సాక్షి, అనంతపురం : ఇసుకను అక్రమంగా తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఘటనలో నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు గురువారం ఒకటో పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ వెల్లడించడం కలకలం రేపింది. అయితే ఇసుక మాఫియా విషయంలో అందరిపై ఇలానే వ్యవహరిస్తారా అనే ప్రశ్న తలెత్తింది. గురువారం నాటి ఘటనలో ఇసుక మాఫియా వెనక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే టీడీపీలోకి వెళ్లిన ఓ ముఖ్యనాయకుడు ప్రధాన పాత్రధారునిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నాయకుడికి పట్టణంలోని ఓ ఎస్‌ఐ సహకారం పూర్తిగా ఉండడంతో ఇసుక అక్రమ రవాణాను మూడుపువ్వులు.. ఆరు కాయలుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ధనార్జనే లక్ష్యంగా టీడీపీ తీర్థం పుచుకున్న ఈ నాయకుడు కొందరు పోలీసులకు భారీగా మామూళ్లు ముట్టజెప్పి తన పనికి ఆటంకం లేకుండా చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకుల అండదండ, కాఖీ సహకారం ఉండడంతో ఆ నాయకుడు.. అనంతపురం నగర శివారు ప్రాంతాల్లోని వంకలు.. వాగుల్లోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జేసీబీలతో జోరుగా ఇసుకను తవ్వించి బెంగుళూరుకు తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసుల విచారణలో ఈ నాయకుని పేరు కూడా వినిపించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పాటు పై స్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆనాయకుని పేరు తప్పించి మిగిలిన వారి పేర్లు వెల్లడించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బెంగళూరుకు యథేచ్ఛగా రవాణా.. అనంతపురం పరిసర ప్రాంతాల్లోని వంకలు.. వాగులతో పాటు బుక్కరాయసముద్రం చెరువులో జేసీబీలతో ఇసుకను తవ్వుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా నగరంలోని శివారు ప్రాంతాల్లో నిల్వ (డంప్)చేసి అనంతరం అనుకూల వాతావరణం ఉన్నపుడు బెంగుళూరుకు లారీల్లో తరలిస్తున్నారు. దాడులు జరుగుతున్నాయనే సమాచారం ముందుగా అందితే, జాతీయ రహదారిపై కాకుండా దొడ్డిదారిన (గ్రామీణ ప్రాంతాల మీదుగా) చేరవేస్తున్నారు. బెంగుళూరులో ఇటీవల బహుళ అంతస్థుల నిర్మాణాలు ఊపందుకోవడంతో అక్కడ ఇసుకకు డిమాండ్ పెరిగింది.
టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.1200 దాకా విక్రయిస్తున్నారు. ఒక్కో లోడుపై రూ.25-రూ.35 వేల దాకా సంపాదిస్తున్నారు. ఎటువంటి రాయల్టీ లేకుండా ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు శాఖలోని సిబ్బందే సీఐ గోరంట్ల మాధవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో నిఘా ఉంచిన సీఐ గురువారం ఇసుకను తరలిస్తుండగా దాడి చేసి పట్టుకోవడం కలకలం రేపింది. పోలీసు అధికారుల్లో కూడా తీవ్ర చర్చకు తెరలేపింది. చాలా ప్రాంతాల్లో ఇసుక తరలిస్తూ పట్టుబడినప్పుడు ఆయా వాహనాలకు నామమాత్రపు జరిమానా వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
డ్రైవర్లు, కూలీలపై కేసులు పెడుతూ తెరవెనుక ఉన్న వ్యక్తులను వదిలేస్తున్నారు. బావురుమంటున్న పెన్నా, చిత్రావతి.. పోలీసులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుకాసురులు ఒక్క అనంతపురం పరిసర ప్రాంతాల్లోనే కాకుండా పామిడి , తాడిపత్రి సమీపంలోని పెన్నా తీరాన్ని కొల్లగొడుతున్నారు. ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చిత్రావతి కాలువలో సైతం ఇసుకును తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతాల్లో భూగర్బ జలాలు ప్రమాదకర స్థితికి పడిపోయాయి. వీటిపై స్థానికులు పలుమార్లు రెవిన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఈ అక్రమ వ్యాపారంలో వారి శాఖల సిబ్బంది కూడా తలమునకలై ఉండడంతో వారు నోరు మెదపకుండా ఉండిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇసుకను వేలం పాటల ద్వారా విక్రయించే బాధ్యత డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా అక్రమ తరలింపునకు పాల్పడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేయడం ఏవిధంగా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, తాము ఆర్థికంగా బలంగా ఉంటేనే సాధ్యమవుతుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చూసీ చూడనట్లు పోవాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.
అసలు దొంగలెవరు?
Published Fri, Aug 15 2014 3:39 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement