విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ‘ప్రజాధనాన్ని దిగమింగిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెట్టయినా తిన్న సొమ్ము కక్కిస్తాం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు’ ఇవి రెండేళ్ల క్రితం జిల్లా పరిషత్ అధికారులు చేసిన వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికారుల వైఖరిలో మార్పువచ్చింది. సొమ్ము దిగమింగిన మాజీ సర్పంచ్‌లపై కన్నెత్తయినా చూడడం లేదు. రికవరీ కావాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తే దాటవేసే ధోరణిలో సమాధానాలిస్తున్నారు. 2007 నుంచి 2011 సంవత్సరం వరకు పదవుల్లో ఉన్న సర్పంచుల్లో చాలామంది పనులు చేపట్టకుండానే నిధులు మింగేశారు. అప్పట్లో ఆడిట్ నిర్వహించిన బృందం జిల్లా వ్యాప్తంగా రూ.ఆరు కోట్ల మేర దుర్వినియోగం అయినట్టు గుర్తించి, పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదిక అందించింది. ఆ నిధులను మాజీ సర్పంచ్‌ల నుంచి రికవరీ చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ముఖ్యనేత హుకుంతో వెనకడుగు
రెండేళ్ల కాలంలో అధికారులు రూ. 6 కోట్లకు గాను రూ. 5 కోట్లను రికవరీ చేశారు. ఇంకా రూ.కోటి వరకు రికవరీ కాలేదు. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన జిల్లా పరిషత్ అధికారులు కొంతమందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. దీంతో భయపడిన అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌లు ఆ పార్టీ పెద్దలను ఆశ్రయించారు. పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత... ఆ మాజీ సర్పంచ్‌ల జోలికి వెళ్ల వద్దని హుకుం జారీచేనట్టు భోగట్టా. దీంతో జిల్లా పరిషత్ అధికారులు వెనక్కితగ్గారని వినికిడి. అధికార పార్టీ నేత ఆదేశాలను ధిక్కరిస్తే ఉద్యోగానికి ఎసరు వస్తుందని భయపడి చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వంద మంది మాజీ సర్పంచ్‌ల నుంచి నిధులు రికవరీ చేయూల్సి ఉంది.
వీరిలో చీపురుపల్లి నియోజకవర్గంలో 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీరందరూ అధికార పార్టీకి చెందిన వారే. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎన్.మోహన్‌రావు వద్ద‘ న్యూస్‌లైన్’ ప్రస్తావించగా రూ. కోటి వరకు నిధులు ఇంకా రికవరీ కావాల్సిన విషయం వాస్తమేనని, రికవరీ కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు.