
జీజీహెచ్‌కు చేరే దారేది?
సాక్షి, గుంటూరు
స్టాఫ్ నర్సుల బదిలీల్లో భాగంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ పోస్టింగ్‌కు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. దీనిని దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. అవసరమైనవారికి బదిలీ చేయిస్తామని, అవసరం లేనివారికి బదిలీ నిలుపుదల చేయిస్తామని చెబు తూ డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ నాయకులచే ఒత్తిడి
స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. గుంటూరు రీజనల్ పరిధిలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్టాఫ్ నర్సుల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆర్డీ కార్యాలయ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో అతి పెద్ద ఆస్పత్రిగా పేరొందిన జీజీహెచ్‌కి బదిలీ చేయించుకునేందుకు స్టాఫ్ నర్సులు ఇప్పటికే పైరవీలు సాగిస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫోన్‌లు చేయిస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఈ సారైనా ఇక్కడకు రావాలని పైరవీలు
నిబంధనల ప్రకారం ప్రతి ఆస్పత్రిలో ఉన్న స్టాఫ్ నర్సుల్లో 20 శాతం మందిని బదిలీ చేసే అవకాశం ఉంది. ఒంగోలు ‘రిమ్స్’లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్లో అధిక శాతం మంది గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడంతో ఈసారి ఎలాగైనా జీజీహెచ్‌కి బదిలీ అయ్యేలా చూసుకోవాలని తీవ్ర స్థాయిలో పైరవీలు సాగిస్తున్నారు. వీరిలో 40 నుంచి 50 మంది గుంటూరు నుంచి రోజూ ఒంగోలు వెళ్లి వస్తున్నవారే.
బదిలీ నిలుపుదలకు ప్రయత్నాలు
జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం కావడంతో స్పెషలైజేషన్ సర్టిఫికెట్లు పొంది ఎలాగైనా ఇక్కడ చేరాలని అనేక మంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్పెషలైజేషన్ అర్హత కలిగి ఉన్న స్టాఫ్ నర్సులు ఆస్పత్రికి అవసరమని అక్కడి అధికారులు భావిస్తే అలాంటి వారి బదిలీలు నిలిపివేయవచ్చంటూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో జీజీహెచ్‌లో సంవత్సరాల తరబడి తిష్టవేసి ఉన్న వారు సైతం దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని బదిలీలు ఆపుకొనేందుకు పైరవీలు మొదలెట్టారు.
డబ్బు వసూలు చేస్తున్న దళారులు
జీజీహెచ్‌కి ఉన్న డిమాండ్‌ను గమనించిన కొందరు దళారులు ఆర్డీ కార్యాలయం, జీజీహెచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి బదిలీలు చేయిస్తామంటూ స్టాఫ్ నర్సుల వద్ద రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్పెషలైజేషన్ సర్టిఫికెట్ ద్వారా జీజీహెచ్‌లో పనిచేస్తున్న వారిని ఇక్కడే ఉంచేలా చూస్తామని కూడా హామీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా పైరవీలు సాగిస్తున్నారు. స్పెషలైజేషన్ సర్టిఫికెట్‌కు కూడా కొందరు డబ్బు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జీజీహెచ్‌కి బదిలీ చేయించుకునేందుకు కొందరు, ఆపుకొనేందుకు మరి కొందరు స్టాఫ్ నర్సులు ఎంతైనా ఖర్చు పెడతామంటూ ముందుకు రావడంతో దళారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
నిబంధనల అమలేది?
నిబంధనల ప్రకారం బదిలీల కౌన్సెలింగ్‌కు వారం ముందు ఆర్డీ కార్యాలయ ఆవరణలో జాబితాను నోటీసు బోర్డులో ఉంచాలి. జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమైతే వాటిని పరిష్కరించాకే కౌన్సెలింగ్ నిర్వహించాలి. రీజనల్ పరిధిలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే జాబితాను కూడా నోటీస్ బోర్డులో పెట్టాల్సి ఉంది. అయితే గతంలో జరిగిన కౌన్సెలింగ్‌లలో వీటిని పాటించిన దాఖలాల్లేవు. జీజీహెచ్‌లో స్టాఫ్ నర్సులుగా చేరి హెడ్ నర్సు, ఆపై పదోన్నతులు పొంది కూడా అనేక మంది ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేసుకుకూర్చున్నారు. ప్రతిసారీ కౌన్సెలింగ్‌లలో వీరికి మినహాయింపు ఇస్తున్నారు. ఈసారి జరిగే బదిలీల్లోనైనా ఇలాంటి వారిని బదిలీచేసి అర్హులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
బదిలీల కౌన్సెలింగ్‌ను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. దళారులను నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దు. గతేడాదీ నిబంధనల ప్రకారమే బదిలీలు చేశాం.
- డాక్టర్ షాలినీదేవి, ప్రాంతీయ వైద్య,
ఆరోగ్యశాఖ సంచాలకులు
Notes, staff nurse, public comprehensive hospital