బి.యాలేరు పాఠశాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను బయటకు పంపుతున్న సీఐ
అంతా... సాధా‘రణం’
Published Mon, Aug 1 2016 11:28 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
► ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ మితిమీరిన జోక్యం
► సాధారణ ఎన్నికలను తలపించిన వైనం
► అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఉపాధ్యాయులు
► నిబంధనలకు పాతర
► పలు పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా
ఆత్మకూరు :
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల్లో నిబంధనలకు పాతర వేశారు. టీడీపీ నేతల మితిమీరిన జోక్యంతో ఎన్నికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తమ పార్టీ మద్దతుదారులకే పదవులు కట్టబెట్టాలంటూ పెంచిన ఒత్తిళ్లకు ఉపాధ్యాయులు తలొగ్గారు. సాధారణ ఎన్నికలను తలపిస్తూ పలు ప్రాంతాల్లో ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆత్మకూరు మండలంలోని 36 పాఠశాలలకు గాను 33లో సోమవారం ఎన్నికలు జరిగాయి. బి.యాలేరు, వేపచెర్ల ఎగువతండా, సనప ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నికలు ఉద్రిక్తత నడుమ వాయిదా పడ్డాయి. ఆత్మకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అయితే నిబంధనలకు పాతర వేస్తూ టీడీపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకున్నారు. ఈ విషయంపై ఎన్నికలను పరిశీలించేందుకు వచ్చిన డీఈఓ అంజయ్య సైతం ఏకపక్షంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.
బి.యాలేరులో ఉద్రిక్తత
బి.యాలేరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. టీడీపీకి చెందిన ఇద్దరు పోటీ చేయగా, విద్యార్థుల తల్లిదండ్రులు మూకుమ్మడిగా ఒక్కరికే మద్దతు పలికారు. దీంతో పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ ఎన్నికలు నిర్వహించకుండా తలుపులు బిడాయించి, గంట సేపు ఫోన్‌లో ఇతరులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మూడు రోజుల ముందే ఎన్నికలు ముగిశాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులను అక్కడినుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ గ్రామ సర్పంచ్ తండ్రి ఈశ్వరరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కోరమ్ లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదంటూ రామకృష్ణ ఎదురు సమాధానం చెప్పడంతో పరిస్థితి మరింత దిగజారింది. గ్రామస్తులు మూకుమ్మడిగా హెచ్‌ఎం వైఖరిపై మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఐ శివనారాయణస్వామి జోక్యం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను అక్కడి నుంచి బయటకు పంపించారు.
Advertisement
Advertisement