అక్రమ కట్టడాలపై కొరడా!
కర్నూలు నగరంలో 1700 అక్రమ భవనాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపించేందుకు కర్నూలు నగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా వార్డుల వారీగా అక్రమ కట్టడాలపై సర్వేను పూర్తి చేసింది. రెవెన్యూ యంత్రాంగంతో కలిసి సాగించిన ఈ సర్వే ప్రకారం కర్నూలులో ఏకంగా 1700 అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ అక్రమ కట్టడాలకు ముందుగా కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వీటి నుంచి ఏకంగా 100 శాతం అధికంగా అపరాధ రుసుం రూపంలో పన్నును వసూలు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా అక్రమ కట్టడం కావడంతో ఎప్పుడైనా కూల్చివేస్తామని కూడా నోటీసుల్లో హెచ్చరిస్తున్నారు.
దరఖాస్తులో ఒకలా... కట్టడం మరోలా...!
వాస్తవానికి కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో నిర్మాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి ముందు... పట్టణ ప్రణాళిక విభాగానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పన్ను చెల్లింపు భారాన్ని తగ్గించుకునేందుకు నిర్మాణ విస్తీర్ణాన్ని తక్కువగా చూపుతున్నారు.
అయితే, తీరా నిర్మాణం విషయానికి వచ్చే సరికి మరో విధంగా నిర్మించుకుంటున్నారు. ఉదాహరణకు...కొందరు జీ ప్లస్ ఒకటి అనుమతి తీసుకుని జీ ప్లస్ టు నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు గృహ నిర్మాణానికి అనుమతి తీసుకుని వాణిజ్య భవనాలను నిర్మించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు నగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమైంది. ఈ భవనాలన్నింటికీ ఇప్పటికే నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. ఈ నోటీసుల్లో అక్రమంగా నిర్మించారని... ఎప్పుడైనా మీ కట్టడాన్ని కూల్చివేస్తామని హెచ్చరించడంతో పాటు అపరాధ రుసుంగా 100 శాతం అధికంగా పన్నును చెల్లించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
100 శాతం అపరాధ రుసుం!
అనుమతులు ఒక విధంగా తీసుకుని... నిర్మాణాలు మరో విధంగా చేపట్టిన 1700 అక్రమ కట్టడాలపై అపరాధ రుసుం వసూలు చేయాలని పురపాలకశాఖ నిర్ణయించింది. గృహ నిర్మాణాలకైతే ప్రస్తుతం చెల్లిస్తున్న ఇంటిపన్ను కంటే 100 శాతం అధికంగా అపరాధ రుసుం చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేస్తున్నారు. ఇక ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకుని వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తుంటే.. వాణిజ్య కట్టడాల నుంచి వసూలు చేసే మొత్తాన్ని లెక్కించి.. ఆ మొత్తం కంటే 100 శాతం అధికంగా అపరాధ రుసుం చెల్లించాలని తాఖీదులు ఇస్తున్నారు. ‘ఈ అక్రమ కట్టడాలు నిర్ణీత అనుమతి మేరకు లేవు. దీంతో వీటిని ఎప్పుడైనా కూల్చివేసే అధికారం కార్పొరేషన్‌కి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా నోటీసుల్లో పేర్కొంటున్నాం. అయితే, కూల్చివేయడం పరిష్కారం కాదనేది మా భావన.
అందుకే అపరాధ రుసుంలు వసూలు చేయాలని నిర్ణయించాం. అయితే, ప్రభుత్వం గతంలో మాదిరిగా ‘బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్‌ఎస్)’ తరహాలో క్రమబద్ధీకరణకు కొత్త పథకం తెస్తే మినహా ఈ కట్టడాలు సక్రమ కట్టడాలుగా భావించలేము. అప్పటివరకు ఈ కట్టడాల యాజమాన్యాలు అపరాధ రుసుంలు చెల్లించాల్సిందే’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని కార్పొరేషన్ అధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.