నామమాత్రంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
-
3,350 పాఠశాలల్లో నిర్వహణ
-
88 పాఠశాలల్లో వాయిదా
నెల్లూరు(టౌన్) : జిల్లాలో సోమవారం పాఠశాలల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నామమాత్రంగా జరిగాయి. మెజార్టీ ప్రాంతాల్లో ఆయా పార్టీల నేతలు సూచించిన వ్యక్తులనే సభ్యులుగా ఎంపికచేశారు. ఎక్కువ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువుగా ఉండటంతో కొద్దిసేపటికే ఎన్నికల ప్రక్రియను ముగించేశారు. జిల్లా వ్యాప్తంగా 97.86 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 3,447 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 3,350 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. 88 పాఠశాలల్లో వివిధ కారణాల రీత్యా ఎన్నికలు వాయిదాపడ్డాయి. మరో 9 పాఠశాలల్లో ఒక విద్యార్థి కూడా లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో గ్రూపులుగా ఏర్పడి గోడవలకు దిగడంతో ఎన్నికలు వాయిదా వేశారు.
ఒకే కుటుంబానికి చెందిన వారు..
సూళ్లూరుపేట కేసీఎన్‌గుంట ప్రాథమిక పాఠశాలలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ పడటంతో అక్కడ ఎన్నికలను నిలిపివేశారు. ముత్తూకూరు మండలంలోని దమ్మాయపాలెం హైస్కూల్‌లో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు గొడవలకు దిగడంతో కోరం లేదనే సాకుతో ఎన్నికలను వాయిదా వేశారు. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో వివాదాల మధ్య ఎన్నికలు జరిగాయి. పట్టణ , పల్లె ప్రాంతాల్లో ఆయా పార్టీల నేతల పిల్లలు ఎక్కువుగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి నిలబడే, ఓటు వేసే హక్కు ఉండదు. కేవలం పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. దీంతో నేతలు సూచించిన వ్యక్తులను తీసుకువచ్చి కమిటీ సభ్యులుగా నియమించారు. ఎన్నికలు నామమాత్రంగా జరిగాయని పాఠశాలల ప్రధానోపాధ్యాయులే చెబుతున్నారు. కాగా ఎన్నికలు వాయిదాపడ్డ పాఠశాలల్లో కారణాలు తెలసుకుని త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇన్‌చార్జి డీఈఓ విజయలక్ష్మి తెలిపారు.