సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ తరపున జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ముగ్గురిలో ఎవరు మంత్రి కాబోతున్నారు? ఆ పార్టీలో అప్పుడే ఈ చర్చకు తెర లేచింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకరరెడ్డి తన తరపున పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మంత్రిని చేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకు పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే పార్టీ విధేయత, సీనియారిటీ, సామాజిక బలంతో వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ఈ పదవి కోసం పోటీకి దిగారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించుకున్నా జిల్లాలో మంత్రి పదవికి పోటీ పడే సీనియర్లు మాత్రం ఓటమి చవిచూశారు. ఈ సారి గెలిస్తే కచ్చితంగా మంత్రి అవుతామని ఆశపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పరసా రత్నం పరాజయం పాలయ్యారు. ఆత్మకూరు నుంచి బొల్లినేని రామారావు మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. కోవూరు నుంచి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రెండో సారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.
ఈయన 2004లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి దూకి కోవూరు టికెట్ దక్కించుకుని మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. 2009 సార్వత్రిక, 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేక పోయారు. ఈ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు పోలంరెడ్డి మళ్లీ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసి కోవూరు టికెట్ దక్కించుకున్నారు. ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి పట్టుబట్టి పోలంరెడ్డిని తనతో పాటు టీడీపీలోకి తీసుకుని వచ్చి కోవూరు టికెట్ ఇప్పించారు. ఈ క్రమంలో పార్టీ నేతలు సోమిరెడ్డితో వైరం వ చ్చినా లెక్క పెట్టకుండా పోలంరెడ్డికే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి సాధించారు. ఇప్పుడు పోలంరెడ్డి గెలిచారు. ఆయన్ను తీసుకుని వచ్చిన ఆదాల ఓడారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో జరిగేది కానందువల్ల పోలంరెడ్డిని మంత్రిని చేసి అటు పార్టీని, ఇటు అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆదాల యోచిస్తున్నారని టీడీపీలో వినిపిస్తోంది.
ఇందులో భాగంగానే ఆదాల త్వరలోనే చంద్రబాబు నాయుడుతో ఈ విషయం గురించి మాట్లాడాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జిల్లాలో మంత్రి పదవి కేటాయించే విషయంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాటను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆలోచనతోనే ఆదాల తాను ప్రతిపాదిస్తున్న పోలంరెడ్డికి సోమిరెడ్డి మద్దతు కూడా సంపాదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమీకరణలన్నింటి దృష్ట్యా మంత్రి పదవి తననే వరిస్తుందని పోలంరెడ్డి లెక్కలు వేస్తున్నారు.
రేసులో కురుగొండ్ల
తెలుగుదేశం పార్టీ పట్ల తనకు ఉన్న విధేయత, వరుసగా రెండో సారి ఎమ్మెల్యే అయినందువల్ల మంత్రి పదవి తనకు వస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అంచనా వేస్తున్నారు. దీనికి తోడు సామాజిక వర్గ బలం కూడా తనకు అవకాశాలు దగ్గర చే స్తుందని భావిస్తున్నారు. ఈ అర్హతలే ఆధారంగా తాను కూడా పోటీలో నిలవాలని రామకృష్ణ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలోని సీనియర్ల చుట్టూ తిరిగే కంటే పార్టీ అధినేతకే తన కోరిక వివరించి మంత్రి పదవికి తన పేరు పరిశీలించాలని కోరాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలంరెడ్డి 2004లో టీడీపీ నుంచి వెళ్లిపోయి మళ్లీ పదవి కోసం పార్టీలోకి వచ్చారనీ, తాను మాత్రం తొలి నుంచి టీడీపీతోనే ఉన్నందువల్ల పార్టీ అధిష్టానం తప్పకుండా తన విధేయతను పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశతో ఆయన ఉన్నారు.
కురుగొండ్లా ..పోలంరెడ్డా ?
Published Sun, May 18 2014 2:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement