సోషల్ మీడియా వేదికగా అధికార పక్షాన్ని నిలదీస్తున్న నెటిజన్లు
- విచ్చలవిడి హామీలే తప్ప అమలు ఏది?
- ఇప్పుడు మళ్లీ నంద్యాల ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంపై మండిపాటు
- ప్రజలను ఆలోచింపజేస్తున్న పోస్టులు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటివరకు ఒక్క హామీ అమలు చేయకపోగా.. ఇప్పుడు నంద్యాలకు అది చేస్తాం ఇది చేస్తామంటూ అధికారపార్టీ చేస్తున్న వాగ్ధానాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఏం అభివృద్ధి చేశారని మీకు ఓటు వేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ మేరకు అధికార పార్టీ వైఫల్యాలు, హామీల మోసాలు, మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న పోస్టులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
ఓటుకు కోట్లు కేసు, పుష్కరాలు, పట్టిసీమ పేరుతో విచ్చలవిడి దోపిడీ, సదావర్తి భూముల వ్యవహారం, మహిళలపై దాడులు, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న తీరు, కాల్‌మనీ కేసులు, ఇసుక మాఫియాను దగ్గరుండి ప్రోత్సహిస్తుండడం దగ్గరనుంచి... అవినీతి డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఉదంతం, ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాల్సిందేనంటూ ఎన్నికల్లో చెప్పి.. ప్యాకేజీకి అమ్ముడుపోయిన తీరుపై అనేక ఆలోచింపజేసే పోస్టులు పెడుతూ ఎందుకు టీడీపీకి ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు.
నంద్యాల ఉప ఎన్నిక వచ్చిన క్రమం.. భూమా నాగిరెడ్డి మరణానికి దారితీసిన పరిస్థితులు, నంద్యాల్లో రోడ్ల వెడల్పుకు నిధులు కావాలంటూ రెండేళ్ల కిందట శిల్పా మోహన్‌రెడ్డి అభ్యర్థిస్తే.. ఎక్కడున్నాయి నిధులు, నువ్వు ఇస్తావా అంటూ చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడిన ఘటనలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో హడావుడిగా ఎలాంటి సమాచారం లేకుండా ఇళ్లను కూలదోయడం.. నామమాత్రపు నష్టపరిహారాన్ని ఇస్తామంటూ మభ్యపెట్టడంపై మండిపడుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆలోచింపజేస్తున్న పోస్టులు కొన్ని..
► ఓట్లు వేయలేదని మూడేళ్ల పాటు రాయలసీమకు కనీసం ఎంగిలి చేతులు కూడా విదిల్చకపోగా.. ఓటేస్తేనే మీకేదైనా చేస్తాను. నాకు ఓట్లేయకుంటే రోడ్లమీద తిరగొద్దు.. పింఛన్లు, రేషన్ తీసుకోవద్దు అని బెదిరిస్తున్న వారిని నమ్ముదామా?.. నాయకత్వం కంటే ప్రజలే ముఖ్యం అని నినదించే వాడి పక్షాన నిలబడదామా..?
► విపక్షం గెలిచినా నా ప్రమేయం లేకుండా అభివృద్ధి జరగనివ్వను అనే వాళ్లను విశ్వసిద్ధామా?.. అధికారం ఉన్నా లేకపోయినా శక్తివంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తామనే వాళ్లకు ఓటేద్దామా?
► కోట్లు వెదజల్లి విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, కనీసం రాజీనామా చేయమనే ధైర్యం లేని వాళ్లకు ఓటేద్దామా?.. విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ ఒక పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే తమ పార్టీలో చేర్చుకున్న వ్యక్తికి ఓటేద్దామా?
► ‘‘టీడీపీకి ఎందుకు ఓటేయ్యాలి?.. ఒక మంత్రి పదవి కూడా ఇవ్వనందుకు ముస్లిమ్స్ టీడీపీ కి ఓటు వేయాలా?
► బ్రాహ్మణులకు ఒక మంత్రి పదవీ ఇవ్వకుండా పైగా నిజాయితీపరుడైన మాజీ చీఫ్ సెక్రటరీ, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును అవమానించినందుకు ఓటు వేయాలా?
► దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. ఎస్టీలకు తెలివి ఉండదు.. అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే దళితులను అవమానిస్తే.. దళితులు శుభ్రంగా ఉండరు, చదువుకోరు, రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటూ ఓ మంత్రి దారుణంగా మాట్లాడినందుకు టీడీపీ కి ఓటు వేయాలా?
► అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తాను, ప్రతి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పి.. హామీలు నెరవేర్చమని ముద్రగడ ఉద్యమిస్తే దారుణంగా అవమానించినందుకు ఓటెయ్యాలా?
► కోడలు మగ పిల్లాడిని కంటానంటే ఏ అత్త వద్దంటుంది అని మహిళల పట్ల చిన్న చూపు చూసినందుకు ఓటు వేయాలా? రాయలసీమ రౌడీలు అని పదే పదే ఒక ప్రాంతాన్ని అవమానిస్తున్నందుకు సీమ ప్రజలు ఓటు వేయాలా?
► సీమకు నీళ్లివ్వకుండా ఎండబెడుతున్నందుకు ఓటు వేయాలా? సీమలో హైకోర్ట్ పెట్టనందుకు ఓటు వేయాలా?
► నిరుద్యోగులకు రుణమాఫీ చేయనందుకు ఓటు వేయాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకా? నిరుద్యోగులకు నెలకు 2 వేలు చొప్పున 38 నెలలకు గాను ఒక్కో నిరుద్యోగికి 76 వేలు ఇవ్వనందుకు ఓటు వేయాలా?’’ అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.