విప్ జారీ అధికారం కృష్ణదాస్‌కు
నరసన్నపేట: వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న స్థానిక సంస్థల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సభ్యులకు విప్ జారీ చేసే అధికారాన్ని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు ఆ పార్టీ అప్పగించింది. జూలై 3న మున్సిపల్, 4న ఎంపీపీ, 5న జె డ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తూ కృష్ణదాస్ విప్ జారీ చేస్తారు. దానికి అనుగుణంగా సభ్యులు వ్యవహరించాల్సి ఉంటుంది. విప్‌ను ధిక్కరించేవారు తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది. దీనిపై ఆదివారం కృష్ణదాస్ మాట్లాడుతూ తనకు ఈ అధికారం ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు విప్‌కు బద్దులయ్యేలా కృషి చేస్తానన్నారు.
నేడు నరసన్నపేటలో జిల్లా సమావేశం
కాగా నరసన్నపేటలో సోమవారం సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయంలో జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కృష్ణదాస్ చెప్పారు. పార్టీ సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మండలాల కన్వీనర్లు, అన్ని విభాగాల కన్వీనర్లు, జడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.