టీ సర్కారు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం
కేసీఆర్ ఇంకా ఉద్యమకారునిగానే మాట్లాడుతున్నారు
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం స్థానికతకు కొత్త నిర్వచనం చెప్పడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. 1956కు ముందు తెలంగాణలో ఉన్నవారినే స్థానికులుగా గుర్తించి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. కేసీఆర్ సీఎంగా కాకుండా ఇంకా ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. సెటిలర్స్ అనే పదమే తనకు నచ్చదని, వారి కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు సీమాంధ్ర వారి కళ్లల్లో ముల్లు గుచ్చుకుంటే కాళ్లు చూపిస్తున్నాడని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌పై రాజకీయం చేయవద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా ఏపీ విద్యార్థులకు తమ ప్రభుత్వం ఫీజు చెల్లించే అంశంపై విలేకరులడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మొదలు పెట్టిన ‘1956 స్థానికత’ వివాదం ఇక్కడితో ఆగిపోదని, భవిష్యత్‌లో అడ్మిషన్లు, ఉద్యోగాలకూ విస్తరిస్తుందని, తర్వాత ఆంధ్రప్రదేశ్ వారంతా వెళ్లిపోవాలని డిమాండ్ చేసేవరకు వెళుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.