
కొడుకును కనలేదని కడతేర్చాడు..!
చిత్రాడ (పిఠాపురం రూరల్) : ‘పురిటి నొప్పులు ఎరుగని పురుషజాతికి తల్లివైతివే..అమ్మ నీకు దండమే.. అర్థాంగి నీకు దండమే’ అంటూ స్త్రీ విశిష్టతను, ఉత్కృష్టతను ఎత్తిచూపాడో కవి. అయితే కాలం మారినా, స్త్రీలు సమాజ పునరుత్పత్తి భారాన్ని మోయడమనే ప్రత్యేక బాధ్యతతో పాటు ప్రతి రంగంలో ప్రతిభాపాటవాలు చాటుకుని, జయకేతనాలు ఎగరేస్తున్నా.. ఆడపుటకను హీనమైందిగా, మగబిడ్డనే వంశోద్ధారకుడిగా భావించే మౌఢ్యం ఇప్పటికీ బలంగానే ఉంది. కొందరు ఆడపిల్లలు, వారికి జన్మనిచ్చిన తల్లులు అన్యాయంగా బలవడానికి కారణమవుతూనే ఉంది. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన లారీ డ్రైవర్ పండు నాగేశ్వరరావు.. రెండో కాన్పులోనూ ఆడపిల్లనే కన్నదన్న ఆగ్రహంతో గురువారం అర్ధరాత్రి భార్యను గొంతు నులిమి చంపేసిన దారుణమే ఇందుకు నిదర్శనం. అత్తింటి వారికి రూ.లక్ష ఇచ్చి, గుట్టుచప్పుడు కాకుండా ఈ ఘాతుకాన్ని కప్పెట్టాలనుకున్నా.. ఎవరో పోలీసులకు ఇచ్చిన సమాచారంతో వెలుగు చూసింది. పోలీసులు, హతురాలి తల్లి బొబ్బరాడ రాఘవ, సోదరుడు సోమరాజు, చిన్నాన్న కృష్ణ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
చిత్రాడ ఎస్సీ పేటలో ఎదురెదురు ఇళ్లకు చెందిన నాగేశ్వరరావు, శ్రీలక్ష్మి (28)ని 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆలస్యంగా తల్లి అయిన శ్రీలక్ష్మికి మొదటి కాన్పులో ఆడపిల్లకు పుట్టింది. మళ్లీ మూడు నెలల క్రితం మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మగబిడ్డ కావాలనుకున్న నాగేశ్వరరావు భార్యను తప్పు పట్టసాగాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు శ్రీలక్ష్మిని చంపి, మగబిడ్డ కోసం మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని, అతడి కుటుంబసభ్యులు కూడా ఆ నిర్ణయాన్ని బలపరిచారని శ్రీలక్ష్మి కుటుంబసభ్యులు అంటున్నారు. కాగా గురువారం అర్ధరాత్రి సమయంలో నాగేశ్వరరావు ఇంటి నుంచి కేకలు శ్రీలక్ష్మి పుట్టింటి వారు వెళ్లి చూశారు. అప్పటికే కిందపడి ఉన్న శ్రీలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నాగేశ్వరరావు వారికి చెప్పాడు. అయితే ఆమె కొన ఊపిరితో ఉన్నట్టు గమనించిన వారు ఆటోలో పిఠాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. దీపావళి పొగకు ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పిందని అక్కడి డాక్టర్‌కు చెప్పారు. అయితే మెడపై గాయాన్ని గమనించిన డాక్టర్ ఆమెను పరిశీలించి అప్పటికే చనిపోయిందని, ఆమెను హత్య చేసి ఉంటారని చెప్పారు.
ప్రాణం ఖరీదు రూ.లక్ష..
జరిగిన దారుణంపై శ్రీలక్ష్మి కుటుంబం ఫిర్యాదు చెయ్యకుండా ఉండేలా పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. అందుకు బదులు ఆమె ఇద్దరు బిడ్డలకు చెరో రూ.50 వేలు, ఇల్లు ఇచ్చేందుకు నాగేశ్వరరావు లిఖితపూర్వకంగా అంగీకరించాడు. ఏ పూటకా పూట కూలికి వెళితే తప్ప కూటికి కటకటపడాల్సి వచ్చే పేదరికంతో ఇద్దరు ఆడపిల్లలను సాకడం కష్టమన్న భావనతో శ్రీలక్ష్మి కుటుంబం రాజీకి అంగీకరించారు. అయితే ఈ వ్యవహారాన్ని ఎవరో 100 నంబర్‌కి ఫోన్ చేసి చెప్పడంతో శుక్రవారం పోలీసులు చిత్రాడ వచ్చి ఆరా తీశారు. దాంతో విషయం వెలుగు చూసింది. శ్రీలక్ష్మిని ఖననం చేసిన చోటును పోలీసులు సందర్శించారు. మృతదేహాన్ని శనివారం తహశీల్దార్ సమక్షంలో వెలికితీయించి, పోస్టుమార్టం చేయిస్తామని ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతురాలి తండ్రి బొబ్బరాడ ఏసుబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదికను అనుసరించి సెక్షన్‌లు మారుస్తామని చెప్పారు.