ఎస్టీలకు కేటాయించేందుకే అధిష్టానం మొగ్గు
రేసులో మణికుమారి, కాంతమ్మ, రవిబాబు
రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన
రెండో రోజు నామినేషన్లు నిల్
విశాఖపట్నం: శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ బరిలో నిలిచే రెండో కృష్ణుడిపై టీడీపీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఒక స్థానానికి ఇప్పటికే పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావు పేరును ఖరారుచేసిన అధిష్టానం రెండోస్థానం కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. సింగిల్ బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయన్న భావనతో పార్టీకి దక్కే ఆ ఒక్కస్థానానికి పప్పలను ఖరారు చేశారు. రెండో స్థానం నుంచి స్వతంత్రునికి మద్దతు ఇచ్చి..అతను గెలిస్తే ఆ తర్వాత పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనను తొలుత అధినాయకత్వం చేసింది.
కానీ రెండుస్థానాలకు వేర్వేరు బ్యాలెట్‌లతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించడం...మెజార్టీ ఓటర్లు తమ పార్టీకి చెందిన వారే ఉండడంతో రెండోస్థానం కూడా తమ ఖాతాలోనే పడుతుందన్న ధీమా ఆ పార్టీలో ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బయటవ్యక్తులను మద్దతిచ్చేకంటే పార్టీలోని వారికే కట్ట బెట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ రూరల్ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామా నాయుడు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబులతో పాటు పలుపురు పార్టీనేతలు కూడా ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తిని ఈ స్థానం నుంచి పోటీకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగింది. ఏజెన్సీలో పార్టీకి బలం లేనందున రెండో స్థానం ఎస్టీలకు కేటాయించడమే మేలన్న వాదనతో గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన మాజీ మంత్రి మణి కుమారికి ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోజెడ్పీమాజీ చైర్‌పర్శన్ వంజంగి కాంతమ్మ, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబులు కూడా తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మణి కుమారి, కాాంతమ్మ, రవిబాబులతో పాటు గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించిన అరకు, పాడేరు ప్రాంతాలకు చెందిన ద్వితీయశ్రేణినాయకులు కూడా ఎమ్మెల్సీ సీటుపై కన్నేశారు. ఎవరికి వారు పార్టీ అధినాయకత్వం వద్ద పైరవీలు సాగిస్తున్నారు.
అయితే ప్రధానంగా పోటీమాత్రం మణికుమారి, కాంతమ్మ, రవిబాబుల మధ్యే ఉందంటున్నారు. ఒకటి రెండ్రోజుల్లో రెండో అభ్యర్థి ఎవరనేది తేలనుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాగా రెండో రోజుకూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
రెండో స్థానమెవరికో?
Published Wed, Jun 10 2015 11:41 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement