రాయవరం : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి పనులకు మంజూరయ్యే నిధుల వ్యయం తదితర బాధ్యతలను పాఠశాల యాజమాన్య కమిటీలు నిర్వహించాల్సి ఉంది. గత విద్యా సంవత్సరంలోనే ఈ కమిటీల పదవీకాలం ముగిసింది. పాఠశాల యాజమాన్య కమిటీలకు(ఎస్‌ఎంసీలు) ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
విద్యాహక్కు చట్టం ప్రకారం..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలకు యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలి. వాటి పర్యవేక్షణలో పాఠశాల అభివృద్ధి, పాఠశాలకు వచ్చే నిధులు సక్రమంగా ఖర్చు, అభివృద్ధి ప్రణాళికల తయారీ వంటి అంశాలపై ఎస్‌ఎంసీలు పర్యవే క్షిస్తాయి. ఈ కమిటీల పదవీ కాలం గతేడాది జూన్ 30తో ముగిసింది. అప్పటి నుంచి ఎస్‌ఎంసీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో తాత్కాలికంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈఓలకు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
కొత్త విద్యా సంవత్సరంలోనైనా..
2016-17 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 4,412 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ పాఠశాలల్లో పర్యవేక్షణ పెరుగుతుందన్న భావన అటు తల్లిదండ్రుల్లో, ఇటు విద్యాభిమానుల్లో వ్యక్తమవుతోంది.
కమిటీల బాధ్యతలివీ..
పాఠశాల పనితీరుపై కమిటీ సభ్యులు అజమాయిషీ చేయడం.
ఆయా పాఠశాల పరిధిలో ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడడం.
విద్యార్థులు క్రమం తప్పకుండా వచ్చేలా చూడడం.
చదువులో పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడం
పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన
విద్యాహక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం.
మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ.
పాఠశాలలకు మంజూరైన నిధులు అవసరాలకు తగ్గట్టు వినియోగించేలా చూడడం.
యూనిఫామ్స్ దుస్తులు కుట్టించడం, సక్రమంగా పంపిణీ జరిగేలా చూడడం.
అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం.
ఎస్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడో..?
Published Thu, Jun 30 2016 12:54 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement