సాక్షిప్రతినిధి, అనంతపురం: అనంతపురం కార్పొరేషన్ 32వ డివిజన్‌లో నిర్మించిన సిమెంట్ రోడ్డు కార్పొరేషన్ అధికారులను కలవరపెడుతోంది. పాలకవర్గంపై ధీమాతో టెండర్లతో పనిలేకుండా ఓ కాంట్రాక్టర్ రోడ్డును నిర్మించారు. ఈ నెల 16న టెండర్ల గడువు ముగిసింది. అయితే 14నే రోడ్డు నిర్మాణం పూర్తయిపోయింది. ఇదే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువైంది. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో, టెండర్ ఖరారు చేసేముందు టెండర్ అగ్రిమెంటులో ఏం పేర్కొనాలో తెలీక కార్పొరేషన్ అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. చేసేది లేక శుక్రవారం ఓపెన్ చేయాల్సిన టెండర్లను 20వ తేదికి వాయిదా వేశారు.
విద్యుత్‌నగర్‌లోని 32వ డివిజన్‌లో డోర్‌నెంబర్ 12-4-36 నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి వరకూ సిమెంట్‌రోడ్డు నిర్మించేందుకు కార్పొరేషన్ అధికారులు ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్దతిలో టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 16 వరకూ టెండర్లు వేసేందుకు గడువుగా విధించారు. అయితే ఓ కార్పొరేటర్ టెండర్లతో పనిలేకుండా ముందే రోడ్డు నిర్మించారు. ఈ నెల 14న రోడ్డు నిర్మాణం పనులు పూర్తయ్యాయి.
రోడ్డు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో 16న టెండర్ల గడువు ముగిసింది. 17న టెండర్లను ఓపెన్ చేసేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఆన్‌లైన్ టెండర్లు కావడంతో ఎవరు టెండర్ కోడ్ చేశారో తెలీని పరిస్థితి? ఈ క్రమంలో టెండర్ ఖరారు చేయాల్సి వస్తే అగ్రిమెంట్ రాయాలి.
అందులో ‘డోర్‌నెంబర్ 12-4-36 డోర్‌నెంబర్ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకూ’ రోడ్డు నిర్మించాలని పొందుపరచాలి. అయితే ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో పూర్తయిన రోడ్డుకు టెండర్ అగ్రిమెంట్ చేస్తే ఇది అవినీతి అవుతుంది. ఏసీబీ క్రిమినల్ కేసు నమోదు చేస్తుంది. 32వ డివిజన్‌లోని రోడ్డు టెండర్ ఖరారు చేస్తే కార్పొరేషన్ అధికారులపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు ఏంచేయాలో తెలీక శుక్రవారం టెండర్లు ఖరారు చేయకుండా 20వ తేదీకి వాయిదా వేశారు. ఎప్పుడు టెండర్లు ఖరారు చేసినా 16వ తేదీ తర్వాతే అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు ఇప్పటికే పూర్తయిన రోడ్డు ఫోటోలను, పత్రికల క్లిప్పింగ్‌లతో శనివారం జిల్లా కలెక్టర్‌తో పాటు ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికే ఉన్న రోడ్డుపై రోడ్డు నిర్మించే అవసరం లేదు కాబట్టి, 32వ డివిజిన్‌లో 9.23లక్షలతో రోడ్డు నిర్మించేందుకు స్వీకరించిన ఆన్‌లైన్ టెండర్లను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది.
టెండర్లు ఖరారు కాకముందే రోడ్డును నిర్మించేందుకు పాలకవర్గంలోని ఓ ముఖ్య నేతతో పాటు కార్పొరేషన్‌లోని ఓ కీలక అధికారి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కలెక్టర్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, దీన్ని వదిలేస్తే ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతమవుతాయని కార్పొరేషన్ అధికారులను గట్టిగా వారించినట్లు తెలుస్తోంది. టెండర్లు రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఏమిటీ దారి!
Published Sat, Jul 18 2015 2:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement