అత్తవారింట్లో కోడలి ప్రవేశం!
Published Tue, Mar 21 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
► నిరసన విడిచి.. తాళాలు పగలగొట్టి..
► అండగా నిలిచిన మహిళా సంఘాలు
► పరారీలో ఉన్న భర్త, అత్తమామలు
బత్తిలి: నాలుగు రోజులు నుంచి అత్తవారింటి ముందు ఓ కోడలు నిరసన ప్రదర్శన చేస్తోంది. ఆమె భర్తతోపాటు, అత్తమామలు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయినా.. ఆమె నిరసన ఆపలేదు. చివరికి అత్తవారింటి తాళాలు పగలగొట్టి.. ఆమె లోపలికి ప్రవేశించింది
నాలుగు రోజులుగా ఇక్కడే నిరస... భామిని మండలం బత్తిలికి చెందిన బోయిన సుమన్‌కుమార్.. భార్య నవీనను నాలుగేళ్లుగా ఆమె కన్నవారింట్లో వదిలిపెట్టాడు. ఎంతకూ తీసుకురాకపోవడంతో ఆమె నాలుగు రోజుల క్రితం అత్తవారింటికి చేరుకుంది. అయితే, ఆమెను లోపలికి అత్తవారు రానీయలేదు. దీంతో నవీన అత్తవారింటి ముందే నిరసన చేపట్టింది. అక్కడే ఆరుబయట కూర్చొంటూ ఎండకు
ఎండతూ, వానకు తడస్తూ నిరసన కొనసాగించింది. వంటావార్పు అక్కడే చేపట్టింది. మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి.
అత్తమామలు ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు స్వయంగా వెళ్లి.. బాధితురాలు నవీనతో మాట్లాడారు. బాధితురాలి భర్త, మామలతో ఫోన్‌లో మాట్లాడారు. వారిలో మార్పు రాలేదు. అయితే, వారిపై కేసు పెట్టేందుకు కోడలు నవీన కూడా అంగీకరించలేదు. దీంతో పోలీసులూ ఏమీ చేయలేక వెనుదిరిగారు. చివరికి సహనం నశించిన నవీన..
సోమవారం ఐద్వా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆ ఇంటి తాళాలను పగలగొట్టింది. తల్లిదండ్రులు గుడ్ల సుశీల, లింగరాజులతో కలసి లోపలికి ప్రవేశించింది. ఆమె వెంట ఐద్వా సంఘ జిల్లా ఉపాధ్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మ, బత్తిలి వీఓ అధ్యక్షురాలు ఆరికి గౌరమ్మ, మండల నాయకులు దశాలమ్మ, చిట్టెమ్మ, సుహాసిని ఉన్నారు.
Advertisement
Advertisement