రసాభాసగా ఎస్సెమ్సీ ఎన్నిక
-
వాయిదా వేసిన ఎంఈఓ
-
భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు
చౌకచెర్ల (విడవలూరు) : మండలంలోని చౌకచెర్ల ప్రాథమికోన్నత పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపించింది. పాఠశాలకు ఈ నెల 1వ తేదీన ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 1 నుంచి 5వ తరగతి వరకు సభ్యులను ఎన్నుకున్నారు. 6 నుంచి 8వ తరగతి వరకు సభ్యుల ఎన్నికలో స్థానిక అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ ఎన్నికను వాయిదా వేశారు. శనివారం 6 నుంచి 8వ తరగతి వరకు సభ్యుల ఎన్నిక ప్రక్రియను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 6వ తరగతి విద్యార్థులకు సంబంధించి 22 మంది తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉంది. కాని 18 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో కూడా ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్న విషయాన్ని గమనించిన టీడీపీ నాయకులు వారిని ప్రలోభాలకు గురి చేయడంతో పాటు బెదిరించారు. దీంతో 9 మంది సభ్యులు వెళ్లిపోయారు. వాస్తవంగా ఎన్నిక జరగాలంటే 10 మంది సభ్యులు ఉండాలి. కాని ఉన్న 9 మంది సభ్యులతోనే ఎన్నికల అధికారులు ఎన్నికను నిర్వహించారు. అయితే ఎన్నికకు కేవలం 9 మంది సభ్యులు ఉంటే చాలని ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఫోన్‌లో అధికారులను బెదిరించడంతో ఇష్టానుసారంగా వ్యవహరించి, ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు. తమ పిల్లలకు బదిలీ సర్టిఫికెట్లను ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. ఈ సమయంలో గంట సేపు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చేసేది లేక ఎన్నికల అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు 7, 8వ తరగతులకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.
ఎన్నిక జరిపించిన హెచ్‌ఎం
7,8 తరగతులకు ఎన్నికలను ఎంఈఓ వాయిదా వేస్తే పాఠశాల హెచ్‌ఎం సోమలింగేశ్వరావు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి తిరిగి 7, 8వ తరగతులకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నిక నిర్వహించి సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీ నేతలు, అధికారులు నిలదీశారు. వివాదం నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని గుంపులుగా ఉన్న ఇరువర్గాల వారిని చెదరగోట్టారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన నాయకులతో, ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్‌గా ఈదూరు సురేష్, వైస్ చైర్మన్ జయంతిని ఎన్నుకున్నారు.