ప్రకాశం జిల్లా / సింగరాయకొండ: రైలులో కలిశాడు. మాటలతో మైమరిపించాడు. నీవు లేనిదే బతకలేనన్నాడు. చివరకు పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన భర్తకు తాను రెండో భార్యనని తెలిసి ఆ అభాగ్యురాలు విలపించింది. అయినా భర్త అండగా ఉన్నాడనుకుంది.. కానీ ఆ భర్తే చివరకు డబ్బు కోసం చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ ఆవులవారిపాలెంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బండి గ్రామానికి చెందిన అంగూరు మోహన్‌రావు, సావిత్రి దంపతులు బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ వచ్చి అక్కడే నివాసం ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి హేమలత (19)తో పాటు కొడుకు ఉన్నారు. చదువులో రాణిస్తున్న హేమలతను డిగ్రీ వరకు చదివించి కానిస్టేబుల్ ట్రైనింగ్‌కు కూడా పంపించారు.
ప్రేమలో పడిన హేమలత
ఏడాది క్రితం హేమలత చెన్నైలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తోంది. సింగరాయకొండ మండలం పాకల ఆదిఆంధ్ర కాలనీకి చెందిన ఎల్లూరి అనిల్ ఆమెకు తారసపడ్డాడు. అనిల్ హైదరాబాద్‌లో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి చివరకు ప్రేమగా మారింది. తర్వాత ఒకరోజు హేమలత ఇంట్లో నుంచి పారిపోయి అనిల్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు హేమలత తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసుస్టేషన్‌లో కుమార్తె కనబడటం లేదని ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని హేమలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చివరకు వారిద్దరు మేజర్లు కావడంతో తామేమీ చేయలేమని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పి పంపించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని వచ్చిన కుమార్తెను ఆదరించి ఇంట్లో ఉంచుకున్నారు. రెండు నెలలు ఇంట్లో ఉన్న తర్వాత భార్యను తన స్వగ్రామం పాకల ఇంటికి తీసుకెళ్లాడు.
బయట పడిని మోసం
పాకల వచ్చిన హేమలతకు తన భర్త అనిల్ చేసిన మోసం తెలిసేసరికి అప్పటికే సమయం దాటిపోయింది. అప్పటికే ఆమె గర్భిణి. అనిల్ తన బంధువుల అమ్మాయిని మొదట పెళ్లి చేసుకున్నాడని తెలిసి హతాశురాలైంది. చేసేది లేక భర్తనే నమ్ముకుంది. మొదటి భార్య తల్లిదండ్రులు అనిల్‌ను తమ బిడ్డ సంగతేంటని నిలదీయడంతో మీ అమ్మాయికి విడాకులిస్తానని చెప్పాడు. అనిల్ తల్లి ఎలీసమ్మ తన ఇల్లు తాకట్టు పెట్టి రూ.50 వేలు అప్పు చేసి ఇచ్చి పెద్ద కోడలితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంది.
వారం క్రితం ఆవులవారిపాలెంలో మకాం
హేమలత ఇటీవల పండంటి కుమారుడిని ప్రసవించింది. పుట్టిన బిడ్డకు పసికర్లు అని బాక్స్‌లో పెట్టటంతో ఖర్చుల కోసం హేమలత తన తండ్రిని ప్రాధేయపడగా ఖర్చుల కోసం రూ.14 వేలు పంపించాడు. అంతేగాక తల్లి సావిత్ర కూడా మరో రూ.20 వేలు ఇచ్చింది. వారం క్రితం హేమలత అత్త ఎలీసమ్మ తన కొడుకు, కోడలిని అవులవారిపాలెంలో ఇల్లు తీసుకుని వారితో కాపురం పెట్టించింది.
ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం
శనివారం రాత్రి 8 గంటల సమయంలో అనిల్ తన అత్త సావిత్రికి ఫోన్ చేసి 2 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్తూ పక్కింటి వారు ముగ్గు వేస్తున్నారని, నీవు కూడా ముగ్గు వేయమని బయట నుంచి కేకవేసి వెళ్లాడని, ఆ తర్వాత అరగంట ద్వారా తిరిగి వచ్చి తన భార్య చీరెతో దూలానికి ఉరేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
హత్యేనంటున్న హేమలత తల్లిదండ్రులు
తన అల్లుడు 8 గంటలకు డబ్బు కావాలని ఫోన్ చేశాడని, మళ్లీ 9 గంటలకు ఫోన్ చేసి హేమలత చనిపోయిందని చెప్పాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. తన అల్లుడి కారణంగా మనుమడి భవిష్యత్తు ఏమిటని, కేవలం 15 నెలల పిల్లాడేనని, ఏం చేయాల్లో అర్థం కావటం లేదని హేమలత తల్లిదండ్రులు విలపించటం స్థానికులను కలచివేసింది. ఈ కేసును విచారిస్తున్న సీఐ ఓ.దుర్గాప్రసాద్, ఎస్‌ఐ వి.నాగమల్లేశ్వరరావు మాత్రం హేమలత మెడపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికి హత్యేనని అనుమానిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment