కడప అర్బన్ : తన భర్త, కుమార్తెతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన భార్య, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త వివాహేతర సంబంధం మానుకోవాల ని మందలించాడు. తాను విధినిర్వహణకు వెళ్లే సమయంలో భార్యను ఇంటిలో పెట్టి, తాళం వేసి వెళ్లేవాడు. తన భర్త డ్యూటీకి వెళ్లగానే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని నేరుగా తన ఇంటికే పిలిపించుకునేది. ఈ క్రమంలో సదరు భర్త, సునీల్ కుమార్‌ను చంపుతానని ఊరిలో అక్కడక్కడా చెప్పాడు.
అలాగే భార్యను వేధించేవాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దీంతో వారిద్దరూ పక్కా స్కెచ్ వేసుకున్నారు. తాము అనుకున్న ప్రకారం డ్యూటీకి వెళుతున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని మరోచోటికి తీసుకుని వెళ్లి ప్రమాద సంఘటనగా చిత్రీకరించారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. భార్య, స్నేహితుడితో పాటు మొత్తం నలుగురు కటకటాల పాలయ్యారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా వెల్లడించారు.
జిల్లాలోని ముద్దనూరు మండలం కోసినేపల్లెకు చెందిన కునపులి గంగానాయుడు 2011 నుంచి ఆర్టీపీపీలో కోల్‌ప్లాంట్‌లో మెయింటెనెన్స్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చందా సునీల్‌కుమార్‌తో గంగానాయుడు భార్య కుళ్లాయమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న కుళ్లాయమ్మ భర్త గంగానాయుడు తన భార్యను మందలించాడు. అంతేగాక తాను డ్యూటీకి వెళ్లే సమయంలో భార్యను ఇంటిలోపెట్టి తాళం వేసుకుని వెళ్లేవాడు. అయినా తన భర్త విధులకు వెళ్లగానే సునీల్ కుమార్‌ను ఇంటికి పిలిపించుకునేది. ఈ క్రమంలోనే వీరిరువురు గంగానాయుడు అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. పథకం పన్నారు. ఇందుకోసం సునీల్‌కుమార్ తన బంధువు వీరభద్రుడు, స్నేహితుడు గంగరాజులకు డబ్బు ఆశ చూపి గంగానాయుడు హత్యకు పక్కా ప్రణాళిక రూపొందించారు.
ఈనెల 4న తన భర్త రాత్రి డ్యూటీకి వెళ్లగానే సునీల్‌కుమార్‌కు కుళ్లాయమ్మ ఫోన్ చేసి చెప్పింది. ముందుగా అనుకున్న ప్రకారం గంగానాయుడు డ్యూటీకి వెళ్లే మార్గమధ్యంలో గంగరాజు తోట వద్ద, ముగ్గురు నిందితులు కాపు కాసి అతనిపై దాడి చేసి, నోరు మూసి, రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి ఈడ్చుకునిపోయి దారుణంగా తలకు లుంగీకట్టి కాళ్లతో తన్ని, రాళ్లతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని ఆర్‌టీపీపీ 600డబ్లు్యప్లాంట్ సమీపాన ఆర్‌టీపీపీ–సున్నపురాళ్ల పల్లి రోడ్డులో మోటర్‌సైకిల్‌ను, మృతదేహాన్ని పడేసి హతుడి మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.
ఈ సంఘటనను కొండాపురం సీఐ చిన్నపెద్దయ్య, ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి, కలమల్ల ఎస్‌ఐ చిరంజీవి తమ సిబ్బందితో చాకచక్యంగా విచారించారు. హత్య కేసును ఛేదించి, నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ముద్దనూరు మండలం కొసినేపల్లి గ్రామానికి చెందిన చందా సునీల్‌కుమార్, అతని బంధువు పంజగాళ్ల వీరభద్రుడు, తాటి గంగరాజుతో పాటు హతుడు గంగానాయుడు భార్య కుళ్లాయమ్మను అరెస్ట్ చేశారు. కేసు ఛేదించినందుకు పోలీసులను కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment