గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే హైదరాబాద్ సదస్సు దేశానికో వెలుగురేఖ వంటిదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు.
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే హైదరాబాద్ సదస్సు దేశానికో వెలుగురేఖ వంటిదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలో సంక్షుభితమైన దేశాన్ని కాపాడి, ఉత్తమ అభివృద్ధి మార్గం వైపు మళ్లించేందుకు తమ పార్టీ చేస్తున్న యత్నంలో భాగమే ఈ సదస్సని చెప్పారు. ఆదివారం ఎల్‌బీ స్టేడియంలో జరిగే సదస్సు ఏర్పాట్లను ఆయన పార్టీ నాయకులతో కలిసి శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... దేశం యావత్తు మోడీ ఏం చెబుతారోనని ఎదురుచూస్తోందన్నారు. మోడీ అంటే 3డీ (డైనమిక్, డెసెసివ్, డెవలప్‌మెంట్- ధీరత్వం, నిర్ణయాత్మకం, అభివృద్ధి) అని చెప్పారు. దేశాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌ను సాగనంపాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ ఎజెండాతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని, దేశ సమస్యలపై పార్టీ నిర్వహించే వంద సదస్సులో హైదరాబాద్ సభ మొదటిదని తెలిపారు. త్వరలో 542 నియోజకవర్గాల సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. అవినీతి, అరాచకాలపై నరేంద్ర మోడీ దండెత్తుతారని, యువతీయువకులు మోడీయే తమ నాయకుడని భావిస్తున్నారని ఆయన వివరించారు.
యువత తరలివస్తోంది: కిషన్‌రెడ్డి
మోడీ సదస్సు రాష్ట్ర యువతకే పరిమితం కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. రాజకీయ అస్థిరత, అసమర్థ నాయకత్వాన్ని పారదోలాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విశాఖపట్నానికి చెందిన పారిశ్రామిక వేత్తలు పి.సాంబమూర్తి, అమూల్ జైన్, ఎల్.శ్రీనివాస్, హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ తదితరులు శనివారం పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మోడీ హవాను ఎవ్వరూ ఆపలేరన్నారు. శ్రీకృష్ణ కమిటీయే ఓ పనికి మాలిన కమిటీ అనుకుంటే ఆంటోనీ కమిటీ అంతకుమించినదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అసమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయమే మోడీ అని నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవిభజనపై సీఎం కిరణ్ వ్యాఖ్యలు దుర్మార్గమైనవని విమర్శించారు. ఓ ప్రాంత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నందుకు కిరణ్‌కుమార్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, ఆచారీ తదితరులు పాల్గొన్నారు.
పీఠాధిపతులు, సాధువుల్ని కలవనున్న మోడీ..
నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొనే నరేంద్ర మోడీ విద్యార్థులు, మేధావులతో భేటీ అవుతారు. స్టేడియంలో సదస్సు అనంతరం నేరుగా ఆయన అక్కడకు వెళతారు. 15 మంది పీఠాధిపతులు, మరికొంతమంది సాధువులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపి ఆశీర్వాదం తీసుకుంటారని తెలిసింది.