SMC Elections
-
విద్యాకమిటీ ఎన్నికలకు కసరత్తు
టీడీపీ ప్రభుత్వ పాలనలో విద్యాకమిటీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. విద్యాకమిటీలను కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంది. రెండేళ్ల క్రితం కమిటీలను నియమించినా నిధులు మంజూరు చేయకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు విద్యాకమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించింది. ఈ నెల 23వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): జిల్లాలో 3,456 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి.వీటితో పాటు మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటికి మేనేజమెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ సంచాలకుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదల కానుంది. పాఠశాల విద్యాకమిటీ పదవీకాలం రెండేళ్లు. చంద్రబాబు ప్రభుత్వం 2016లో కమిటీలకు ఎన్నికలు నిర్వహించింది. రెండేళ్లకు ఈ కమిటీల పదవీకాలం ముగిసినా ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపలేదు. దీనికి కారణం రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం పాఠశాలలకు సక్రమంగా గ్రాంట్ విడుదల చేయకపోవడమే అని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నమైన రీతిలో ఆలోచన చేస్తోంది. రెండేళ్లలో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని కొత్త ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పాఠశాలలకు అవసరమైన గ్రాంట్ కూడా ముందే విడుదల చేసింది. విద్యాకమిటీ ఎన్నికలు ఇలా.. ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు సంబంధించి 15 మందిని ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని విద్యాకమిటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రతి విద్యాకమిటీలో కూడా 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు తప్పునిÜరిగా ఉండాలి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు ముగ్గురు చొప్పున 21 మందిని ఎన్నుకుంటారు. వీరిలో ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఉన్నత పాఠశాలలో తొమ్మిది మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరి నుంచి ఇద్దరు చొప్పున చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉంటారు. వీరితో పాటు ప్రతి పాఠశాల నుంచి ఆరుగురు ఎక్స్ అఫి షియో సభ్యులు ఉంటారు. కమిటీ విధులు ► మౌలిక వసతులు కల్పించడం ► విద్యార్థులు, ఉపాధ్యాయిల హాజరు పరిశీలన ► డ్రాప్ అవుట్స్ లేకుండా తగిన చర్యలు తీసుకోవడం ► పాఠశాలకు విడుదలైన నిధులు సక్రమంగా వినియోగించేలా చూడటం నేడు షెడ్యూల్ విడుదల విద్యా కమిటీ ఎన్నికలకు సోమవారం ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఈ నెల 16వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమై 23వ తేదీ లోపల ముగుస్తుంది. ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. – కె.మోహన్‌రావు, ఎంఈఓ, ఉదయగిరి -
ఇక స్కూల్ కమిటీలకు ఎన్నికలు...
సాక్షి, విజయనగరం : ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యాకమిటీల(ఎస్ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా తరువాత కమిటీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర డైరెక్టర్ చిన్న వీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన విధి విధానాలు రూపొం దించి రెండురోజుల వర్క్‌షాపు ఇటీవల నిర్వహించారు. ఎస్ఎంసీ ఎన్నికల అధి కారులుగా ఎంఈఓ, సీనియర్ ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఇంతవరకు ఉన్న ఎస్ఎంసీ సభ్యుల కాలపరిమితి గతేడాది ఆగస్టుతో ముగిసింది. అప్పటి ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విద్యాశాఖపై సారిస్తున్న ప్రత్యేక దృష్టి నేపథ్యంలో వాటి అభివృద్ధికి కీలకపాత్ర వహించాల్సిన ఎస్ఎంసీలను సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 2,717 ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాం గం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ ఇలా... విద్యాకమిటీ సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా ఉంటారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాధమిక పాఠశాలలో గరిష్టంగా 15 మంది సభ్యులుండాలి. ఈ ఎన్నికల విధానంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి లో ఎస్ఎంసీలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తు తం అమ్మ ఒడి పథకం అమలు జరుగుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులచే బ్యాంకు అకౌంట్లు ప్రారంభించేలా చూడాల్సి ఉంటుంది. కమిటీ సభ్యులకు శిక్షణ ఎన్నికైన కమిటీలకు మండల కేంద్రాలలో శిక్షణ నిర్వహించనున్నారు. తర్వాత ప్రతినెలా ఈ కమిటీ సమావేశమవ్వాలి. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులతోపాటు ఇతర సదుపాయాలు కల్పించడానికి వీలుగా తీర్మానాలు చేసి అమలు చేయాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పాఠశాల నిర్వహణ, ఇతర గ్రాంట్లను ఖర్చు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయునితో జాతీయ బ్యాంకులో ఉమ్మడి ఖాతాను ప్రారంభించాలి. బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పిల్లల హాజరు, విద్యా ప్రమాణాలు పెంపుదల వంటి పలు అంశాలను ఈ కమిటీలు చూడాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉన్న కమిటీలు నామమాత్రంగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని పాఠశాలల్లో అయితే మొక్కుబడిగా హాజరై సంతకాలు లేదా వేలిముద్రలు వేసి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పింది విని వెళ్లేవారు. అంతకుమించి పాఠశాలల అభివృద్ధిలో ఎస్ఎంసీలు క్రయాశీలకంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎస్ఎంసీలను మరింత బాధ్యతాయుతంగా రూపొందించాలని ప్రభుత్వ ఆలోచన. ఎన్నికైన వెంటనే వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికైన సభ్యులకు శిక్షణ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల ఎన్నిక నిర్వహణకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి.తాజాగా జి ల్లాలోని పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలను క్రోడీకరిస్తున్నాం. ఎన్ని కల నిర్వాహణకు అవసరమైన చర్యలపై సమీక్షిస్తున్నాం. ఎస్‌ఎంసీల ఎన్నికలను అక్టోబర్‌లో ముగించి ఎన్నికైన కమిటీ సభ్యులకు మండల కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తాం. – ఎం.కృష్ణమూర్తి నాయుడు, ఎస్ఎస్ఏ పీఓ -
26న ఎస్ఎంసీ ఎన్నికలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కోరం లేక వాయిదాపడిన 76 స్కూళ్లలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి దశరథరామయ్య ఓ ప్రకటనలో తెలి పారు. జిల్లాలో మొత్తం 3866 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, గతం లో 3855 పాఠశాలలకు ఎన్నికలు జరిగాయి. విద్యార్థుల సంఖ్య ‘0’ ఉన్న కారణంగా తొమ్మిది స్కూళ్లలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 76 స్కూళ్లలో కోరం లేక వాయిదా పడ్డాయి. ఈ నెల 24న ఓటర్ల తుది జాబితా వెల్లడించాలని, 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఎన్నిక నిర్వహణ, 1 గంట నుంచి 2.30 గంటల దాకా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, 2.30 నుంచి 3 గంటల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాలని పీఓ స్పష్టం చేశారు. -
కలకోవలో ఎస్ఎంసీ ఎన్నిక వాయిదా
కలకోవ (మునగాల) : మండలంలోని కలకోవ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. శుక్రవారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఉద్రిక్త వాతావరణలో ఎస్ఎంసీ ఎన్నికలు జరగడంతో ముందస్తుగా మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ ఎన్నికలకు సీపీఎం వర్గీయులు గైర్హాజరు కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమికి చెందిన ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. పాఠశాలలోని ఒకటవ తరగతిలో 24మందికి 16మంది హాజరు కాగా, రెండో తరగతిలో ఏడుగురికి ఆరుగురు, నాలుగో తరగతిలో 17మందికి 9మంది హాజరు కాగా హెచ్ఎం జూలకంటి వెంకటరెడ్డి ఎన్నికలు నిర్వహించారు. తొమ్మిది మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదిలా ఉండగా మూడో తరగతిలో 10మందికి గాను నలుగురు, ఐదో తరగతిలో 16మందికి ఏడుగురు మాత్రమే హాజరు కావడంతో కోరం లేక రెండు తరగతులకు సంబంధించిన ఎన్నిక జరుగలేదు. దీంతో ఎస్ఎంసీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సాయింత్రం వరకు డైరెక్టర్ల ఎన్నికకు సమయం ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి వర్గీయులు ఎన్నికల పరిశీలకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది మండల విద్యాధికారి అనుమతితో తేదీని ప్రకటిస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. శనివారం ఎన్నికైన తొమ్మిది మంది డైరెక్టర్లలో కల్పన, కవిత, ఎం.లక్ష్మి, సీహెచ్.కవిత, ఉపేంద్ర, సోమయ్య, రమణ, శోభారాణి, బెల్లంకొండ కోటయ్య ఉన్నారు. -
రసాభాసగా ఎస్సెమ్సీ ఎన్నిక
వాయిదా వేసిన ఎంఈఓ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చౌకచెర్ల (విడవలూరు) : మండలంలోని చౌకచెర్ల ప్రాథమికోన్నత పాఠశాల ఎస్ఎంసీ ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపించింది. పాఠశాలకు ఈ నెల 1వ తేదీన ఎస్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 1 నుంచి 5వ తరగతి వరకు సభ్యులను ఎన్నుకున్నారు. 6 నుంచి 8వ తరగతి వరకు సభ్యుల ఎన్నికలో స్థానిక అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ ఎన్నికను వాయిదా వేశారు. శనివారం 6 నుంచి 8వ తరగతి వరకు సభ్యుల ఎన్నిక ప్రక్రియను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 6వ తరగతి విద్యార్థులకు సంబంధించి 22 మంది తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉంది. కాని 18 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో కూడా ఎక్కువ మంది వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్న విషయాన్ని గమనించిన టీడీపీ నాయకులు వారిని ప్రలోభాలకు గురి చేయడంతో పాటు బెదిరించారు. దీంతో 9 మంది సభ్యులు వెళ్లిపోయారు. వాస్తవంగా ఎన్నిక జరగాలంటే 10 మంది సభ్యులు ఉండాలి. కాని ఉన్న 9 మంది సభ్యులతోనే ఎన్నికల అధికారులు ఎన్నికను నిర్వహించారు. అయితే ఎన్నికకు కేవలం 9 మంది సభ్యులు ఉంటే చాలని ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఫోన్లో అధికారులను బెదిరించడంతో ఇష్టానుసారంగా వ్యవహరించి, ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు. తమ పిల్లలకు బదిలీ సర్టిఫికెట్లను ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. ఈ సమయంలో గంట సేపు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చేసేది లేక ఎన్నికల అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు 7, 8వ తరగతులకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఎన్నిక జరిపించిన హెచ్ఎం 7,8 తరగతులకు ఎన్నికలను ఎంఈఓ వాయిదా వేస్తే పాఠశాల హెచ్ఎం సోమలింగేశ్వరావు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి తిరిగి 7, 8వ తరగతులకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నిక నిర్వహించి సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నేతలు, అధికారులు నిలదీశారు. వివాదం నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని గుంపులుగా ఉన్న ఇరువర్గాల వారిని చెదరగోట్టారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన నాయకులతో, ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్‌గా ఈదూరు సురేష్, వైస్ చైర్మన్ జయంతిని ఎన్నుకున్నారు. -
అంతా... సాధా‘రణం’
► ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ మితిమీరిన జోక్యం ► సాధారణ ఎన్నికలను తలపించిన వైనం ► అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఉపాధ్యాయులు ► నిబంధనలకు పాతర ► పలు పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా ఆత్మకూరు : స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో నిబంధనలకు పాతర వేశారు. టీడీపీ నేతల మితిమీరిన జోక్యంతో ఎన్నికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తమ పార్టీ మద్దతుదారులకే పదవులు కట్టబెట్టాలంటూ పెంచిన ఒత్తిళ్లకు ఉపాధ్యాయులు తలొగ్గారు. సాధారణ ఎన్నికలను తలపిస్తూ పలు ప్రాంతాల్లో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలంలోని 36 పాఠశాలలకు గాను 33లో సోమవారం ఎన్నికలు జరిగాయి. బి.యాలేరు, వేపచెర్ల ఎగువతండా, సనప ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నికలు ఉద్రిక్తత నడుమ వాయిదా పడ్డాయి. ఆత్మకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అయితే నిబంధనలకు పాతర వేస్తూ టీడీపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకున్నారు. ఈ విషయంపై ఎన్నికలను పరిశీలించేందుకు వచ్చిన డీఈఓ అంజయ్య సైతం ఏకపక్షంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. బి.యాలేరులో ఉద్రిక్తత బి.యాలేరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. టీడీపీకి చెందిన ఇద్దరు పోటీ చేయగా, విద్యార్థుల తల్లిదండ్రులు మూకుమ్మడిగా ఒక్కరికే మద్దతు పలికారు. దీంతో పాఠశాల హెచ్ఎం రామకృష్ణ ఎన్నికలు నిర్వహించకుండా తలుపులు బిడాయించి, గంట సేపు ఫోన్లో ఇతరులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మూడు రోజుల ముందే ఎన్నికలు ముగిశాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులను అక్కడినుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ గ్రామ సర్పంచ్ తండ్రి ఈశ్వరరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కోరమ్ లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదంటూ రామకృష్ణ ఎదురు సమాధానం చెప్పడంతో పరిస్థితి మరింత దిగజారింది. గ్రామస్తులు మూకుమ్మడిగా హెచ్ఎం వైఖరిపై మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఐ శివనారాయణస్వామి జోక్యం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను అక్కడి నుంచి బయటకు పంపించారు. -
నామమాత్రంగా ఎస్ఎంసీ ఎన్నికలు
3,350 పాఠశాలల్లో నిర్వహణ 88 పాఠశాలల్లో వాయిదా నెల్లూరు(టౌన్) : జిల్లాలో సోమవారం పాఠశాలల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నామమాత్రంగా జరిగాయి. మెజార్టీ ప్రాంతాల్లో ఆయా పార్టీల నేతలు సూచించిన వ్యక్తులనే సభ్యులుగా ఎంపికచేశారు. ఎక్కువ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువుగా ఉండటంతో కొద్దిసేపటికే ఎన్నికల ప్రక్రియను ముగించేశారు. జిల్లా వ్యాప్తంగా 97.86 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 3,447 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 3,350 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. 88 పాఠశాలల్లో వివిధ కారణాల రీత్యా ఎన్నికలు వాయిదాపడ్డాయి. మరో 9 పాఠశాలల్లో ఒక విద్యార్థి కూడా లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో గ్రూపులుగా ఏర్పడి గోడవలకు దిగడంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఒకే కుటుంబానికి చెందిన వారు.. సూళ్లూరుపేట కేసీఎన్‌గుంట ప్రాథమిక పాఠశాలలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ పడటంతో అక్కడ ఎన్నికలను నిలిపివేశారు. ముత్తూకూరు మండలంలోని దమ్మాయపాలెం హైస్కూల్లో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు గొడవలకు దిగడంతో కోరం లేదనే సాకుతో ఎన్నికలను వాయిదా వేశారు. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో వివాదాల మధ్య ఎన్నికలు జరిగాయి. పట్టణ , పల్లె ప్రాంతాల్లో ఆయా పార్టీల నేతల పిల్లలు ఎక్కువుగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి నిలబడే, ఓటు వేసే హక్కు ఉండదు. కేవలం పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. దీంతో నేతలు సూచించిన వ్యక్తులను తీసుకువచ్చి కమిటీ సభ్యులుగా నియమించారు. ఎన్నికలు నామమాత్రంగా జరిగాయని పాఠశాలల ప్రధానోపాధ్యాయులే చెబుతున్నారు. కాగా ఎన్నికలు వాయిదాపడ్డ పాఠశాలల్లో కారణాలు తెలసుకుని త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. -
బడిలో ఎన్నికల వేడి
రాజకీయ జోక్యంతో ఆధిపత్య పోరు నేడు పాఠశాల యాజమాన్య కమిటీలకు ఎన్నికలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేసే యాజమాన్య కమిటీల ఎన్నికను నేడు నిర్వహించనున్నారు. అయితే పాఠశాలలకు విడుదలయ్యే నిధులపై కన్నేసిన ఛోటామోటా నేతలు ఈ కమిటీల పేరుతో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గస్థాయి నేతలు సైతం రంగంలోకి దిగారు. బాలాజీచెరువు (కాకినాడ) : ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల వేడి రగులుకొంది. రెండేళ్లపాటు కొలువుదీరనున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల ఎన్నికలను నేడు నిర్వహించనున్నారు. ఈ కమిటీ ఎన్నికల్లో ఓటర్లయిన విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు కూడగట్టుకోవడానికి కొందరు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ ఎన్నికలను టీడీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొన్ని చోట్లశాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎన్నిక విధానం... ప్రాథమిక పాఠశాలలో ఒక్కక్క తరగతి నుంచి ముగ్గురు చొప్పున 15 మంది తల్లిదండ్రులను ఎన్నుకోవాలి. తొలి విభాగంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ లేదా వార్డు సభ్యుడు లేదా కౌన్సిలర్ ,అంగన్వాడీ కార్యకర్త ఉంటారు. రెండవ విభాగంలో వీరు ఎంపిక చేసిన ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ప్రాథమికోన్నత పాఠశాలలో (1నుంచి 7వ తరగతి వరకు ఉంటే) వారిలో పాఠశాలకు ముగ్గురు చొప్పున 21 మందిని విద్యార్థు్ధల తల్లిదండ్రుల నుంచి ఎన్నుకోవాలి. ఓటర్లు తమ అభిప్రాయాలను చేతులెత్తి తెలిపే పద్ధతిలో నిర్వహిస్తారు. అలా కాని పక్షంతో రెండు వర్గాలు ఉంటే రహస్యబ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా విడుదల చేశారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. విజేతలతో ప్రతిజ్ఞ చేయించి అదే రోజు సాయంత్రం మొదటి సమావేశం నిర్వహిస్తారు. రాజకీయ జోక్యం పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆయాగ్రామాల్లో నేతల పేర్లు ప్రధానోపాధ్యాయులకు పంపి వీరినే నియమించాలని అదేశించినట్టు సమాచారం. విధివిధానాలుపాటిస్తే అభివృద్ధి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను కొత్తగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తే అభివృద్ధిబాటలో పయనిస్తాయి. అలాకాకుండా పంతాలకు పోయి రాజకీయాలు చేస్తే పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎస్ఎంసీలు స్నేహభావంతో ముందుకెళ్లాలి. – యింటి వెంకట్రావు, ఎన్నికల అధికారి, సీఎంఓ, సర్వశిక్షా అభియాన్ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించాలి ఎస్ఎంసీ వ్యవస్థ విఫలం కావడం వల్లే గత ప్రభుత్వాలు దీన్ని రద్దు చేశాయి. ఈ ప్రభుత్వం వీటిని పునరుద్ధరించడంతో విద్యావ్యవస్థలో రాజకీయాలను చొప్పించడమే అవుతుంది. పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం తప్ప రాజకీయ అవసరం కాదు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి అధికారులకు సహకరించాలి. – పీవీవీ సత్యనారాయణరాజు, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు -
ఎస్‌ఎంసీల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
26న స్కూళ్ల వారీగా నోటిఫికేషన్ ఆగస్టు 1న ఎన్నికలు..అదేరోజు ప్రమాణ స్వీకారం అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్కూల్ మెనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి షెడ్యూలు విడుదల చేసింది. మార్చిలో ఒకసారి షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలకు రెండు రోజులు ముందు వాయిదా వేసింది. తాజాగా ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ప్రకటించి ఒకరోజు ముందు వాయిదా వేశారు. మరోసారి ఆగస్టు 1న ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం షెడ్యూలు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 3,882 పాఠశాలల్లో ఎస్ఎంసీలను నియమించనున్నారు. ఎన్నికల షెడ్యూలు ఇలా.. ఈనెల 26నlఉదయం 10 గంటలకు ఆయా స్కూళ్ల వారీగా హెచ్ఎంలు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితా తయారు చేసి నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఓటరు జాబితాలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరూ ఉంటారు. అయితే ఓటింగ్‌కు మాత్రం ఇద్దరిలో ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. • 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటర్ల జాబితాల్లో ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అదేరోజు సాయంత్రం 4 గంటలకు తుది జాబితా విడుదల చేస్తారు. • ఆగస్టు 1న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఎన్నికలు నిర్వహిస్తారు. 1.30 గంటలకు ఎన్నికైన సభ్యులు మినహా తక్కిన వారందరినీ బయటకు పంపుతారు. 2 నుంచి 3 గంటల వరకు ఎన్నికైన సభ్యులతో చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 3.30 గంటలకు మొదటి ఎస్ఎంసీ సమావేశం నిర్వహిస్తారు. -
ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్కూల్ మెనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. మార్చిలో ఒకసారి షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలకు రెండు రోజులు ముందు వాయిదా వేసింది. తాజాగా ఈనెల 26న నిర్వహించాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు వాయిదా వేశారు. బుధవారం పాఠశాలల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి ఆఘమేఘాల మీద వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎంసీల ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని, తర్వాత తేదీ ఎప్పుడనేది ముందుగా తెలియజేస్తామని ఇంతకు మించి వివరాలు తెలియదని డీఈఓ అంజయ్య తెలిపారు. -
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి
కోవూరు : త్వరలో జరగబోయే పాఠశాల అభివద్ధి కమిటీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎంఈఓ జగన్నాథశర్మ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మండల పరిధిలోని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎస్ఎంసీ ఎన్నికలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఈనెల 20 నుంచి 26వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఒక్కొక్క తరగతికి ముగ్గురు సభ్యుల చొప్పున ఎంపిక చేసి ఎంపికైన సభ్యులందరి చేత చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకోవాలన్నారు. ఓటర్ల జాబితాను ముందుగానే పాఠశాల వద్ద ప్రచురింపజేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలు జరిగే రోజు పాఠశాలల్లోనే నామినేçషన్ దాఖలు చేసుకోవచ్చనన్నారు. ఎన్నికలు 7 నుంచి 1 గంట లోపు నిర్వహించాలని, మూడు గంటలకు చైర్మన్ ఎన్నిక జరపాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా హెచ్ఎంలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. -
ఎస్ఎంసీ ఎన్నికలు ఎప్పుడో..?
రాయవరం : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి పనులకు మంజూరయ్యే నిధుల వ్యయం తదితర బాధ్యతలను పాఠశాల యాజమాన్య కమిటీలు నిర్వహించాల్సి ఉంది. గత విద్యా సంవత్సరంలోనే ఈ కమిటీల పదవీకాలం ముగిసింది. పాఠశాల యాజమాన్య కమిటీలకు(ఎస్ఎంసీలు) ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలకు యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలి. వాటి పర్యవేక్షణలో పాఠశాల అభివృద్ధి, పాఠశాలకు వచ్చే నిధులు సక్రమంగా ఖర్చు, అభివృద్ధి ప్రణాళికల తయారీ వంటి అంశాలపై ఎస్ఎంసీలు పర్యవే క్షిస్తాయి. ఈ కమిటీల పదవీ కాలం గతేడాది జూన్ 30తో ముగిసింది. అప్పటి నుంచి ఎస్ఎంసీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో తాత్కాలికంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలకు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కొత్త విద్యా సంవత్సరంలోనైనా.. 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 4,412 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ పాఠశాలల్లో పర్యవేక్షణ పెరుగుతుందన్న భావన అటు తల్లిదండ్రుల్లో, ఇటు విద్యాభిమానుల్లో వ్యక్తమవుతోంది. కమిటీల బాధ్యతలివీ.. పాఠశాల పనితీరుపై కమిటీ సభ్యులు అజమాయిషీ చేయడం. ఆయా పాఠశాల పరిధిలో ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడడం. విద్యార్థులు క్రమం తప్పకుండా వచ్చేలా చూడడం. చదువులో పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడం పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విద్యాహక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ. పాఠశాలలకు మంజూరైన నిధులు అవసరాలకు తగ్గట్టు వినియోగించేలా చూడడం. యూనిఫామ్స్ దుస్తులు కుట్టించడం, సక్రమంగా పంపిణీ జరిగేలా చూడడం. అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం.