
ఆర్ట్స్ కళాశాల హాస్టల్‌లో ఏం జరిగింది?
* రాళ్లతో భవనంపైకి దాడి చేసిన దుండగులు
* సుమారు 20 గదుల అద్దాలు ధ్వంసం
* భయాందోళనకు గురైన విద్యార్థులు
* పలువురు విద్యార్థులకు గాయాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : అప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలు.. గదుల్లో కొందరు విద్యార్థులు చదువుకుంటున్నారు.. మరి కొందరు నిద్రిస్తున్నారు. ఉన్నట్టుండి గదుల్లోకి రాళ్ల వర్షం. అద్దాలు ముక్కలు ముక్కలవుతున్నాయి. మరోవైపు కొందరు కర్రలతో వీరంగం సృష్టిస్తున్నారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదుతున్నారు.
కిటికీల అద్వాలు ధ్వసం చేస్తున్నారు. గట్టి కేకలు వేస్తున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాక విద్యార్థులు బిత్తరపోయారు. నిద్రిస్తున్న వారు ఉలిక్కిపడి లేచి వణికిపోవడం వారి వంతయ్యింది. నిమిషాల్లో అక్కడ భయానక వాతావరణం నెలకొని చల్లారిపోయింది. ఇదీ మంగళవారం ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటన.
ఆప్రాంతమంతా భయానక పరిస్థితి:
ఆర్ట్స్ కళాశాల హాస్టల్‌లో సుమారు 15-20 మంది బయట నుంచి వచ్చిన యువకులు వీరంగం సృష్టించారు. రావడం రావడంతోనే కర్రలు చేతబూని హల్‌చల్ చేశారు. కేకలు వేస్తూ లోపలికి ప్రవేశించారు. కొందరు విద్యార్థులను చితకబాదారు. గదుల కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. నిమిషాల్లో ఇదంతా ముగించుకొని బయటకు వచ్చారు.
బయట నుంచి గదుల్లోకి రాళ్ల వర్షం కురిపించారు. అద్దాలు పగిలి కొందరికి, రాళ్లు తగిలి కొందరికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా భయానక పరిస్థితి నెలకొంది. రోడ్డుపై అటుగా వెళ్లేవారు కూడా దుండగుల చేష్టలను చూసి బిత్తరపోయారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరుకునేలోపు దుండగులు పరారయ్యారు.
సీసీ కెమరాల్లో నిక్షిప్తం..
దుండగులు దాడి చేసిన దృశ్యాలు హాస్టల్ సీసీ కెమరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో పోలీసులు వారిని గుర్తించే వేటలో పడ్డారు. వసతిగృహం ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన సమయంలో కర్రలు పట్టుకున్న యువకుల ఫొటోలు కెమెరాల్లో గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
పాత గొడవలే కారణమా? ఇటీవల వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బయటి యువకులతో గొడవపడ్డారు. ఈ గొడవ పర్యావసనమే తాజా దాడి జరిగింది. గతంలో జరిగిన గొడవకు ప్రతీకారంగా యువకులు వచ్చి నానా హంగామా చేశారు. ఇదే విషయాన్ని కొందరు విద్యార్థులకు పోలీసులకు వివరించినట్లు తెలిసింది.
కఠిన చర్యలు తప్పవు ..
హాస్టల్ విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప దాడులు చేస్తే ఎలా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం.
- జబీవుల్లా, డిప్యూటీ వార్డెన్