
తుళ్లూరుపై కెమెరా కన్ను
విస్తృతంగా షూటింగ్‌లు
కెమెరాలతో వీడియో, ఫొటోగ్రాఫర్ల హడావుడి
తుళ్లూరు అందాలు, స్థల పురాణాల చిత్రీకరణలు
డాక్యుమెంటరీ తీస్తున్న జర్నలిజం విద్యార్థులు
తుళ్లూరు అందాలు కెమెరా కళ్లలో బందీ అవుతున్నారుు. నిజమే.. భవిష్యత్తులో ఇక్కడి పచ్చటి పొలాలు, సెలయేటి పరవళ్లు, వాగులు, వంకలు కనుమరుగై కాంక్రీట్ జంగిల్ ప్రత్యక్షం కానున్న నేపథ్యంలో అనేక సినీ సంస్థలు, విద్యార్థులు ఇప్పటి అందాలను చిత్రీకరించి భద్రపరుస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వీడియో, ఫొటోగ్రాఫర్లు కెమెరాలు చేతపట్టుకుని తుళ్లూరులో పర్యటిస్తున్నారు.
గతంలో మాజీమంత్రి, తాడికొండ మాజీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ తుళ్లూరు మండలంలోని ప్రతి గ్రామంపై డాక్యుమెంటరీలు తీసి భావితరాలకు అందిస్తామని ప్రకటించారు. తాజాగా మద్రాసుకు చెందిన ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం విద్యార్థులు పది రోజులుగా మండలంలోని ప్రతి గ్రామాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అలాగే, అనేక టీవీ చానళ్లు, పత్రికల ఫొటోగ్రాఫర్లు కూడా తుళ్లూరు మండలంలోని అనేక ప్రాంతాలను ఫొటోలు తీస్తున్నారు. ఇటీవల వారాహి చలనచిత్ర సంస్థ కూడా తుళ్లూరు అందాలను వీడియో తీసింది. నవజన జాగృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి స్థల పురాణాలు, ప్రత్యేకతలు చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నారు.
- తుళ్లూరు