బడిలో ఎన్నికల వేడి
-
రాజకీయ జోక్యంతో ఆధిపత్య పోరు
-
నేడు పాఠశాల యాజమాన్య కమిటీలకు ఎన్నికలు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేసే యాజమాన్య కమిటీల ఎన్నికను నేడు నిర్వహించనున్నారు. అయితే పాఠశాలలకు విడుదలయ్యే నిధులపై కన్నేసిన ఛోటామోటా నేతలు ఈ కమిటీల పేరుతో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గస్థాయి నేతలు సైతం రంగంలోకి దిగారు.
బాలాజీచెరువు (కాకినాడ) :
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల వేడి రగులుకొంది. రెండేళ్లపాటు కొలువుదీరనున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఎన్నికలను నేడు నిర్వహించనున్నారు. ఈ కమిటీ ఎన్నికల్లో ఓటర్లయిన విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు కూడగట్టుకోవడానికి కొందరు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ ఎన్నికలను టీడీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొన్ని చోట్లశాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
ఎన్నిక విధానం...
ప్రాథమిక పాఠశాలలో ఒక్కక్క తరగతి నుంచి ముగ్గురు చొప్పున 15 మంది తల్లిదండ్రులను ఎన్నుకోవాలి. తొలి విభాగంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ లేదా వార్డు సభ్యుడు లేదా కౌన్సిలర్ ,అంగన్‌వాడీ కార్యకర్త ఉంటారు. రెండవ విభాగంలో వీరు ఎంపిక చేసిన ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ప్రాథమికోన్నత పాఠశాలలో (1నుంచి 7వ తరగతి వరకు ఉంటే) వారిలో పాఠశాలకు ముగ్గురు చొప్పున 21 మందిని విద్యార్థు్ధల తల్లిదండ్రుల నుంచి ఎన్నుకోవాలి. ఓటర్లు తమ అభిప్రాయాలను చేతులెత్తి తెలిపే పద్ధతిలో నిర్వహిస్తారు. అలా కాని పక్షంతో రెండు వర్గాలు ఉంటే రహస్యబ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు.
ఎన్నికల కార్యక్రమం
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా విడుదల చేశారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. విజేతలతో ప్రతిజ్ఞ చేయించి అదే రోజు సాయంత్రం మొదటి సమావేశం నిర్వహిస్తారు.
రాజకీయ జోక్యం
పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆయాగ్రామాల్లో నేతల పేర్లు ప్రధానోపాధ్యాయులకు పంపి వీరినే నియమించాలని అదేశించినట్టు సమాచారం.
విధివిధానాలుపాటిస్తే అభివృద్ధి
పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను కొత్తగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తే అభివృద్ధిబాటలో పయనిస్తాయి. అలాకాకుండా పంతాలకు పోయి రాజకీయాలు చేస్తే పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎస్‌ఎంసీలు స్నేహభావంతో ముందుకెళ్లాలి.
– యింటి వెంకట్రావు, ఎన్నికల అధికారి, సీఎంఓ, సర్వశిక్షా అభియాన్
ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించాలి
ఎస్‌ఎంసీ వ్యవస్థ విఫలం కావడం వల్లే గత ప్రభుత్వాలు దీన్ని రద్దు చేశాయి. ఈ ప్రభుత్వం వీటిని పునరుద్ధరించడంతో విద్యావ్యవస్థలో రాజకీయాలను చొప్పించడమే అవుతుంది. పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం తప్ప రాజకీయ అవసరం కాదు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి అధికారులకు సహకరించాలి.
– పీవీవీ సత్యనారాయణరాజు, ఎస్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు