సాక్షి, అనంతపురం : జిల్లా ప్రజలపై వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇప్పటికే డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. దీని నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నానా పాట్లు పడుతుండగా.. కొత్తగా న్యుమోనియా ఆందోళనకు గురిచేస్తోంది. అప్పుడే పుట్టిన పసికందులు మొదలుకుని 13 ఏళ్లలోపు చిన్నారులు దీని బారిన పడుతున్నారు. ప్రతి పది జ్వరం కేసుల్లో 6 నుంచి 8 న్యుమోనియాగా తేలుతున్నాయని వైద్యులు అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో న్యుమోనియా కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతున్నాయి. వాతావరణంలో
తేమ శాతం అధికంగా ఉండడం వల్ల చిన్నారులు న్యుమోనియా బారిన పడుతున్నారు. జిల్లా జనాభా 41 లక్షలు. ఇందులో 0-13 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య ఎనిమిది లక్షలకు పైగా ఉంటుంది. అప్పుడే పుట్టిన పసికందులు మొదలుకుని ఐదేళ్లలోపు పిల్లలపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. 70 శాతం రైలో వైరస్ వల్ల, మరో 30 శాతం బ్యాక్టీరియాల ప్రభావంతో న్యుమోనియా వ్యాపించటానికి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో నెల క్రితం వరకు వేడి అధికంగా ఉండేది. ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాలతో చలి కొద్దిగా ఉంటోంది. రాత్రి పూట ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఫలితంగా న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా రోజుకు 30-40 కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో ఆస్పత్రికెళ్లే ప్రతి పది కేసుల్లో ఆరు న్యూమోనియాగా గుర్తిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం న్యూమోనియాతో బాధపడుతున్న పిల్లలు 50 మంది వరకు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడికి రోజూ 3-4 కేసులు వస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు నర్సింగ్ హోంలలో కూడా న్యుమోనియా బాధితులు పదుల సంఖ్యలో చేరుతున్నారు.
న్యుమోనియా లక్షణాలు
తీవ్ర జ్వరం, దగ్గు, వాంతులు, ఆయాసం ప్రారంభమవుతాయి. జలుబు కూడా తీవ్రంగా ఉంటుంది. ప్రత్యేకించి పసిపిల్లలు ఎలాంటి ఆహారమూ తీసుకోరు. పాలు కూడా తాగేందుకు నిరాకరిస్తారు.
ఇవీ జాగ్రత్తలు:
పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లని వాతావరణానికి దూరంగా ఉంచాలి. కిటికీలు, వెంటిలేషన్ ఉన్న చోట పడుకోనివ్వరాదు. వెచ్చని దుస్తులు ధరింపజేయాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు తీసుకెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులతో పాటు ముఖానికి మఫ్లవర్ తప్పనిసరి. ప్రత్యేకించి డబ్బా పాలు తాగేవారిలో, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, కుటుంబ పరంగా అస్తమా, ఎలర్జీ ఉంటే న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ.
అవగాహన తప్పనిసరి
చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన తప్పనిసరి. పిల్లలను చలిలో తిప్పడం, వర్షంలో తడవనివ్వడం, ఐస్‌క్రీంలు తినిపించడం, శీతలపానీయాలు అతిగా తాపించడం మంచిది కాదు. జలుబు, జ్వరం ప్రారంభం కాగానే ఆవిరి పట్టడం, వెచ్చని దుస్తులు ధరింపజేయడం వంటివి చేస్తే సాధ్యమైనంత వరకు న్యుమోనియా అరికట్టవచ్చు. బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు శరీరంలోని ఇతర అవయవాలపైనా ప్రభావం చూపే అవకాశముంది. డాక్టర్ల సూచనల మేరకు యాంటీబయాటిక్ మందులను ఏడు రోజుల పాటు కోర్సుగా వాడాలి. ఒకట్రెండు రోజులు వాడి వదిలేస్తే ఇబ్బందులు తప్పవు.
-డాక్టర్ రామసుబ్బారావు, జిల్లా వైద్యాధికారి
జాగ్రత్తలు పాటించాలి
చిన్నపిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. 100.4 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం ఉండి.. కాళ్లూ చేతులు నీలం రంగులోకి మారటం, పక్కలు ఎత్తేయటం చేస్తే తప్పనిసరిగా న్యుమోనియా ఉన్నట్లు గుర్తించాలి. ఇలాంటి సమయంలో ఏమాత్రమూ ఆలస్యం చేయకూడదు. అందుబాటులో ఉన్న వైద్యుల్ని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే మూర్ఛ వచ్చే అవకాశముంది. ఈ వ్యాధికి కొందరు మంత్రాలు చేయించటం, ఛాతిపై వాతలు పెట్టడం చేస్తారు. ఇది చాలా తప్పు.
-డాక్టర్ ప్రవీణ్‌దీన్, చిన్న పిల్లల వైద్యనిపుణులు, ప్రభుత్వాస్పత్రి, అనంతపురం.
వణికిస్తున్న న్యుమోనియా
Published Mon, Sep 8 2014 1:59 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement