
శ్రీవారి కొండలపై దావానలం!!
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న ఏడు కొండల్లో మొట్టమొదటిదైన శేషాద్రి మీద మొదలైన కార్చిచ్చు.. ఎంతకీ ఆరట్లేదు. ఎవరు ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రకృతి పగబట్టినట్లు మంటలు మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ మంటలు తిరుమల వైపు వ్యాపించాయి. పవన విద్యుత్ కేంద్రాల వరకు కూడా మంటలు ఎగబాకడంతో టీటీడీ అధికారులు పాపవినాశనానికి వెళ్లే దారి మూసేశారు. పాపవినాశనం, ఆకాశగంగ, గోపాలస్వామి దారులు మూతపడ్డాయి. కొండపైకి కాలినడక భక్తులకు అనుమతి నిరాకరించారు.
మంగళం డీసీఆర్ కాలనీలో సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. టీటీడీ, ఫైర్ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో వందలాది ఎకరాల్లో వృక్షసంపద బుగ్గిపాలైంది. కొంతమంది సిబ్బంది కూడా ఈ మంటల్లో చిక్కుకోవడంతో వెంటనే సంఘటన స్థలానికి అంబులెన్స్ తరలించారు. ఏం చేసినా మంటలు ఆరకపోవడంతో.. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు.