మతలబేంటో...!
మంత్రి శ్రీధర్‌బాబు నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించడం వెనుక సీఎం మతలబు వేరే ఉందట. అసెంబ్లీ ప్రొరోగ్, విభజన బిల్లుపై చర్చ ప్రారంభించడం వంటి కారణాల వల్ల సీఎం ఆగ్రహంతో ఈ చర్య తీసుకోలేదట. తెలంగాణ ఏర్పడితే సీఎం రేసులో ఉన్నానంటున్న సీనియర్ నేత విశ్లేషణలపై అసెంబ్లీ లాబీల్లో రకరకాలుగా గుసగుసలు నడిచాయి. గురుశిష్యులిద్దరూ కూడబలుక్కొని వేసుకున్న పథకంలో భాగంగానే ఇలా చేశారని ప్రభుత్వంలో ‘‘నంబర్ 2’’ గా వ్యవహరిస్తున్న సీనియర్ మంత్రి కలిసినోళ్లందరికీ చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడితే సీఎం రేసులో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్‌లతో సహా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా ప్రచారంలోకి వచ్చిన వారిలో ఏ ఒక్కరూ సీఎం కిరణ్‌కు సన్నిహితులు లేరట. అదేమాత్రం మింగుడుపడని కిరణ్ వ్యూహాత్మకంగానే శ్రీధర్‌బాబు నుంచి తగిన సమయం చూసుకుని మరీ శాసనసభా వ్యవహారాలను తప్పించి తెలంగాణలో ఆయన్ను హీరోను చేయాలని భావించారట.
రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో... రాష్ట్రానికి రావలసినంత గ్యాస్ కేటాయించకుండా అడ్డుపడ్డారంటూ జైపాల్‌రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి కిరణ్ గతంలో ప్రయత్నించారు. సీఎంకు దామోదర అంటే సరిపడదు. విభేదాల విషయంలో ఒక్కొక్కరితో ఒక్కో కారణం ఉండగా, తెలంగాణ ఏర్పడితే సీఎం ఎవరవుతారన్న జాబితాలో ఆ పేర్లన్నీ ఉండటంతో... ఆ జాబితాలోకి శ్రీధర్‌బాబు పేరును చేర్చాలన్న వ్యూహంతోనే అసెంబ్లీ మలివిడత సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు శాసనసభా వ్యవహారాలను తప్పించారని, అదంతా గురు శిష్యుల కథ అంటూ ‘‘నంబర్ 2’’ తెలంగాణ నేతల చెవిలో వేస్తున్నారు. శ్రీధర్‌బాబు తనను కలిసినప్పుడు రాజీనామా చేయాలా? వద్దా అన్న ప్రస్తావన వచ్చిందనీ...! గురుశిష్యుల సంగతి తెలుసు కనుకే ఆ విషయంలో తానేమీ చెప్పలేదని, రాజీనామా చేయొద్దని కాంగ్రెస్‌లో ఎంతోమంది శ్రీధర్‌బాబుకు చెప్పారని, అయినా రాజీనామా చేశారంటే దానర్థం వేరే ఏముంటుందని ‘‘నంబర్ 2’’ అసెంబ్లీ లాబీల్లో విశ్లేషించారు. అలా చేయడం ద్వారా శ్రీధర్‌బాబును తెలంగాణలో చాంపియన్ చేయాలన్న వ్యూహంతో కిరణ్ శాఖ నుంచి తప్పించినా కొత్తగా వచ్చిన ఆటగాడు ‘ఎక్స్‌ట్రా ప్లేయర్’ గా మాత్రమే ఉంటారని, బ్యాటింగ్ చేసే అవకాశం లేదన్న విషయం సీఎంకు తెలిసినట్టు లేదని చెప్పేస్తున్నారట. ఎవరి గోల వారిదంటే ఇదేనేమో....!!!