!
శాసనమండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల నాడి అంచనాలకు అందడంలేదు. మేధావి వర్గంగా పిలిచే ఉపాధ్యాయులే ఓటర్లు కావడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. బడిలో పిల్లలకు వేసినట్టే.. అభ్యర్థుల్లో ఎవరికి ఉపాధ్యాయులు ఎన్ని మార్కులు వేస్తారు? ఎవరిని పాస్ చేస్తారు? ‘ఫస్ట్ మార్క’ ఎవరికి వేస్తారు అనే విషయాలు తెలియక బరిలో ఉన్న అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఈ నెల 22న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల బలాబలాల మాట ఎలా ఉన్నా.. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని అంటున్నారు. తెలివైన ఉపాధ్యాయులు ఎవరి పక్షాన నిలుస్తారనేదానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయ్యవార్ల మూడ్‌ను తెలుసుకునేందుకు బంధువులు, శ్రేయోభిలాషులు, వేగులను వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరడంతో అభ్యర్థులు చివరి ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. రెండున్నర నెలలుగా టీచర్లను ప్రసన్నం చేసుకునేందుకు వేసిన ఎత్తులు, పై ఎత్తులు ఎంతవరకూ ఫలితాన్నిస్తాయనేదానిపై అంచనాలు వేసుకుంటున్నారు.
ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినా ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ కనిపిస్తోంది. కార్పొరేట్ విద్యారంగం నుంచి కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), పరుచూరి కృష్ణారావు పోటీలో ఉన్నారు. చైతన్యరాజు అధికార టీడీపీ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే పార్టీకి చెందిన కృష్ణారావు రెబల్గాను, యుటీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా రాము సూర్యారావు పోటీ పడుతున్నారు. వీరితోపాటు మరో 12 మంది కూడా బరిలో నిలిచారు. ఉపాధ్యాయులే ఓటర్లుగా ఉన్నప్పటికీ పరోక్షంగా పలు వర్గాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, వాటికి అనుబంధంగా ఉన్న పలు ఇతర సంఘాలు తెరవెనుక, బయట ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి.
గతంలో రాజ్యసభ సీటు కోసం గట్టి ప్రయత్నం చేసి చివరి నిమిషంలో ఆ అవకాశం కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ, శాసన మండలిలో టీడీపీ విప్ చైతన్యరాజు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. రెండోసారి మండలిలో అడుగు పెట్టడాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా తాను సాధించిన జీఓలు తనకు ప్లస్ పాయింట్ అవుతాయని, అలాగే, గతానికి భిన్నంగా టీడీపీ మద్దతుతో బరిలోకి దిగడం సానుకూల అంశమవుతుందని చైతన్యరాజు అంచనా వేస్తున్నారు. తాను, తన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ రెండు జిల్లాల్లో పలు వర్గాలతో మమేకమవడం, మూడు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ పరిచయాలు తనకు కలసివస్తాయనే ధీమాతో ఉన్నారు.
టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ప్రగతి కృష్ణారావు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రగతి విద్యాసంస్థల సమర్థ నిర్వహణ, పీఈటీ సహా ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉండటం సానుకూలమవుతుందనే అభిప్రాయంతో ఆయనున్నారు. టీడీపీ సభ్యత్వం నుంచి అధిష్టానం తొలగించినా ఉపాధ్యాయులను నేరుగా ప్రసన్నం చేసుకోగలిగానని ఆయన భావిస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాము సూర్యారావు ప్రచారం యూటీఎఫ్ మద్దతుతో చాపకింద నీరులా సాగుతోంది. ఉపాధ్యాయుడిగా ఉన్న నేపథ్యం, ప్రాంతీయ అభిమానం పశ్చిమ గోదావరిలో సానుకూలంగా మారుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇలా ఎవరిధీమాలో వారుండగా ప్రత్యర్థులపై బురదజల్లే ఎత్తులు వేయడంలో కూడా ఒకరిని మించి మరొకరు వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని పీఆర్టీయూ వంటి ఉపాధ్యాయ సంఘాలు నిట్టనిలువునా చీలిపోయాయి. అందుకే గతంలోకంటే ఈసారి సామాన్యులు సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.