అనంతపురం టౌన్: నగర, పురపాలక సంఘాల పరిధిలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లించేందుకు గడువు ముంచుకొస్తోంది. మరో పది రోజులే గడువు మిగిలింది. వసూలు కావాల్సిన పన్నులు మాత్రం భారీగా ఉన్నాయి. అధికారిక నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 50 శాతమే వసూలయింది. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాల పరిధిలో ఆస్తి పన్ను బకాయిలతో కలుపుకుని వసూలు డిమాండ్ రూ.47.02 కోట్లు ఉండగా రూ.23.91 కోట్లు ఇప్పటి వరకు వసూలైంది.
మిగిలిన పది రోజుల వ్యవధిలో రూ.23.11 లక్షలు వసూలు ఎలా చేయాలని అధికారులు తలపట్టుకున్నారు. పురపాలక సంఘాలకు ఆస్తి పన్ను ప్రధాన ఆదాయవనరు. దీన్ని వసూలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం కావడం భవిష్యత్తుకు ఇబ్బందిగా మారనుంది.
ఆర్థిక సంవత్సరం చివరి నెలలో తప్ప మిగత సమయంలో ఆస్తి పన్ను వసూలులో నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. చివరి నెలలో హడావిడి చేయడం.. అటు తరువాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. మొదటి, రెండవ ఆర్థ సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ దుస్థితి ఉండదు. ఈ కొద్ది వ్యవధిలో 50 శాతం పన్ను వసూలు చేయడం సాధ్యమయ్యే పనికాదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, గుంతకల్లు, కదరి, హిందూపురం, పుట్టపర్తి మునిసిపాలిటీల పరి ధిలో 33 శాతం నుంచి 54 శాతమే వసూలు అయ్యాయి. మిగతా చోట్ల 68 శాతం నుంచి 88 శాతం వరకు జరిగాయి.
వడ్డీ మాఫీ అవకాశం రాకపోవడంతో...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ అవకాశం కల్పించని ప్రభావం పన్ను వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2005 మార్చి నెలలో చివరి పదహైదు రోజులు వడ్డీ మాఫీ అవకాశాన్ని కల్పించింది. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. అప్పట్లో 90 నుంచి 95 శాతం పన్ను వసూళ్లు జరిగాయి. అప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు ప్రతి ఏటా వడ్డీ మాఫీ అవకాశాన్ని కల్పిస్తూ వచ్చారు. దీంతో పన్ను చెల్లింపులు కూడా ఆశాజనకంగా సాగాయి. వడ్డీ మాఫీ అవకాశం కల్పించక ముందుకు ప్రతి ఏటా 50 శాతం పన్ను వసూలయ్యేది. వడ్డీ మాఫీ అవకాశం కల్పించిన పది రోజుల్లో 40 శాతం నుంచి 45 శాతం చెల్లింపులు జరిగేవి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వడ్డీ మాఫీ వస్తుందనే ఆశతో పెద్ద మొత్తం ఆస్తి పన్ను ఉన్న వారు చెల్లించలేదు. ఈ దఫా వడ్డీ మాఫీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం విముఖత చూపింది. దీంతో చెల్లింపులు నిలిచిపోయాయి.
ముంచుకొస్తోంది
Published Sun, Mar 22 2015 11:11 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement