నిందితుడి అరెస్టు వివరాలను తెలుపుతున్న కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): చెన్నూరు మండలం కొండపేట గ్రామం వనం వీధిలో నివసించే కె.జ్యోతి(26) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆమెను గొంతునులిమి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఆదివారం కడపలో డీఎస్పీ వెంకటశివారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామం వనంవీధిలో నివాసం ఉంటున్న రంగనాయకులు భార్య కె. జ్యోతి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మరణంపై అనుమానం ఉందని జ్యోతి తల్లి అనంతపురం రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య కేసుగా మార్చిన పోలీసులు కడప అర్బన్ సీఐ ఎస్‌ఎం ఆలీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
చదవండి: తల్లి పాడు పని.. కూతురు మందలించిందన్న కోపంతో ప్రియుడితో కలిసి..
ఈ బృందం వివిధ కోణాలలో విచారించి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రామిరెడ్డి కాలనీకి చెందిన హమాలీ బోయ నాగరాజుని నిందితుడిగా గుర్తించింది. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు ఈనెల 26న కొండపేట వీఆర్‌ఓ సుధీర్‌కుమార్ వద్ద లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. జ్యోతి తన అత్తగారి ఊరైన బుక్కరాయసముద్రం మండలం వాడియంపేటకు వెళ్లి వచ్చే క్రమంలో నాగరాజుతో పరిచయమైంది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. దీంతో అతను తరచూ కొండపేటలోని జ్యోతి ఇంటికి వచ్చేవాడు.
ఈ క్రమంలోనే ఈనెల 17న మృతురాలి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి గ్రామంలో తెలిస్తే తన సంసారం పాడవుతుందని, ఇకపై తన వద్దకు రావద్దని ఆమె చెప్పింది. ఇందుకు అంగీకరించని నాగరాజు ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇంట్లో నుంచి డబ్బులు, బంగారు ఆభరణాలు దొంగిలించుకుని వెళ్లాడు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు జతకమ్మలు, బంగారు పుస్తె, రూ.800 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేయడంలో కృషిచేసిన సీఐ, ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డితో పాటు, ఏఎస్‌ఐ ఎం. జాకీర్‌హుసేన్, హెడ్‌కానిస్టేబుల్ ఐ.జగన్‌నాయక్, కానిస్టేబుళ్లు కె.బాషా, కె. నాగరాజు, జి. రాజీవ్‌కుమార్, డి.వి భార్గవ్‌లను ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment